Share News

దుష్ట పాలన అంతమై.. ధర్మ పాలన రావాలి

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:25 AM

రాష్ట్రంలో దుష్ట పాలన అంతమై.. ధర్మ పాలన రావాలన్నదే తన ఆకాంక్ష అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి రోజున వచ్చే ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేయనున్న జనసేన పార్టీ అభ్యర్థులకు బీ-ఫాంలు

దుష్ట పాలన అంతమై.. ధర్మ పాలన రావాలి

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్ష

పార్టీ అభ్యర్థులకు బీ-ఫాంలు అందజేత

అమరావతి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దుష్ట పాలన అంతమై.. ధర్మ పాలన రావాలన్నదే తన ఆకాంక్ష అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి రోజున వచ్చే ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేయనున్న జనసేన పార్టీ అభ్యర్థులకు బీ-ఫాంలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. మంళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు బుధవారం మధ్యాహ్నం ఆయన చేతుల మీద బీ-ఫాంలు అందజేశారు. పాలకొండ అభ్యర్థికి మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఈ సందర్భంగా తమ అభ్యర్థులతో ‘‘ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతాం’’ అని పవన్‌ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రానికి మళ్లీ రామరాజ్యం తీసుకొచ్చేలా పాలన అందిస్తామన్నారు. ‘‘2024 సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనవి. ఎన్నో ఒత్తిళ్లు ఎదురైనా ఎదుర్కొని కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. రాష్ట్రంలో దుష్ట పాలన అంతమై ధర్మ పాలన రావాలన్నదే నా ఆకాంక్ష. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే దృఢ సంకల్పంతో ఏర్పడిన కూటమికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’’ అన్నారు. కాగా, పాలకొండ అభ్యర్థిగా జయకృష్ణను ప్రకటించగా...బుధవారం బీ-ఫాంలు అందించే సమయంలో ఆయన కనిపించలేదు. ఆయన ఇంకా విజయవాడ చేరుకోలేదు కాబట్టి మిగిలిన అభ్యర్థులందరికీ బీ-ఫాం అందిస్తున్నామని పవన్‌ చెప్పారు. అయితే ఈ అభ్యర్థి మార్పు కోసం పార్టీలో చర్చ జరుగుతోందని తెలుస్తోంది. మరోవైపు పాలకొండ నాయకులు మాత్రం గురువారం ఉదయం జయకృష్ణకు బీ-ఫాం ఇస్తారని చెబుతున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 03:25 AM