Share News

సెలవుపై జవహర్‌!

ABN , Publish Date - Jun 07 , 2024 | 02:36 AM

సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఎట్టకేలకు సెలవుపై వెళ్లారు. సెలవుపై వెళ్లాలని ముందే సంకేతాలు వెళ్లినా, కలవడానికి వెళ్లినప్పుడు చంద్రబాబు పట్టించుకోకపోయినా ‘కొత్త ప్రభుత్వంలోనూ నేనే కొనసాగుతాను’ అనే ధోరణిని జవహర్‌రెడ్డి ప్రదర్శించారు.

సెలవుపై  జవహర్‌!

సీఎస్‌గా కొనసాగేందుకు చివరిదాకా ప్రయత్నం

సెలవుపై వెళ్లాలని ముందుగానే సంకేతాలు

జగన్‌ హయాంలో అడ్డగోలుగా అధికార ప్రయోగం

ఆయనను తప్పించాలని ఈసీకి టీడీపీ ఫిర్యాదులు

అయినా, కొత్త సర్కారులో పాగాకు విఫల యత్నం

సీఎస్‌కు సంప్రదాయం కూడా తెలియదా?

ఆయన తీరుపై సీనియర్ల విస్మయం.. సెలవుకు ఓకే

అమరావతి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) : సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఎట్టకేలకు సెలవుపై వెళ్లారు. సెలవుపై వెళ్లాలని ముందే సంకేతాలు వెళ్లినా, కలవడానికి వెళ్లినప్పుడు చంద్రబాబు పట్టించుకోకపోయినా ‘కొత్త ప్రభుత్వంలోనూ నేనే కొనసాగుతాను’ అనే ధోరణిని జవహర్‌రెడ్డి ప్రదర్శించారు. చివరకు తత్వం బోధపడినట్టుంది. తనకు తానుగానే గురువారం సచివాలయం నుంచి నిష్క్రమించారు. ఆ వెంటనే....ఆయన పెట్టుకున్న సెలవుకు ఆమోదం లభించింది. జవహర్‌రెడ్డిని వైసీపీ ప్రభుత్వం 2022 డిసెంబరు 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ, ఇష్టారాజ్యంగా అధికార యంత్రాంగాన్ని నడిపించారు. ఇందుకోసమే ఏరికోరి జవహర్‌రెడ్డిని జగన్‌ అప్పట్లో ఎంచుకున్నారు. ఆయన కంటే సీనియర్లు అరడజను మంది ఉన్నప్పటికీ సీఎ్‌సగా ఆయనకు అవకాశమిచ్చారు. 18 నెలలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన కొనసాగుతున్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం ఆయన నేతృత్వంలోనే జరిగింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష టీడీపీ ఆయనను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేసింది. కానీ ఈసీ ఆయననే కొనసాగించింది. ఇంత వరకూ ఒకే కానీ... ప్రస్తుతం ఎన్నికలు పూర్తి అయ్యాయి. జగన్‌ను దించేసి, కొత్త ప్రభుత్వానికి ప్రజలు జై కొట్టారు. సాధారణంగా ఎన్నికల ఫలితాలు రాగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఇద్దరూ.. గెలిచిన పార్టీ అధినేతను కలవాల్సి ఉంటుంది. ‘‘మీరు అనుమతిస్తే కొనసాగుతాం. మీకు కొత్త ప్రయార్టీస్‌ ఉంటాయి కాదా’’

అని మర్యాదపూర్వకంగా అడగాలి. ఇదీ పాలనా సంప్రదాయం. కౌంటింగ్‌ తర్వాత సీఎస్‌, డీజీపీ ఇద్దరూ చంద్రబాబును కలిశారు. కానీ, సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఈ ఆఫర్‌ చేయలేదు. చంద్రబాబు కూడా ఏమీ మాట్లాడలేదు. ప్రభుత్వం తననే సీఎ్‌సగా కొనసాగిస్తుందన్న భావనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, చంద్రబాబు ఆయనతో మాట్లాడేందుకు కూడా సుముఖత చూపలేదు. అప్పుడైనా జవహర్‌ రెడ్డికి అర్థమై ఉండాలి. కానీ, కానీ సీఎస్‌ తీరు వేరుగా ఉండటం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఇంటి దగ్గర నుంచి సచివాలయానికి జవహర్‌రెడ్డి వెళ్లారు. చంద్రబాబు కొత్త టీమ్‌లో ఉంటారని చెబుతున్న కొందరు అధికారులు... సీఎ్‌సగా తప్పుకోవాలని జవహర్‌రెడ్డికి అప్పుడే సంకేతాలు ఇచ్చారు. సెలవుపై వెళ్లాలని సృష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన మాత్రం తాను కుర్చీని వదిలేదే లేదన్నట్లు ప్రవర్తించారు. పైగా ‘నేను మాట్లాడుకుంటాను’ అని వారితో చెప్పినట్లు సమాచారం. కానీ చివరికి చంద్రబాబు ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఆయనే సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు కొత్త సీఎస్‌ ఎవరు అన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఐఏఎస్‌ల సీనియారిటీ జాబితాను చంద్రబాబు ముందు పెట్టిన తర్వాత, ఆయన తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 02:37 AM