Share News

పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధానా?

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:41 AM

రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమవుతుందని రాష్ట్ర విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధానా?

అది మా ప్రభుత్వ విధానం కాదు

అనుభవం ఉన్న నేత ఎవరూ అలా మాట్లాడరు

బకాయిలిస్తామన్నా ఉద్యోగుల ఆందోళన: బొత్స

విశాఖపట్నం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమవుతుందని రాష్ట్ర విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేయరని, వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను మీడియానే వక్రీకరించిందని అన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్నది తమ ప్రభుత్వ విధానం కాదని చెప్పారు. ఆయన బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘హైదరాబాద్‌ విశ్వనగరం. అక్కడ ఎవరికైనా ఆస్తులు ఉండవచ్చు. అక్కడ నాకు కూడా ఇల్లు ఉంది. నేను ఏపీ మంత్రిని కాబట్టి ఆ ఇంటిని అక్కడి ప్రభుత్వం కబ్జా చేస్తుందా’ అని ప్రశ్నించారు. విశాఖ పరిపాలనా రాజధాని గురించి విలేకరులు ప్రస్తావించగా.. తాము సిద్ధంగా ఉన్నా, కొంత మంది రాక్షసులు తమ యజ్ఞాన్ని భగ్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని, వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తమది మాత్రం ఒంటరి పోరేనని స్పష్టంచేశారు. ‘రాష్ట్రంలో ఉద్యోగులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. వారి సమస్యలపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపాం. పీఎఫ్‌ సహా అన్ని బకాయిలను ఒకట్రెండు నెలల్లో తీర్చేస్తామని చెప్పినప్పటికీ ఆందోళన చేయడం ఆశ్చర్యంగా ఉంది. పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు లేకుండా ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం. టెట్‌ను వాయిదా వేయాలని ఇప్పుడు కోరడం సమంజసం కాదు. వారి డిమాండ్‌ మేరకే టెట్‌ నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేశాం’ అని చెప్పారు.

Updated Date - Feb 15 , 2024 | 06:59 AM