గనుల శాఖలో జగన్ మనుషులు
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:13 AM
గనుల శాఖలో మాజీ సీఎం జగన్ మనుషులు తిష్ఠ వేశారు. గత ప్రభుత్వంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు అధికారులు పదవుల్లో కొనసాగుతున్నారు.

శ్వేతపత్రంలో అక్రమాలు కనుమరుగు
వైస్ ప్రెసిడెంట్ నుంచి జనరల్ మేనేజర్ వరకు అంతా వైసీసీ మాస్టర్ మైండ్స్
శ్వేతపత్రంలో రాకుండా ఓ అధికారి పాత్ర
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గనుల శాఖలో మాజీ సీఎం జగన్ మనుషులు తిష్ఠ వేశారు. గత ప్రభుత్వంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు అధికారులు పదవుల్లో కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతున్నారు. జగన్ అక్రమాలు, అన్యాయాలు, ఆర్థిక దోపిడీని బయట పెట్టేందుకు సర్కారు సకల ప్రయత్నాలు చేస్తుంటే.. వైసీపీ మాస్టర్ మైండ్స్ ఆ ప్రయత్నాలను డైవర్ట్ చేస్తున్నారు. జగన్ పాలనలో గనుల శాఖలో 20 వేల కోట్ల అవినీతి జరిగిందని కూటమి సర్కారు ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ అందులో ప్రస్తావనకు రాని ఆర్థిక నేరాలు, అక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిని కప్పిపెట్టింది జగన్ టీమే. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2నెలలు కావొస్తున్నా గనుల శాఖలో ప్రక్షాళన జరగలేదు. జగన్ టీమ్‌తోనే ఆయన పాలనలో జరిగిన అక్రమాలు బయట పెట్టించాలనుకుంటే అది అయ్యే పనేనా? గనుల శాఖ, ఏపీఎండీసీలో వైస్ ప్రెసిడెంట్ నుంచి జనర ల్ మేనేజర్ వరకు.. కొనుగోళ్లు, మార్కెటింగ్, బెరైటీస్, బొగ్గు, ఇసుక, బిల్లుల చెల్లింపు తదితర విభాగాల్లో జనరల్ మేనేజర్ నుంచి సూపరింటెండెంట్ వరకు.. పీఏల నుంచి పీఎ్‌సల వరకు జగన్ టీమే ఉన్నారు. వీరంతా గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఏరికోరి తెచ్చిపెట్టుకున్న నమ్మకమైన అస్మదీయులు. ఇంతమంది ఉండగా అక్రమాలు, అన్యాయాలు ఎలా బయటకొస్తాయి? కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించలేదు. దీంతో గతంలో జరిగిన అక్రమాలు కప్పిపెట్టే ప్రయత్నం జోరుగా సాగుతోంది. జగన్ మనుషులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడంతో పాటు తప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. అసెంబ్లీలో సైతం తప్పుడు వివరాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం మేల్కొనకపోతే గుండుసుది లాంటి ఆధారం కూడా కనిపెట్టలేదని సీనియర్ అధికారులు చెబుతున్నారు.
అంతా వీరభద్ర మాయ
గనులశాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఓఎ్‌సడీగా వీరభద్రరావు అనే గనుల శాఖ డీడీ పనిచేశారు. పెద్దిరెడ్డి కేంద్రంగా జరిగిన అనేక అక్రమాల్లో ఆయన ప్రమేయం ఉందని ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. మినరల్స్‌కు ఎల్‌ఓఐ (లెటర్ ఆఫ్ ఇంటెంట్)ల జారీ, ఫ్యాక్టరీలపై విజిలెన్స్ దాడులు, కేసుల విచారణలో అంతా తానై పెద్దిరెడ్డిని నడిపించారని బాధిత కంపెనీలు, శాఖ ఉద్యోగులు బాహాటంగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన తిరిగి గనుల శాఖ డైరెక్టరేట్‌కు చేరారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై విచారణ లేదు. ఏం జరిగిందో ఆరా తీసిన ఉందంతం కూడా లేదు. గనుల శాఖ అధికారులు ఆయనకు పిలిచి మరీ పెద్దపీట వేశారు. పెద్దిరెడ్డికి ఓఎ్‌సడీగా పనిచేసిన అధికారి అంటే అధికారులకు ఎంత ప్రేమో? త్వరలో ఆయన రిటైర్ కాబోతున్నారు. ఎలాంటి విచారణ ఎదుర్కోకుండానే పదవీ విరమణ చేసేలా అధికారులు ఆయనకు సహకరిస్తున్నారు.
నిజాలకు పాతర!
గనుల అక్రమాలపై సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రంలో బొగ్గు, బీచ్‌శాండ్ టెండర్లలో జరిగిన గోల్‌మాల్ గురించి ప్రస్తావించలేదు. ఇందుకు కారణం రామన్‌నారాయణన్ అని తెలుస్తోంది. ఆ అంశాలను చేర్చాలంటే ముందుగా ఈయన డేటా ఇవ్వాలి. బొగ్గు టెండర్లలో ఎలాంటి మోసం జరిగింది? అదానీకే టెండర్ దక్కేలా ఎలాంటి కుట్రలు చేశారు? ఇందులో ఎవ రి పాత్ర ఏమిటో వివరించాల్సి వస్తుంది. అప్పుడు ఆయన కేంద్ర బిందువుగా మారుతారు. అది ఇష్టంలేకే ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. నిజానికి ఒక్క బొగ్గు అమ్మకంలోనే ఎండీసీకి 10వేలకోట్ల పైనే నష్టం జరిగిందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. బెరైటీస్ విషయంలో మంత్రి కొల్లు రవీంద్రను కూడా తప్పుదోవ పట్టించేలా నివేదికలు ఇప్పించార ని ఫిర్యాదులు ఉన్నాయి. 2016-24 కాలంలో బెరైటీస్ టెండర్ అనేక కంపెనీలకు దక్కింది. కానీ కేవలం ఒక కంపెనీకే 75 లక్షల టన్నుల బెరైటీస్ వెళ్లినట్లుగా మంత్రితో సభలో సమాధానం చెప్పించినట్లు తెలిసింది. నిజానికి ఎండీసీ చరిత్రలోనే 75 లక్షల టన్నుల బెరైటీ్‌సను ఒక కంపెనీకి అమ్మలేదు. మహా అయితే ఐదారు లక్షల టన్నులు అమ్మి ఉంటారు. అలాంటిది మంత్రితో సభలో ఈ విధంగా చెప్పించడం చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వంలో ప్రకాశం జిల్లా కొణిజేడు-మర్లపాడులో ఐరన్ ఓర్ టెండర్లు పిలిచారు. అది జేఎ్‌సడబ్ల్యూ కంపెనీకే దక్కేలా మంత్రాంగం నడిపారు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి ఆ టెండర్‌ను రద్దు చేయాలనుకుంటే సంస్థపై తీవ్రమైన ఆర్థిక భారం పడేలా టెండర్ క్లాజులు చేర్చినట్లు బయటకొచ్చింది. ఒప్పందానికి విరుద్ధంగా ఐరన్ ఓర్ టెండర్‌ను రద్దు చేస్తే, సర్కారే ఆ కంపెనీకి 120శాతం అదనపు పరిహారం చెల్లించే క్లాజును తీసుకొచ్చారని వెలుగుచూసింది. అంటే... జగన్ సర్కారు నాటి టెండర్లను కూటమి ప్రభుత్వం రద్దు చేసే సాహసం చేయకుండా ఈ కుట్రలకు పాల్పడ్డారని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినా వైస్ ప్రెసిడెంట్‌ల పనితీరు, వారివల్ల జరిగిన మేలు, నష్టంపై అంచనా వేసే పరిస్థితి కనిపించడం లేదు. వారు లేకపోతే కంపెనీనే లేదన్నట్లుగా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు.
జగన్ వీరభక్త రామా.. ఇదేంపని?
జగన్ ప్రభుత్వంలో గనుల శాఖను వైసీపీ అస్మదీయులు, కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు పునరావాస కేంద్రంగా మార్చారు. అడ్డగోలు నిబంధనలతో టెండరు తయారు చేసి అదానీకి కట్టబెట్టారు. బీచ్‌శాండ్‌ను వారికే వెళ్లేలా ప్రయత్నిస్తే హైకోర్టు అడ్డుకుంది. ఇసుక, బెరైటీస్, ఇతర ఖనిజాల వేలం, సీనరేజీ వసూళ్లు టెండర్లలో జరగని అక్రమాలు లేవు. ఇవన్నీ ఓ ప్రణాళిక ప్రకారం జరిగేలా జగన్, వెంకటరెడ్డి సొంత టీమ్‌ను పెట్టుకున్నారు. ఏపీఎండీసీలో డైరెక్టర్ తర్వాత అత్యంత కీలకమైన పోస్టు వైస్ ప్రెసిడెంట్. ఈ విభాగంలో రెండు పోస్టులు సృష్టించారు. అదానీ, ట్రైమెక్స్‌లో పనిచేసిన రామన్‌నారాయణన్ అనే వ్యక్తిని ఓ పోస్టులో నియమించారు. ఆయనకు బొగ్గు, బీచ్‌శాండ్ సబ్జెక్టులు ఇచ్చారు. 3.5లక్షల జీతం, ఇతర అలవెన్సులు కల్పించారు. ప్రతిఫలంగా జగన్, వెంకటరెడ్డి చెప్పిన కీలకమైన పనులు ఆయన చేసిపెట్టారు. బొగ్గు అమ్మకం టెండర్లలో సెక్యూరిటీ డిపాజిట్‌కు బదులు పెర్ఫార్మెన్స్ డిపాజిట్ విధానం నిబంధన తీసుకొచ్చారు. ఫలితంగా ఎండీసీనే వడ్డీతో సహా అదానీకి సొమ్ము చెల్లించింది. బీచ్‌శాండ్ టెండర్లు అదానీకి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. 89శాతం అదానీకి, 11 శాతం ఎండీసీకి ఆదాయం వచ్చేలా టెండర్ డాక్యుమెంట్ తయారు చేశారు. హైకోర్టు జోక్యంతో ఆ టెండర్ నిలిచిపోయింది. బెరైటీస్ సరఫరా విషయంలో అ సంస్థతో ఎండీసీ కుదుర్చుకున్న ఒప్పందం ముగిసిన తర్వాత కూడా సరుకు సరఫరా చేశారు. తాము పాత రేటునే చెల్లిస్తామని ఆ కంపెనీ చెప్పింది. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఆ సంస్థ నుంచి కొత్త ఒప్పందం ప్రకారం, కొత్త ధర వసూలు చేయాలి. మాట వినకుంటే బ్యాంక్ గ్యారెంటీలు, రవాణా పర్మిట్లు నిలిపివేయాలి. అలా చేయకుండా కేసును ఆర్బిట్రేషన్‌కు సిఫారసు చేశా రు. అది ఇప్పటి వరకు పరిష్కారం కాలే దు.
ఆర్థిక వ్యవస్థ ఆయన చేతుల్లోనే
ఎండీసీలో ఫైనాన్స్ విభాగానికి జనరల్ మేనేజర్‌గా నాగేశ్వరరెడ్డి ఉన్నారు. ఆయన సోదరుడు ధర్మారెడ్డి టీటీడీ ఈఓగా ఉన్న సమయంలో ఈయన డిప్యుటేషన్‌పై వచ్చారు. స్థాయికి మించిన పోస్టు దక్కించుకున్నారు. ఇసుక, బెరైటీస్, సర్వే రాళ్ల కొనుగోళ్లలో బిల్లుల చెల్లింపు వ్యవహారంలో ఆయనతో పాటు ఆర్థిక విభాగంలో పనిచేసిన నలుగురిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించలేదు. ఇంకా నాగేశ్వరరెడ్డి జీఎంగా కొనసాగుతున్నారు.