తండ్రిని మించిన ఆధిక్యం
ABN , Publish Date - Jun 06 , 2024 | 12:14 AM
తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ విజయంతో మెజార్టీలో తండ్రిని మించిన తనయుడిగా జేసీ అశ్మితరెడ్డిని కొనియాడుతున్నారు. రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకత సంతరించుకున్న నియోజకవర్గ ఫలితంపై రాష్ట్ర ప్ర జలు ఎంతో ఆసక్తి కనబరిచారు.
రికార్డు మెజార్టీ సాధించిన జేసీ అశ్మితరెడ్డి
తాడిపత్రిటౌన, జూన 6: తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ విజయంతో మెజార్టీలో తండ్రిని మించిన తనయుడిగా జేసీ అశ్మితరెడ్డిని కొనియాడుతున్నారు. రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకత సంతరించుకున్న నియోజకవర్గ ఫలితంపై రాష్ట్ర ప్ర జలు ఎంతో ఆసక్తి కనబరిచారు. ఎందుకంటే మూ డేళ్ల కిందట జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రమం తా ఫ్యాన హవా చూపినా తాడిపత్రిలో మాత్రం సైకిల్ జోరు చూపించింది. దీంతో ఈ సెగ్మెంట్‌పై అందరి చూపు పడింది. అందరూ అనుకున్న విధంగానే టీడీపీ జోరు చూపించి జేసీ అశ్మితరెడ్డి ఘనవిజయం సాధించాడు. దీనివెనుక జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అశ్మితరెడ్డిలు పడిన కష్టం అంతాఇంతా కాదు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఎన్నో ఇబ్బందుల ను అధిగమిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
జేసీ ఫ్యామిలీకి కంచుకోట
40ఏళ్లుగా జేసీ ఫ్యామిలీకి తాడిపత్రి కంచుకోటగా ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి జేసీ దివాకర్‌రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. కానీ వీరికి రికార్డు మెజార్టీ ఎప్పుడూ రాలేదు. ఆ లోటును జేసీ అశ్మితరెడ్డి తీర్చాడు. 1951లో ఏర్పడిన తాడిపత్రి నియోజకవర్గంలో ఇంత వరకు ఎన్నడూ రాని రీతిలో జేసీ అశ్మితరెడ్డి 29068ఓట్ల మెజార్టీ సాధించాడు. తాడిపత్రి నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జేసీ సోదరులు గెలిచేవారు. కానీ 2019లో జరిగిన ఎన్నికల్లో ఫ్యాన హ వాలో మొదటిసారి టీడీపీ తరపున పోటీచేసిన జేసీ అశ్మితరెడ్డి ఓటమిపాలయ్యారు. కానీ ఆయన ఏమాత్రం నిరాశపడలేదు. ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో విశ్లేషించుకున్నారు, చిన్నచిన్న లోపాలను సరిదిద్దుకొని ఉవ్వెత్తున కెరటంలా లేచి నిలబడి ప్ర స్తుత ఎన్నికల్లో విజయం సాధించాడు. దీంతో జేసీ ఫ్యామిలీ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది.
నెరవేరిన జేసీపీఆర్ కల
తాడిపత్రిలో మున్సిపల్ చైర్మనగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఉంటున్నారు. తన కుమారుడు జేసీ అశ్మితరెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలన్నది ఆయన కల. అది ప్రస్తుత ఎన్నికల్లో నెరవేరడంతో ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తాను మున్సిపల్ చైర్మన కాగా తన కుమారుడు ఎమ్మెల్యే అని అందరికి చెప్పుకుంటూ మురిసిపోతున్నాడు. అభివృద్ధిలో తండ్రిని మించి చేయాలని జేసీ అశ్మితరెడ్డి కసిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా తాడిపత్రిలో అస్తవ్యస్తంగా ఉన్న అండర్ డ్రైనేజీ సమస్యను గాడిలో పెట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. తాడిపత్రికి రాకముందే ఇప్పటికే ఒక్కొక్క సమస్యను పరిష్కరించేందుకు ఆయన కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది.