Share News

ఉద్యోగ జేఏసీ నిరసనలు

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:06 AM

ఏపీజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

ఉద్యోగ జేఏసీ నిరసనలు
ఆదోనిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న ఉద్యోగ జేఏసీ నాయకులు

జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికు నాయకుల ఆందోళనలు

‘నాలుగున్నరేళ్లుగా ఉద్యోగుల సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదు. ఒకటో తేదీన జీతాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక ఈ ప్రభుత్వాన్ని భరించలేం. గద్దె దింపాలని ఐక్యంగా కృతనిశ్చయంతో ఉన్నాం.. సమస్యలు పరిష్కరించకపోతే సీఎం జగన్‌రెడ్డి రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే. తక్షణమే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 12వ పీఆర్సీలోని మధ్యంతర భృతి 30 శాతం చెల్లించాలని’ డిమాండ్‌ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

ఆదోని (అగ్రికల్చర్‌), ఫిబ్రవరి 14: ఏపీజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యాసీన్‌ బాషా మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ఒకటో తేదీన జీతాలు తీసుకోలేని పరిస్థితిలో ఉద్యోగులమున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండిగ్‌లో ఉన్న డీఏలను, సీపీఎస్‌ వారికి డీఏ అరియర్స్‌ 90 శాతం నగుదుగా చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏపీఎన్జీవో ఉపాధ్యక్షురాలు ఉషారిణి, వెంకటేశ్వర్లు, సునీత, దీప, ఆర్టీసీ కార్మికులు హరిబాబు, లక్ష్మన్న పాల్గొన్నారు

ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు

ఆలూరు : ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల సమస్య పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం తగదని ఏపీజేఏసీ ఆలూరు తాలూకా చైర్మన్‌ మోహన్‌, ఎన్జీవో కార్యదర్శి బాలకృష్ణ ఆరోపించారు. బుదవారం జేఏసీ పిలుపు మేరకు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఖాసీం, రమేష్‌, చిన్న ఉలిగప్ప, శేఖర్‌, గుండాల నాయక్‌, రవి, ఆనంద్‌ పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు రూరల్‌: ఏపీజేఏసీ జిల్లా కమిటీ పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ శేషారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వరప్రసాద్‌, శివరామిరెడ్డి, సురేష్‌, రామకృష్ణ, నరసింహులు, నరేష్‌, సరస్వతి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కరెకృష్ణ, యల్లప్ప, కాశింజి, మధర్‌సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

నల్లబ్యాడ్జీలతో నిరసన

పత్తికొండ : పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులసమస్యలు పరిష్కరించాలంటూ ఉడ్యోగ జేఏసీ నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. స్థానిక నాలుగు స్తంభాల కూడలి నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలంలో వినతిపత్రాన్ని అందించారు. నాయకులు సాయిబాబా, టీఎండి హుసేన్‌, వీరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:06 AM