Share News

K.S. Jawahar Reddy : జవహర్‌ రెడ్డి సర్వభ్రష్టత్వం!

ABN , Publish Date - May 29 , 2024 | 04:28 AM

కె.ఎ్‌స.జవహర్‌ రెడ్డి!... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి! పరిపాలనా యంత్రాంగం మొత్తానికి బాస్‌! కానీ...

K.S. Jawahar Reddy : జవహర్‌ రెడ్డి సర్వభ్రష్టత్వం!

సీఎ్‌సగా కెరీర్‌ చివర్లో మరకలు!

అంతకుముందు వివాదరహితంగానే విధులు

జగన్‌ సేవలోకి వచ్చాక మారిన తీరు

మన్యంలో కుమారుడి ‘మైనింగ్‌’ దందా

మెడకు చుట్టుకున్న విశాఖ భూముల స్కామ్‌

భారీగా చేతులు మారిన అసైన్డ్‌ భూములు

‘చోడ్రాజు’తో సీఎ్‌సకు సంబంధంపై చర్చ!

ఎన్నికల వేళ మితిమీరిన జగన్‌ భక్తి

అస్మదీయులకు ఐఏఎస్‌ కోసం ఆరాటం

పాలకులపైనా, నేతలపైనా భూముల స్కాముల ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. కానీ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బినామీల పేరుతో 800 ఎకరాల అసైన్డ్‌ భూములు కొట్టేశారని విశాఖ జనసేన నేత పీతల మూర్తి యాదవ్‌ సంచలన ఆరోపణలు చేశారు.

జీఓ 596 కింద 24 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సి ఉంది. కానీ... కేవలం 4 లక్షల ఎకరాలకు మాత్రమే విముక్తి లభించింది. అందులో ఎక్కువభాగం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోనే ఉన్నాయి. దీనికీ... మూర్తి యాదవ్‌ చేసిన ఆరోపణలకు మధ్య సంబంధం ఏదైనా ఉందా!?

గత నెల 17వ తేదీన రాష్ట్ర యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో తలమునకలై ఉండగా... తుని సమీపంలోని ఒక గ్రామంలో మరణించిన చోడ్రాజు సత్య కృష్ణంరాజు అనే వ్యక్తి అంత్యక్రియల్లో సీఎస్‌ పాల్గొన్నారు. చోడ్రాజుతో సీఎ్‌సకు ఏం సంబంధం? అంత సన్నిహితుడు ఎలా అయ్యారు?

(అమరావతి- ఆంధ్రజ్యోతి)

కె.ఎ్‌స.జవహర్‌ రెడ్డి!... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి! పరిపాలనా యంత్రాంగం మొత్తానికి బాస్‌! కానీ... ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి దాకా ఇంత వివాదాస్పదమైన సీఎస్‌ ఇంకెవరూ లేరనే చెప్పవచ్చు. కొందరు అధికారులు సర్వీసులో చేరగానే అవినీతి మరక అంటించుకుంటారు. కానీ, జవహర్‌ రెడ్డి అలాకాదు. చీఫ్‌ సెక్రటరీ అవడానికి ముందు వరకు ఆయనపై పెద్దగా ఆరోపణలేవీ లేవు. ఎలాంటి వివాదాలూ లేవు! జగన్‌ శిబిరంలో చేరిన తర్వాతే ఆయన భ్రష్టుపట్టారు. జగన్‌పట్ల తన స్వామి భక్తిని చాటుకుంటూనే... స్వయంగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. ఆయనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ‘నమ్మదగిన’ ఆధారాలు కూడా బయటపడుతుండటం గమనార్హం. జవహర్‌ రెడ్డి పశు వైద్యశాస్త్రం చదివారు. సివిల్స్‌ సాధించి... ఐఏఎస్‌ అయ్యారు. కడప జిల్లాకు చెందిన ఈయన సహజంగానే జగన్‌ కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు. అయితే, విధి నిర్వహణలో దాని ప్రభావం లేదనే ఉద్దేశంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు లోకేశ్‌ చూసిన పంచాయతీ రాజ్‌శాఖకు ముఖ్యకార్యదర్శిగా జవహర్‌ రెడ్డిని నియమించారు. అప్పుడు ఆయన సాఫీగానే పనిచేశారు. ఆ తర్వాత ఆయన వైద్యారోగ్యశాఖ కార్యదర్శిగా, టీటీడీ ఈవోగా పనిచేశారు. టీటీడీలో పనిచేసినప్పుడు కొన్ని విమర్శలు వచ్చినా ఆయ న గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఎవ్వరూ పెద్దగా హడావుడి చేయలేదు. కానీ... సీఎం జగన్‌ పేషీలో చేరినప్పటి నుంచే జవహర్‌ రెడ్డి తీరు మారిపోయింది. తరచూ విశాఖపట్నం ఎందుకు వెళ్తున్నారనే విషయం దగ్గరి నుంచి, కొద్ది రోజుల క్రితం మరణించిన చోడ్రాజు సత్య కృష్ణం రాజు అనే వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో కూడా హటాహుటిన ఎందుకు వెళ్లారు? విశాఖలో అసైన్డ్‌ భూముల కథేమిటి? అన్న అంశాలపై చర్చ మొదలైంది. జగన్‌ సర్కారులో జవహర్‌ రెడ్డి తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. కరోనా కాలంలో అత్యవసర మందులు, కిట్‌ల కొనుగోలు, మెడిటెక్‌ జోన్‌ అంశా ల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలొచ్చాయి.


‘అసైన్డ్‌’కు అక్కడే విముక్తి...

అసైన్డ్‌ భూములపై పేదలకు శాశ్వత హక్కులు (ఫ్రీ హోల్డ్‌) కల్పిస్తూ జగన్‌ సర్కారు 2023లో నిర్ణయం తీసుకుంది. 20 ఏళ్లకంటే ముందు అసైన్‌ చేసిన భూములను నిషేధ జాబితా 22 (ఏ) నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు ఇచ్చేలా ఉత్తర్వులు ఇచ్చారు. దీని ప్రకారం అర్హులైన పేదల అసైన్డ్‌ భూములన్నీ చకచకా నిషేధ విముక్తి నుంచి బయటపడాలి. కానీ అలా జరగలేదు. ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన ముఖ్య సలహాదారు, ప్రభుత్వ పెద్దలు సిఫారసు చేసిన భూములనే 22(ఏ) నుంచి బయటపడేశారు. జీఓ 596 కింద అర్హత ఉన్న భూముల్లో 22(ఏ) నుంచి బయటపడాల్సినవి 24 లక్షల ఎకరాలు. ఇందులో ఇప్పటిదాకా నిషేధ విముక్తి పొందినవి కేవలం 4 లక్షల ఎకరాలే. విశాఖలో అసైన్డ్‌ భూముల ప్రీహోల్డ్‌ ప్రక్రియలో సీఎస్‌ కుమారుడు, ఆయన మనుషుల పాత్రపై ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి జనసేన నేత మూర్తి యాదవ్‌ సీఎస్‌ టార్గెట్‌గానే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇలా రాష్ట్ర సీఎ్‌సను టార్గెట్‌ చేసి ఓ రాజకీయ పార్టీ భూముల దందా ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. వాటిని ఆయన ఖండిస్తున్నా ఎక్కడో ఏదో తేడాకొడుతోందని సీనియర్‌ అధికారుల్లో చర్చ జరుగుతోంది.

కుమారుడి మైనింగ్‌ దందా...

జవహర్‌ రెడ్డి సీఎస్‌ కాకమునుపే విశాఖ మన్యంలో ఆయన కుమారుడి మైనింగ్‌ దందా మొదలైంది. లేటరైట్‌ తవ్వకాలతోపాటు స్థానికంగా క్రషింగ్‌ యూనిట్లతో మైనింగ్‌ సిండికేట్‌ను నిర్వహిస్తున్నారని స్థానికులు ఆందోళనలు నిర్వహించారు. వైసీపీ ఎంపీ, ముఖ్యనేత దగ్గరి బంధువు కుమారుడితో కలిసి మన్యంలో మైనింగ్‌ దందా నడిపించారని అప్పట్లో ప్రభుత్వానికి, ఎన్జీటీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అప్పటికింకా జవహర్‌ సీఎస్‌ కాలేదు. సీఎం పేషీలోనూ లేరు. ఆయన 2022 పిబ్రవరిలో సీఎం పేషీలోకి వచ్చారు. ఆ తర్వాత మన్యంలో అలజడి మరింత పెరిగిపోయింది. ‘సిండికేట్‌’లో కలిసేందుకు నిరాకరించిన క్రషింగ్‌ యూనిట్ల నిర్వాహకులపై దాడులు పెరిగాయి. ఈ పరిణామాల వెనక జవహర్‌రెడ్డి కుమారుడి హస్తముందన్న ఆరోపణలు వచ్చాయి. కాగా, ఆశ్రితపక్షపాతాన్ని బహిరంగంగానే ప్రదర్శించడం జవహర్‌ రెడ్డి ప్రత్యేకత! కన్ఫర్డ్‌ ఐఏఎ్‌సల విషయంలో ఆయన వ్యవహార శైలి మొత్తం అధికార వర్గాలను విస్మయపరిచింది. సీఎం కార్యాలయంలోని అధికారుల పేషీల్లో పనిచేసిన వారికి కూడా ఐఏఎస్‌ హోదా ఇప్పించుకున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ... ఇంటర్వ్యూల తేదీ ముందు జరిపి మరీ ‘అస్మదీయుల’కు కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ ఇప్పించేందుకు తెగ ఆరాట పడుతున్నారు.

ఐఏఎ్‌సనని మరిచిపోయి...

ఎప్పుడో జనవరిలో బటన్‌ నొక్కిన పథకాలకు జగన్‌ సర్కారు కావాలనే డబ్బులు ఇవ్వకుండా తొక్కిపెట్టింది. సరిగ్గా ఎన్నికలముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి... రాజకీయ ప్రయోజనం పొందాలని భావించింది. ఈ కుట్రలను ఈసీ అడ్డుకుంది. పోలింగ్‌ తర్వాత ఎప్పుడైనా నిధులు జమ చేసుకోవచ్చంది. కానీ... పోలింగ్‌ ముందే నిధులు ఇచ్చేందుకు సీఎస్‌ జవహర్‌ రెడ్డి తెగ తాపత్రయపడ్డారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. రాత్రికి రాత్రి డబ్బులు జమ చేసేందుకు ఆరాట పడ్డారు. జగన్‌కు మేలు చేసేందుకు సీఎస్‌ పడిన తాపత్రయం చూసి అధికార యంత్రాంగం ముక్కున వేలేసుకుంది.

చోడ్రాజుతో సంబంధం ఏమిటి?

కాకినాడ జిల్లా తుని దగ్గరి తూముకుంట గ్రామానికి చెందిన చోడ్రాజు సత్య కృష్ణం రాజు అనే వ్యక్తి గతనెల 17వ తేదీన మరణించారు. అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చింది. అధికార యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు. కానీ.. సీఎస్‌ తన కార్యక్రమాలన్నీ పక్కనపెట్టి మరీ సత్య కృష్ణంరాజు అంత్యక్రియలకు హాజరయ్యారు. సీఎస్‌ వస్తున్నారని అక్కడికి ఇతర అధికారులు కూడా భారీగా తరలివచ్చారు. వీరి మధ్య అంతటి బంధం ఎప్పుడు ఏర్పడింది? ఎలా ఏర్పడిందన్న అనుమానాలు అధికారవర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి. ఆ రోజు సీఎస్‌ జవహర్‌ రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారని... దీనికి కారణమేమిటో అంతుపట్టడంలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి.


ఎన్నికల ఆదేశాల్లోనూ పక్షపాతమే

‘ఎలాగైనా’ ఎన్నికల్లో గెలిచి తీరేందుకు జగన్‌ సర్కారు వ్యూహాత్మకంగా పోస్టింగ్‌లు ఇచ్చింది. ఇందులో సీఎ్‌సదే కీలక పాత్ర. ‘స్వామిభక్త పరాయణులైన’ అనేక మంది అధికారులను ఈసీ పక్కకు తప్పించింది. ఎన్నికల సమయంలో ఈ స్థాయిలో బదిలీలు జరగడం బహుశా ఏ రాష్ట్రంలోనూ లేదు. పోలింగ్‌ అనంతరం కూడా చర్యల పరంపర కొనసాగింది. అయితే... కేవలం పల్నాడు కలెక్టర్‌ను మాత్రమే సీఎస్‌ సస్పెండ్‌ చేశారు. తిరుపతి, అనంత కలెక్టర్‌లను బదిలీతో సరిపెట్టారు. దీని వెనుకా ‘పక్షపాత’మే ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి... డీజీపీతోపాటు సీఎస్‌ జవహర్‌రెడ్డి కూడా అధికార పార్టీకి కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నారని, ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు ఈసీకి పలుమార్లు ఫిర్యాదు చేశాయి. డీజీపీని మాత్రమే బదిలీ చేసిన ఈసీ... సీఎస్‌ జోలికి వెళ్లలేదు. ‘ఢిల్లీ స్థాయి’ పరిచయాలతో జవహర్‌ రెడ్డి సీఎస్‌ పదవిలోనే కూర్చున్నారని, దీని వెనుక గుజరాత్‌కు చెందిన బడా పారిశ్రామికవేత్త హస్తం కూడా ఉందని సీనియర్‌ అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది.

జవహర్‌రెడ్డి 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. వరంగల్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా తన ప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పాలనలో శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... సీఎంవోకు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత సీఎంగా వచ్చిన కిరణ్‌కుమార్‌ రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు పాలనలో ఏపీలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, వైద్య, ఆరోగ్యశాఖల్లో పనిచేశారు. జగన్‌ సీఎం అయ్యాకే ఆయన తీరు మారిపోయింది. జూన్‌ నెలాఖరు వరకు ఆయన పదవీకాలం ఉంది.

Updated Date - May 29 , 2024 | 08:03 AM