Share News

జగన్‌ అబద్ధాలతో మోళ్లుగా నల్లమల అడవి

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:21 AM

పవన్‌ కల్యాణ్‌ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో హాస్యనటుడు బ్రహ్మానందంను ఓ చెట్టుకింద నుంచో బెట్టి, ‘అబద్ధాలు ఆడితే ఆకులు రాలిపోతాయి’ అని చెపుతారు.

జగన్‌ అబద్ధాలతో మోళ్లుగా నల్లమల అడవి

ఆడపడుచుల పసుపు తాళ్లు తెంపేస్తున్నాడు: పురందేశ్వరి

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ‘‘పవన్‌ కల్యాణ్‌ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో హాస్యనటుడు బ్రహ్మానందంను ఓ చెట్టుకింద నుంచో బెట్టి, ‘అబద్ధాలు ఆడితే ఆకులు రాలిపోతాయి’ అని చెపుతారు. అలా, అబద్ధాల కోరు సీఎం జగన్‌ను నల్లమల అడవుల్లోకి తీసుకెళ్లి కూర్చోపెడితే... అతని అబద్ధాలకు ఏకంగా అడవే మోడైపోతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం లోక్‌సభ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఎద్దేవా చేశారు. ఇక్కడ ఆదివారం సాయంత్రం జరిగిన రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ కూటమి నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘నరంలేని నాలుక ఏదైనా మాట్లాడవచ్చు. దానికో పద్ధతి ఉండాలి. జగన్‌ మద్య నిషేధం పూర్తిగా అమలుచేసి మళ్లీ ఓటు అడుగుతానని చెప్పి ఓట్లేయించుకున్నాడు. నిషేధం మాట దేవుడెరుగు. నాసిరకం మద్యం తయారు చేయించి అత్యధిక ధరలతో సామాన్యులను నిలువునా దోపిడీ చేస్తున్న దుర్మార్గుడు. ఆడపడుచుల పసుపు తాళ్లు తెంపేస్తున్న దుర్మార్గుడు. ఇతడిని ఇంకా మనం సహించాలా? రైతులను దగా చేస్తున్నారు. కనీస గిట్టుబాటు ధర లేకుండా, వ్యవసాయ ఉత్పత్తులను కొనేవాడు లేకుండా చేసి ఇబ్బంది పెడుతున్నాడు. శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తానన్నాడు. ఏవీ..? ఇటువంటి దుర్మార్గుడని ఇంకా సంహించాలా? ఏ ప్రభుత్వం అయినా నిర్మాణాత్మక పనులతో తమ పాలన మొదలు పెడుతుంది. కానీ ఈ దుర్మార్గుడు ప్రజావేదిక, అన్నక్యాంటీన్ల విధ్వంసంతో మొదలెట్టాడు. అన్ని వర్గాలను దోచేశాడు. మట్టి, ఇసుక, మైన్స్‌, లిక్కర్‌, డ్రగ్స్‌ అన్నీ మాఫియాలే.. ఇతన్ని మనం ఇంకా సహించాలా? అనుభవజ్ఞుడైన చంద్రబాబు యుక్తి, పవన్‌ శక్తి, మోదీ స్ఫూర్తితో ఈ రాష్ర్టాన్ని రక్షించడానికి, అభివృద్ధి చేయడానికి ఈ దుర్మార్గుడైన జగన్‌ను ఓడించాలి. వైసీపీని ఇంటికి పంపించాలి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తు చారిత్రక ఘట్టం మాత్రమే కాదు... చారిత్రక అవసరం’ అని పురందేశ్వరి అన్నారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... సైకో జగన్‌ను సాగనంపడానికే టీడీపీ-జనసేన, బీజేపీ ఒకటయ్యాయన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 04:22 AM