ప్రభుత్వ కార్యక్రమాల్లో జగన్ రాజకీయ ప్రసంగం
ABN , Publish Date - Mar 06 , 2024 | 03:58 AM
ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం జగన్ రాజకీయ ప్రసంగం చేయడంతో పాటు విపక్ష పార్టీ అధ్యక్షుడిని పేరు పెట్టి విమర్శించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

ఇలా చేయడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం
హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం జగన్ రాజకీయ ప్రసంగం చేయడంతో పాటు విపక్ష పార్టీ అధ్యక్షుడిని పేరు పెట్టి విమర్శించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బాపట్ల జిల్లా, పర్చూరు మండలం, అన్నంభొట్లవారిపాలెం ప్రాంతానికి చెందిన చెన్నుపాటి సింగయ్య ఈ పిల్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 15న పల్నాడు జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన గ్రామ-వార్డు వలంటీర్లకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ విపక్షపార్టీ అధ్యకుడిని పేరు పెట్టి విమర్శించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. సీఎం చేసిన రాజకీయ ప్రసంగాన్ని పరిగణనలోకి తీసుకుని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వార్డు-గ్రామ వలంటీర్లకు ఎలాంటి ఎన్నికల సంబంధమైన విధులు అప్పగించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. పోలింగ్ బూత్‌ల పరిసరాల్లోకి వలంటీర్లు వెళ్లకుండా అడ్డుకోవాలని కోరారు. కార్యక్రమం నిర్వహణకు చేసిన ఖర్చు, అధికారుల పాత్రపై విచారణ చేసేలా సీఎస్, ఆర్థిక, పురపాలక, పంచాయితీరాజ్‌శాఖల ముఖ్యకార్యదర్శులను ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం రాజకీయ ప్రసంగం చేయడంపై నివేదిక సమర్పించేలా పల్నాడు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాలని అభ్యర్థించారు. సీఎస్, ఆర్థిక, పంచాయితీరాజ్, పురపాలకశాఖల ముఖ్యకార్యదర్శులు, గ్రామ-వార్డు వలంటీర్ల డైరెక్టర్, పంచాయితీరాజ్‌శాఖ కమిషనర్, సమచారశాఖ కమిషనర్, పల్నాడు జిల్లా కలెక్టర్, కేంద్ర ఎన్నికల సంఘం, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, వైసీపీ ప్రధాన కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. వ్యక్తిగత హోదాలో ముఖ్యమంత్రి జగన్‌నీ ప్రతివాదిగా పేర్కొన్నారు.