Share News

అడ్డుకోండి.. అడ్డుకోండి..!

ABN , Publish Date - May 21 , 2024 | 12:08 AM

హైదరాబాదులోని కిమ్స్‌లో అడ్మిట్‌ అయ్యారు. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జి అయ్యారని, తాడిపత్రికి వస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఆయన తిరిగి వస్తే మరోసారి సమస్య తలెత్తుతుందని భావించిన పోలీసులు.. ఆయనను పట్టణంలోకి రానివ్వకుండా అడ్డుకునేందుకు శివారు ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్నీ తనిఖీ చేసిన తరువాతే తాడిపత్రిలోకి అనుమతించారు.

అడ్డుకోండి.. అడ్డుకోండి..!
చుక్కలూరురోడ్డులో బస్సును ఆపి తనిఖీ చేస్తున్న పోలీసులు

జేసీ ప్రభాకర్‌ వస్తున్నారని పోలీసుల అలర్ట్‌...

తెల్లవారుజామునే పరుగులు.. తనిఖీలు

తాడిపత్రి టౌన, మే 20: హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి తిరిగి వస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. పోలింగ్‌ నేపథ్యంలో తాడిపత్రిలో భారీగా హింస చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు ఆయన కుటుంబం మొత్తాన్ని హైదరాబాద్‌కు తరలించారు. సిటింగ్‌ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబాన్ని సైతం తాడిపత్రి నుంచి ఆయన స్వగ్రామం తిమ్మంపల్లికి పంపించారు. పోలింగ్‌ మరుసటి రోజున గొడవలను నియంత్రించేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. దీంతో జేసీ ప్రభాకర్‌ రెడ్డి అస్వస్థతకు గురై.. హైదరాబాదులోని కిమ్స్‌లో అడ్మిట్‌ అయ్యారు. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జి అయ్యారని, తాడిపత్రికి వస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఆయన తిరిగి వస్తే మరోసారి సమస్య తలెత్తుతుందని భావించిన పోలీసులు.. ఆయనను పట్టణంలోకి రానివ్వకుండా అడ్డుకునేందుకు శివారు ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్నీ తనిఖీ చేసిన తరువాతే తాడిపత్రిలోకి అనుమతించారు. కడప, బుగ్గ, చుక్కలూరు, అనంతపురం రోడ్లలో సోమవారం తెల్లవారుజామున 3 గంటలకే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు ప్రారంభించారు. చెక్‌పోస్టుల వద్ద అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణ, డీఎస్పీలు శివారెడ్డి, శ్రీనివాసులు, సీఐలు లక్ష్మీకాంతరెడ్డి, నాగార్జునరెడ్డి ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి తమ కళ్లుగప్పి పట్టణంలోకి వస్తారేమోనన్న అనుమానంతో పట్టణంలోని ఆయన నివాసం వద్ద, అశోక్‌ పిల్లర్‌ వద్ద భద్రతను మరింత పెంచారు. కానీ ఆయన రావడం లేదని తేలడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. తనిఖీలలో ఎస్‌ఐలు సాగర్‌, గౌస్‌బాషా, స్పెషల్‌ పార్టీ పోలీసులు, ర్యాపిడ్‌ ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2024 | 12:08 AM