Share News

AP Elections: జగన్‌ ‘బొమ్మ’ తీయాల్సిందే!

ABN , Publish Date - Mar 18 , 2024 | 03:52 AM

రాష్ట్రంలో ఎటు చూసినా జగన్‌ బొమ్మలు, వైసీపీ జెండా రంగులే. పంచాయతీ కార్యాలయాలు, ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాల భవనాలకు పార్టీ ‘రంగు’ వేశారు.

AP Elections: జగన్‌ ‘బొమ్మ’ తీయాల్సిందే!

  • ఎన్నికల అధికారులకు సవాల్‌ .. ఎటు చూసినా సీఎం ఫొటోలు.. వైసీపీ జెండా రంగులే

  • సచివాలయాలు, పంచాయతీలు ఆర్బీకే భవనాలపై రుద్దుడు

  • వైట్‌ వాష్‌ చేయాలంటే భారీ ఖర్చు

  • ప్రభుత్వ పథకాలపైనా ముద్రణ

(అమరావతి-ఆంధ్రజ్యోతి) :

రాష్ట్రంలో ఎటు చూసినా జగన్‌ బొమ్మలు (YS Jagan) , వైసీపీ (YSR Congress) జెండా రంగులే. పంచాయతీ కార్యాలయాలు, ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాల భవనాలకు పార్టీ ‘రంగు’ వేశారు. ప్రభుత్వ పథకాలపై జగన్‌ ఫొటోలు వేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఇప్పుడు నిబంధనల ప్రకారం వీటన్నింటినీ తొలగించాలి. సార్వత్రిక ఎన్నికలకు శనివారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా కోడ్‌ అమల్లోకి వచ్చింది. అయితే మన రాష్ట్రంలో కోడ్‌ అమలు చేయడం ఎన్నికల అధికారులకు సవాలుగా మారింది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సచివాలయాల భవనాలకు వైసీపీ రంగులు, ఆ పార్టీ గుర్తులు తొలగించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. పలువురు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో స్థానిక సంస్థల్లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన యఽథేచ్ఛగా జరిగింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ రంగుల పిచ్చికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతి చోటా జగన్‌ బొమ్మతో పాటు నీలి, ఆకుపచ్చ రంగులు వేయడం సర్వ సాధారణంగా మారిపోయింది. ప్రభుత్వ ఆస్తులను కూడా వదలలేదు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్‌ మీనా ఆదేశాలతో ఆదివారం అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల్లో సిబ్బంది ప్రభుత్వ ఆస్తులపై ఉన్న ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు తదితర ప్రచార సామగ్రిని తొలగించారు. అయితే జగన్‌ బొమ్మలు, వైసీపీ రంగులు తొలగించాలంటే మరో ‘బడ్జెట్‌’ అవసరమయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు. గతంలో కోర్టు ఆదేశించినా సచివాలయాలు, గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలలకు వైసీపీ రంగులను తొలగించలేదు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో సచివాలయాల భవనాలకు వైసీపీ రంగులు అలానే ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే బొమ్మలను సైతం సచివాలయ భవనాలకు వేశారు.

వాటన్నింటినీ ఇప్పటికిప్పుడు తొలగించాలంటే చాలా ఖర్చు అవుతుంది. గ్రామాలు, పట్టణాల్లో ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా అధికార వైసీపీ ప్రచార జెండాలే కనిపిస్తున్నాయి. ఇతర పార్టీలు ఏవైనా జెండాలు గాని, ప్లెక్సీలు గాని కడితే వాటిని ఎప్పటికప్పుడు తీసేసేవారు. అధికార పార్టీ జెండాలు మాత్రమే కట్టినవి కట్టినట్లు ఉన్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో జెండా లు, ఫ్లెక్సీలు అయితే తీసేయగలిగారు. కానీ అన్ని చోట్లా జగన్‌ బొమ్మలు, వైసీపీ రంగులు తొలగించడం సాధ్యమయ్యేనా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల పంచాయతీలు, సచివాలయ భవనాలకు వైసీపీ రంగులు ఉన్నాయి. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో చెత్తకుండీలు, వాహనాలు, తోపుడు బండ్లు, రిక్షాలు, వాటర్‌ ట్యాంక్‌లకు సైతం వైసీపీ రంగులు వేశారు. విద్యుత్‌ స్తంభాలకు సైతం వైసీపీ రంగులు వేశారు. వాటిని చెరిపేయాలంటే రంగులు వేయాల్సిందే. అలాగే పలు సంక్షేమ పథకాలకు సంబంధించి జగన్‌ బొమ్మలు, వైసీపీ రంగులు తొలగించాలి. అంగన్వాడీలు, పాఠశాల పిల్లలకు చిక్కీ లు సరఫరా చేసే కవర్‌ కూడా జగన్‌ బొమ్మ, వైసీపీ రంగులతో ఉంది. చిక్కీపైన ఉన్న కవర్‌ చించి చిక్కీలు మాత్రమే పంపిణీ చేయాలని అధికారులు కింది స్థాయి ఉద్యోగులకు సూచించారు. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్ల ద్వారా ఎక్కడంటే అక్కడ స్టిక్కర్లు వేయించారు. కొన్ని చోట్ల మున్సిపాలిటీ సిబ్బంది తొలగించినా వైసీపీ కార్యకర్తలు మళ్లీ అతికిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్‌ ఫొటోలు ఉన్నాయి. వాటిని తొలగించాలని ఆయా శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారమిచ్చారు. అయితే ఇంకా కొన్ని కార్యాలయాల్లో జగన్‌ బొమ్మను తొలగించే సాహసం చేయలేకపోతున్నారు. రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలను వైసీపీ రంగులతో ముంచెత్తారు. వాటికి వైట్‌ వాష్‌ వేయాలంటే వ్యయంతో కూడిన పని అని అంటున్నారు.

Updated Date - Mar 18 , 2024 | 08:01 AM