Share News

జగన్‌ సీన్‌ అయిపోయింది!

ABN , Publish Date - May 07 , 2024 | 04:44 AM

రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అధికారంలోకి రావడం ఖాయమని, సైకో జగన్‌ ఇంటికి పోవడం తథ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.

జగన్‌ సీన్‌ అయిపోయింది!

వైసీపీ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా

ప్రయోజనం లేదు: చంద్రబాబు

వచ్చేది డబుల్‌ ఇంజన్‌ సర్కారే

25 ఎంపీ, 160 అసెంబ్లీ స్థానాల్లో

కూటమి విజయం ఖాయం

ఉద్యోగులను చూసి కడుపు నిండింది

ఓట్లు కొనడానికి వెళ్తే వైసీపీ

నేతలను ఛీత్కరించారు

పోలవరం పూర్తి చేస్తాం.. రాష్ట్రంలో

అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కిస్తాం

తాళ్లపాలెం సభలో ప్రధానితో పాటు

పాల్గొన్న బాబు.. పాణ్యంలోనూ సభ

అనకాపల్లి/కర్నూలు, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అధికారంలోకి రావడం ఖాయమని, సైకో జగన్‌ ఇంటికి పోవడం తథ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 160 అసెంబ్లీ స్థానాల్లో, పాతికకు పాతిక లోక్‌సభ స్థానాల్లో ఘనవిజయం సాధించబోతోందని ధీమా వ్యక్తంచేశారు. వైసీపీ ఎన్ని వందల కోట్లు ఖర్చుపెట్టినా ప్రయోజనం లేదని, జగన్‌ సీన్‌ అయిపోయిందని తేల్చిచెప్పారు. సోమవారం అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో ప్రధాని మోదీ పాల్గొన్న బహిరంగ సభలో, అంతకుముందు కర్నూలు జిల్లా పాణ్యంలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం తమ కూటమికి అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయన్నారు. అధికారం ఉందని విర్రవీగిన జగన్‌రెడ్డిని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అధికారంలోకి రావడానికి ఆయన అనేక నాటకాలు ఆడారని.. ఊరూరా తిరిగి ముద్దులు పెట్టారని.. తీరా గద్దెనెక్కాక బాదుళ్లు, గుద్దులు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల భూములు, ఆస్తులు దోచేయడానికి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ఓ ఐఏఎస్‌ అధికారి కూడా ఈ చట్టం బాధితుడేనన్నారు. రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకాలపై సీఎం ఫొటో పెట్టుకోవడంపై మండిపడ్డారు. ‘14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నేను నా భూమికి సంబంధించిన పాస్‌ పుస్తకంపై ఈ సైకో ఫొటో పెట్టుకోవాలా’ అని ప్రశ్నించారు. ఆయా చోట్ల కూటమి అభ్యర్థులను పరిచయం చేసి గెలిపించాలని అభ్యర్థించారు. బాబు ఇంకా ఏమన్నారంటే...

ఉద్యోగుల్లో కసి చూస్తున్నాం..

ప్రభుత్వ ఉద్యోగులను చూస్తుంటే నా కడుపు నిండిపోయింది. అవినీతి డబ్బుతో వారి ఓట్లు కొనడానికి వైసీపీ నాయకులు వెళ్తుంటే వారిని ఛీత్కరిస్తున్నారు. ఒంగోలులో ఒక మహిళా ఉద్యోగి టీడీపీ కూటమి క్యాంపు వద్దకు వచ్చి పది వేల రూపాయలు ఇచ్చి మరీ గెలవాలని ఆకాక్షించారు. ఉద్యోగుల్లో ఆ కసిని చూస్తున్నాం. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడానికే కూటమి ఏర్పాటైంది. వైసీపీ నాయకుల గూండాగిరీని అణచివేయడానికి, రాజధాని అమరావతి, పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయడానికి, అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయడానికి, తెలుగు భాష, దేవాలయాలను కాపాడడానికి, అందరికీ న్యాయం చేయడానికే మూడు పార్టీలూ కలిశాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ధర్మవరం సభలో చెప్పారు.


కిమ్‌ తాత జిమ్‌ జగన్‌..

‘నార్సిసిస్టిక్‌ పర్సనాలిటీ డిజార్డర్‌’ అనే మానసిక వైకల్యం కలిగిన వ్యక్తి జగన్‌. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లకు.. వాళ్లు చెప్పిందే వినాలి. ఎదురుతిరిగితే దాడులు చేస్తారు.. చంపేస్తారు. జగన్‌ కూడా అదే అమలు చేస్తున్నాడు. హిట్లర్‌, ఒసామా బిన్‌లాడెన్‌, అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్లు, నార్త్‌ కొరియాలో కిమ్‌లదీ ఇలాంటి మానసిక స్థితే. కిమ్‌ తాత జిమ్‌ జగన్‌. చెప్పిన అబద్ధాలు చెప్పకుండా మోసం చేస్తున్నారు.

తండ్రిని చంపారన్న వాళ్లకే ఎంపీ పదవి

జగన్‌ విధానాలు నచ్చక వ్యతిరేకంగా మాట్లాడిన ఒక ఎంపీపై సీఐడీ కేసులు పెట్టించారు. పోలీసు కస్టడీలో ఆ ఎంపీని కొడుతుంటూ తాడేపల్లి కొంప నుంచి చూస్తూ బలే కొడుతున్నారు.. ఇంకా కొట్టమన్నాడు ఈ సైకో. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ నాటకాలాడడం ఈయనకు అలవాటు. 2014 ఎన్నికల సమయంలో తండ్రి చనిపోయాడంటూ ఊరూరా తిరిగారు. తన తండ్రిని రిలయన్స్‌ అధినేత చంపించాడని విమర్శించి వారి షాపులపై దాడులు చేయించిన జగన్‌.. ఎన్నికల తర్వాత రాజ్యసభ ఎంపీ పదవిని వారు చెప్పిన వారికి కట్టబెట్టారు. రాయలసీమలో 53 ప్రాజెక్టులను రద్దు చేశారు. ఈ ఎన్నికల్లో మనం రాయలసీమలో 52 స్థానాల్లో గెలవబోతున్నాం.. వైసీపీని భూస్థాపితం చేద్దామా..? (చంద్రబాబు అనగానే... ప్రజలు చేద్దాం చేద్దాం అని నినాదాలు చేశారు). అధికారం చేపట్టిన వెంటనే జగన్‌ పోలవరాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పటికే రూ.13 లక్షల కోట్లు అప్పు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా..? ఆదాయం పెరిగిందా..?

ఉత్తరాంధ్రపై వైసీపీ నేతల పెత్తనమేంటి?

ఉత్తరాంధ్రపై వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి నేతల పెత్తనం పెరిగింది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెత్తనం చేయడమేంటి? ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న విశాఖను వైసీపీ నాయకులు దోపిడీకి కేంద్రంగా చేసుకున్నారు. ఈ ప్రాంత భూములపై కన్నేశారు. అభివృద్ధి కుంటుపడేలా చేశారు.


నన్ను చంపేందుకు జగన్‌ కుట్ర..

నన్ను కూడా చంపేందుకు ఈ జగన్‌ కుట్ర చేశాడు. 24 క్లెమోర్‌మైన్స్‌తో నాపై బ్లాస్ట్‌ జరిగితే సాక్షాత్తూ వేంకటేశ్వరుడు ఏడు కొండలూ దిగివచ్చి కాపాడాడు. అలాంటి నన్ను వీళ్లు ఏం చేయగలరు? ఈయన తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వల్ల ఓ ఐఏఎస్‌ అధికారి కూడా బాధితుడయ్యారు. 35 ఏళ్లు సేవలు చేసిన ఆ అధికారి తల్లిదండ్రుల పట్టా భూములు కూడా మ్యుటేషన్‌ చేసేందుకు నిరాకరించారంటే ఎంత దారుణం? ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నాది. సూపర్‌ సిక్స్‌ పథకాలు, కేంద్రం ఇచ్చే మోదీ గ్యారెంటీ ద్వారా మహిళలను లక్షాధికారులుగా మారుస్తాను. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 అందజేస్తాం. రూ.200గా ఉన్న సామాజిక పింఛన్‌ను 2 వేలు చేసిన ఘనత మాదే. మేం వచ్చాక ఏప్రిల్‌ నుంచే పెన్షన్‌ రూ.4 వేలు చేస్తా.

సైకో పోవాలి.. రాష్ట్రం నిలవాలన్నది ప్రజల ఆకాంక్ష. పవన్‌ కల్యాణ్‌, అమిత్‌షా, నేను అదే చెబుతున్నాం. రాష్ట్రానికి పట్టిన శని జగన్‌ పోవాలన్నది పవన్‌ సంకల్పం. అందుకు ఆయన త్యాగాలకు కూడా సిద్ధపడ్డారు. ప్రజాజీవితంలో నిజమైన హీరో ఆయన.

- చంద్రబాబు

Updated Date - May 07 , 2024 | 04:44 AM