Share News

రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:50 AM

రాష్ట్రంలో ప్రస్తుతం జంగిల్‌రాజ్‌ సాగుతోంది. ఎన్నికల అనంతరం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది’

రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌

వచ్చేది బాబు ప్రభుత్వమే: అరుణ్‌సింగ్‌

తిరుపతి, ఏప్రిల్‌ 4: ‘రాష్ట్రంలో ప్రస్తుతం జంగిల్‌రాజ్‌ సాగుతోంది. ఎన్నికల అనంతరం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అరుణ్‌సింగ్‌ అన్నారు. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీల సమావేశం తిరుపతిలో గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన అరుణ్‌సింగ్‌ మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ల్యాండ్‌, శాండ్‌, లిక్కర్‌ మాఫియా యథేచ్ఛగా సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించింది. నిధులన్నీ వైసీపీ నేత జేబుల్లోకి వెళ్లాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులనూ స్వప్రయోజనాలకే వాడారు. జగన్‌ అండ్‌ కో ఏపీని దోచేశారు. ఎన్నో పథకాలకు కేంద్రం, రాష్ట్రానికి నిధులు అందించింది. ఐతే ఆయా పఽథకాలకు కనీసం ప్రధాని స్టిక్కర్‌ కూడా వైసీపీ ప్రభుత్వం ఉంచలేదు. ఏపీకి మంచి భవిష్యత్తు, అభివృద్ధి ఇవ్వాలనే ఆశయంతో బీజేపీ, జనసేన, టీడీపీ ఓ కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి ప్రభంజనంలో వైసీపీ చాపచుట్టేయడం ఖాయం’ అని అన్నారు. కాగా, సమావేశం జరుగుతుండగా లోపలకు చేరుకున్న మాదిగ మహా జనసంఘ్‌ నాయకులు తిరుపతి జిల్లాలో రెండు అసెంబ్లీ, తిరుపతి ఎంపీ స్థానాన్ని మాదిగలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అరుణ్‌సింగ్‌ను కలిసి ఈ విషయం చెప్పేందుకు ఎంఎంజేఎస్‌ నాయకులు ప్రయత్నించారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని రావడంతో పార్టీ సమావేశంలోకి ఇలా ప్రవేశించడం సరికాదని, సమావేశం ముగిశాక నాయకులను కలవాలని స్థానిక బీజేపీ నాయకులు సూచించారు. ఈ సందర్భంగా ఎంఎంజేఎస్‌ అధ్యక్షుడు కరాటపు సుధాకర్‌బాబు మాట్లాడుతూ... ఏపీలో మాదిగలకు ఎన్నికల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించపోతే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తాం’ అని హెచ్చరించారు.

Updated Date - Apr 05 , 2024 | 03:51 AM