Share News

తెలుగుపై జగన్‌ పగ!

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:22 AM

టెన్త్‌లో ఒకప్పుడు తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులైతే ఇప్పుడది భారీగా పడిపోయింది.

తెలుగుపై జగన్‌ పగ!

జగన్‌ ప్రభుత్వం తెలుగు భాషపై పగబట్టింది! అధికారంలోకి వచ్చిన రోజు నుంచే పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగించే కుట్రలు చేసింది!. ఆ తర్వాత న్యాయస్థానాల ఆదేశాలతో తెలుగు మీడియంను కొనసాగించినా.. ప్రభుత్వ చర్యలతో తెలుగుకు క్రమంగా ఆదరణ తగ్గిపోయింది. ఆ ప్రభావం ఇప్పుడు పదో తరగతి ఫలితాలపై పడింది. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థుల్లు 92.32శాతం మంది ఉత్తీర్ణులు కాగా, తెలుగు మీడియంలో కేవలం 71.02శాతం మందే ఉత్తీర్ణులవడం ఇందుకు నిదర్శనం!.

ఇంగ్లీష్‌ మీడియంపైనే ఆది నుంచీ మోజు

ప్రభుత్వ పాఠశాలల్లో బలవంతంగా అమలు

ఫలితంగా తెలుగుకు తగ్గిన ఆదరణ

టెన్త్‌ ఫలితాల్లో 71శాతమే ‘తెలుగు’ ఉత్తీర్ణత

అదే ఇంగ్లీష్‌ మీడియంలో 92.32ు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

టెన్త్‌లో ఒకప్పుడు తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులైతే ఇప్పుడది భారీగా పడిపోయింది. తెలుగు మీడియంలో చదివితే పాస్‌ గ్యారెంటీ లేదనే సందేహం కలిగించేలా ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది. తాజాగా విడుదల చేసిన టెన్త్‌ ఫలితాల్లో ఇంగ్లీష్‌ మీడియంలో చదివిన విద్యార్థుల్లో 92.32శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. తెలుగు మీడియంలో మాత్రం 71.02శాతం మందే పాసయ్యారు. రెండు మీడియంల మధ్య ఉత్తీర్ణతలో 21.24శాతం వ్యత్యాసం వచ్చింది. అదే 2023లో చూస్తే తెలుగు మీడియం విద్యార్థులు 50శాతం మంది పాసైతే, ఇంగ్లీష్‌ మీడియంలో 80.82శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 30.82శాతం ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థులు ఎక్కువ ఉత్తీర్ణత నమోదు చేశారు. 2022లో తెలుగు మీడియం 43.97శాతం అయితే, ఇంగ్లీష్‌ మీడియంలో 77.55శాతం మంది పాసయ్యారు. ఆ సంవత్సరంలో 33.58శాతం వ్యతాస్యం కనిపించింది. అంతకముందు రెండేళ్లు కొవిడ్‌ కారణంగా అందరినీ పాస్‌ చేశారు. కానీ విచిత్రంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంల మధ్య ఉత్తీర్ణతలో పెద్దగా తేడా లేదు. 2019లో 7.08శాతం, 2018లో 7.2శాతం, 2017లో 9.87శాతం, 2016లో 6.09శాతం, 2015లో 8.77శాతం మాత్రమే రెండు మీడియంల మధ్య తేడా వచ్చింది. అప్పట్లో ఇంగ్లీ్‌షతోపాటు తెలుగు మీడియంలోనూ ఉత్తమ ఫలితాలు వచ్చేవి. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే తెలుగు మీడియం అంటే పాసవుతారా అనే సందేహం తలెత్తే పరిస్థితి ఏర్పడింది.

అధికారంలోకి రాగానే రద్దు

అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై బలవంతంగా ఇంగ్లీష్‌ మీడియంను రుద్దింది. తొలుత తెలుగు మీడియంను పూర్తిగా తొలగించింది. దానిపై అనేక మంది న్యాయస్థానాలను ఆశ్రయించడంతో రెండు మాధ్యమాల విధానం తెచ్చింది. పేరుకు తెలుగు మీడియం ఉందని చెబుతున్నా క్షేత్రస్థాయిలో బలవంతంగా ఇంగ్లీ్‌షను రుద్దుతున్నారు. దీనిని సమర్థించుకునేందుకు తల్లిదండ్రుల నుంచి మీడియంపై అభిప్రాయ సేకరణ చేశారు. అందులో ఎక్కువ మంది ఇంగ్లీష్‌ మీడియం మాత్రమే కావాలని అడుగుతున్నారని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయినా తెలుగు మీడియమే కావాలని పట్టుబట్టి కొందరు పిల్లల్ని తెలుగులో చేర్పించారు. అయితే ఎక్కువగా ఇంగ్లీష్‌ మీడియంకు మొగ్గు చూపిన ప్రభుత్వం తెలుగు మీడియంను నిర్లక్ష్యం చేసింది. కొన్నిచోట్ల ప్రభుత్వం మాటలు నమ్మి ఇంగ్లీష్‌ పెద్దగా రాకపోయినా పిల్లలను కొందరు తల్లిదండ్రులు ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్చారు. ఆ విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారు. మాతృభాష లేక, ఇంగ్లీష్‌ అర్థంకాక మార్కులు వారికి మార్కులు తగ్గిపోయాయి. ఇలా రెండు వైపులా తెలుగు మాధ్యమం విద్యార్థులు, రాకపోయినా ఇంగ్లీష్‌ మీడియంలో చేరిన విద్యార్థులు నష్టపోయారు.

ఇప్పుడెందుకు టోఫెల్‌?

తెలుగును చంపేస్తున్నారని విమర్శించిన వారిపై జగన్‌ ప్రతిదాడి చేశారు. ప్రతిపక్షాలకు పేద పిల్లలు బాగుపడటం ఇష్టంలేదంటూ దుష్ప్రచారానికి దిగారు. ఎవరు ఏ మీడియం కోరుకుంటే ఆ మీడియంలో చదు వు చెప్పాలని, అంతేగానీ ఇంగ్లీ్‌షను బలవంతంగా రుద్దొద్దని అడిగిన వారిని ఇంగ్లీష్‌ మీడియం వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అది చాలదన్నట్టు ఈ ఏడాది పాఠశాల స్థాయిలో టోఫెల్‌ కోర్సు ను ప్రవేశపెట్టారు. కేవలం పాశ్యాత్య దేశాల యాస కోసం దీనిని తీసుకొచ్చారు. ఉన్నత విద్య అనంతరం విదేశాలకు వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. అయితే అసలు పునాది దశలో బోధన అర్థంకాకుండా చేసి, ఎప్పుడో ఉన్నతవిద్య అనంతరం అవసరమయ్యే టోఫెల్‌ ఇప్పుడెందుకు పెట్టారనే ప్రశ్నలు వచ్చినా సమాధానం చెప్పలేదు.

Updated Date - Apr 25 , 2024 | 04:22 AM