జగన్ సర్కారు పాపం పిల్లలకు శాపం
ABN , Publish Date - Oct 21 , 2024 | 04:41 AM
విద్యార్థులకు తాను మేనమామ లాంటి వాడినన్నారు. ఎంత ఖర్చయినా చదివిస్తానని బీరాలు పలికారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలు ప్రవేశ పెట్టామని గొప్పలు చెప్పారు.
గతేడాది ఉన్నత విద్య విద్యార్థులకు మూడు క్వార్టర్ల ఫీజులు పెండింగ్
ఫీజులు కడితేనే పరీక్షలు రాయిస్తామని విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి
మొత్తం బకాయిలు 2,100 కోట్ల పైనే
వచ్చే నెలలోనే ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు
ఫైనలియర్ విద్యార్థులకు సర్టిఫికెట్లూ నిలిపివేత
తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ చెల్లింపు
మరోవైపు వసతి దీవెన 1400 కోట్లు పెండింగ్
వేల కోట్లు పెండింగ్ పెడితే ఎలా అంటున్న కాలేజీలు
ఈ ఆర్థిక భారమంతా కూటమి ప్రభుత్వంపైనే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
విద్యార్థులకు తాను మేనమామ లాంటి వాడినన్నారు. ఎంత ఖర్చయినా చదివిస్తానని బీరాలు పలికారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలు ప్రవేశ పెట్టామని గొప్పలు చెప్పారు. ఇన్ని మాటలు చెప్పి... చివరకు గతేడాది ఉన్నత విద్య విద్యార్థులకు మూడు క్వార్టర్ల ఫీజులు దాదాపు రూ.2100 కోట్లు బకాయి పెట్టారు. వసతి దీవెన కింద మరో 1400 కోట్లూ విద్యార్థులకు ఇవ్వలేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన నిర్వాకం ఇప్పుడు విద్యార్థులకు శాపంగా మారింది. కూటమి ప్రభుత్వానికి భారంగా మారింది. ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు మొన్నటిదాకా విద్యార్థులకు కరాఖండీగా చెప్పేశాయి. చెల్లించని విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపేశాయి. ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరంలో ఫీజులు కడితేనే పరీక్షలు అంటూ కొత్త మెలిక పెడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులపై యాజమాన్యాలు ఇలా తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నాయి. ప్రభుత్వం ఫీజులు విడుదల చేసిందా? లేదా? అనేది తమకు అనవసరమని, ఫీజులు కట్టి పరీక్షలు రాయాలని తేల్చి చెబుతున్నాయి. గత ప్రభుత్వం ఫీజులు విడుదల చేయలేదని తెలిసినా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. జగన్ సర్కారు పాపాలు విద్యార్థులను ఇప్పటికీ వెంటాడుతున్నాయి.
ఒక్క విడతే విడుదల
2023-24 విద్యా సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం ఫీజులు విడుదలలో విద్యార్థులను మోసం చేసింది. ఏడాదికి నాలుగు క్వార్టర్లకు 4విడతలుగా ఫీజులు చెల్లించాల్సి ఉండగా, కేవలం ఒక్కసారే ఫీజులు ఇచ్చి చేతులు దులుపుకొంది. దీంతో గత విద్యా సంవత్సరంలో ఉన్నత విద్య విద్యార్థులకు మూడు క్వార్టర్ల ఫీజులు బకాయి పడిపోయాయి. రాష్ట్రంలో 9.44 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్, డిగ్రీ ఇతర ఉన్నత విద్య కోర్సులు చదువుతున్నారు. వారికి ఒక క్వార్టర్‌కు ఫీజులు రూ.708 కోట్లు చెల్లించాలి. మూడు క్వార్టర్లకు మొత్తం రూ.2,124 కోట్లు విడుదల చేయాలి. ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు ఆపేయడంతో ఆ భారం విద్యార్థుల తల్లిదండ్రులపై పడింది. మరోవైపు గత ప్రభుత్వం వసతి దీవెన కింద విద్యార్థులకు చెల్లించాల్సిన 1400 కోట్లు బకాయి పెట్టింది.
వచ్చే నెలలో పరీక్షలు
ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు ఏడో సెమిస్ట్టర్ పరీక్షలు నవంబరు 25న ప్రారంభం కానున్నాయి. మూడో సంవత్సరం విద్యార్థులకు ఐదో సెమిస్టర్ పరీక్షలు నవంబరు 11న ప్రారంభమవుతాయి. సెకెండియర్ విద్యార్థులకు మూడో సెమిస్టర్ పరీక్షలు కూడా నవంబరు 11నే మొదలవుతాయి. సాధారణ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు ఏడో సెమిస్టర్ పరీక్షలు నవంబరు 4న ప్రారంభం కానున్నాయి. ఇతర ఉన్నత విద్య కోర్సుల పరీక్షలు కూడా అటూ ఇటూగా ఈ సమయంలోనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఫీజులు విడుదల చేయకపోయినా సొంత డబ్బులు చెల్లించి రాయాలని యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. పరీక్షలు రాయనివ్వబోమని, సర్టిఫికెట్లు ఇవ్వబోమని, తరగతులకు కూడా రానీయమంటూ బెదిరింపులకు దిగుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వేరేదారి లేక అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు.
ఈ ప్రభుత్వంపై ఫీజుల భారం
గత ప్రభుత్వం భారీగా ఫీజులు బకాయి పెట్టడంతో ఈ ప్రభుత్వంపై భారం పెరిగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో పాటు వసతి దీవెన కలిపి వైసీపీ ప్రభుత్వం రూ.3,500 కోట్ల మేర బకాయిలు పెట్టింది. ఒకేసారి ఇవన్నీ చెల్లించడం కూటమి ప్రభుత్వానికి ఆర్థికంగా పెద్ద సమస్య కానుంది. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయకపోతే ఫీజులు ఎప్పుడు విడుదల చేసినా తల్లిదండ్రులు పట్టించుకోరు. కాలేజీ యాజమాన్యాల వాదన మరోలా ఉంది. వేల కోట్లు పెండింగ్ పెడితే తాము కాలేజీలు ఎలా నడపాలని ప్రశ్నిస్తున్నాయి. విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీలో ఇబ్బందులు, పరీక్షలు రాయకుండా అడ్డుకోవడంపై కూటమి ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించలేకపోతోంది. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఫిర్యాదు చేసినా
ఫీజులు చెల్లించలేదనే కారణంతో ఫైనలియర్ పూర్తయిన ఉన్నత విద్య విద్యార్థులకు ఆ మధ్య కాలేజీలు సర్టిఫికెట్లు ఆపేశాయి. రాజధాని కార్యకలాపాలు సాగుతున్న విజయవాడలోనే పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టింది. దీనిపై ఉన్నత విద్య కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి సొంత డబ్బు చెల్లించి విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోవాల్సి వచ్చింది.
జగన్ నిర్వాకంతోనే...
జగన్ సర్కారుకు ముందు విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం నేరుగా కాలేజీల యాజమాన్యాలకు చెల్లించేది. దీంతో ఫీజులు కట్టమని విద్యార్థులను యాజమాన్యాలు అడిగేవి కావు. విద్యార్థులకూ ఫీజులు చెల్లించాల్సిన బాధ ఉండేది కాదు. ప్రభుత్వం ఫీజులు చెల్లించడం ఆలస్యమైనా వెసులుబాటు ఉండేది. అయితే జగన్ సర్కారు ఈ విధానం మార్చేసింది. ఫీజులను విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు వేసేది. వారు కాలేజీల్లో చెల్లించాలి. దీనివల్ల ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోయినా విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా కాలేజీల్లో కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాజమాన్యాలు కూడా విద్యార్థులనే అడుగుతున్నాయి. జగన్ సర్కారు ఫీజు బకాయిలు పెట్టడంతో వారికి సమస్యలు తెచ్చిపెడుతోంది.