ప్రజలతో జగన్ ముఖాముఖి వాయిదా
ABN , Publish Date - Jul 15 , 2024 | 04:36 AM
సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత ప్రజలనే కాదు.. సొంత పార్టీ నేతలను కలిసేందుకు కూడా వైసీపీ అధ్యక్షుడు,
వైసీపీ నేతలతో కూడా..
అసెంబ్లీ భేటీ సమయంలో కలుస్తానన్న మాజీ సీఎం
అమరావతి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత ప్రజలనే కాదు.. సొంత పార్టీ నేతలను కలిసేందుకు కూడా వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సుముఖత చూపడం లేదని వైసీపీ నాయకులు గుసగుసలాడుతున్నారు. సోమవారం నుంచి తాడేపల్లి ప్యాలెస్ గేట్లు తెరచుకుంటాయని.. ప్రజలు, పార్టీ నేతలు నేరుగా తనను వచ్చి కలుసుకోవచ్చని సన్నిహితులతో ఆయన చెప్పారు. ఈ మాటలను నేతలు సందేహిస్తూనే నమ్మారు. అయితే సోమవారం తనకు వ్యక్తిగత పనులున్నాయని.. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు నేతలకు తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమ యం నుంచి కలుస్తానని చెప్పారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలో ప్రతిరోజూ స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలను కలుస్తానని జగన్ సీఎంగా ఉండగా అట్టహాసంగా ప్రకటించారు. గ్రామాల్లో పర్యటించే సమయంలో రచ్చబండ కూడా నిర్వహిస్తానని.. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తానని చెప్పారు. కానీ గత ఐదేళ్లలో అదేమీ జరుగలేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన దరిమిలా.. త్వరలోనే రోజూ ఉదయం ప్రజలను కలసి వినతులు స్వీకరించి ప్రభుత్వంపై పోరాటం చేస్తానని జగన్ పార్టీ ముఖ్య నాయకులకు వెల్లడించారు. అదే సమయంలో వైసీపీ నేతలను కూడా కలిసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తాననడంతో.. తమ నాయకుడిలో మార్పు వచ్చిందని వారు సంబరపడ్డారు. అదీ జరుగలేదు. ఆ తర్వాత ప్రజలను కలవడానికి ఈ నెల 15న (సోమవారం) ముహూర్తం పెట్టారు. దాన్ని కూడా వాయిదావేయడంతో ఆయనవన్నీ వట్టి మాటలేనని వారు నిట్టూరుస్తున్నారు.