బీసీలకు జగన్ వెన్నుపోటు
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:10 AM
రాష్ట్రంలో బీసీ వర్గాలకు తాము వెన్నుదన్నుగా నిలిస్తే సీఎం జగన్ వారికి వెన్నుపోటు పొడిచారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు.

టీడీపీ ఆర్థికంగా ఆదుకుంటే వైసీపీ అన్నింటా అణగదొక్కింది
350 మంది బీసీ నేతల హత్య.. 26 వేల మందిపై కేసులు
జయహో బీసీ సభలో నారా లోకేశ్
అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ వర్గాలకు తాము వెన్నుదన్నుగా నిలిస్తే సీఎం జగన్ వారికి వెన్నుపోటు పొడిచారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. మంగళగిరి సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో మంగళవారం జరిగిన ‘జయహో బీసీ’ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘స్థానిక సంస్థల్లో బీసీలకు 24శాతం రిజర్వేషన్లు ఉన్నాయంటే దానికి కారణం టీడీపీ. బీసీ వర్గాలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్ పెట్టి దానికింద రూ.36 వేల కోట్లు వారి అభివృద్ధికి వ్యయంచేశాం. బీసీ కార్పొరేషన్ పెట్టి రూ.3వేల కోట్లతో 4లక్షల మంది స్వయం ఉపాధికి చేయూతనిచ్చాం. ఆదరణ పథకం కింద రూ.వెయ్యి కోట్లతో వృత్తి పరికరాలు అందచేశాం. మాకంటే బాగా చేస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ బీసీ వర్గాలను వెన్నుపోటు పొడిచారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 10శాతం కోతపెట్టి, బీసీ వర్గాలవారు 16వేల పదవులు కోల్పోవడానికి కారణమయ్యారు. 350మంది బీసీ నేతలను దారుణంగా హత్య చేశారు. 26వేల మందిపై అక్రమ కేసులు పెట్టారు. జగన్ పెట్టే కేసులకు ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరు. మీ ఎఫ్‌ఐఆర్‌లు మడిచి ఎక్కడ పెట్టుకొంటారో పెట్టుకోండి. తప్పుడు పనులు చేసి రెడ్ బుక్‌లో ఎక్కినవారి సంగతి సరిగ్గా 2నెలల తర్వాత ఏంచేయాలో అది చేసి చూపిస్తాం’’ అని లోకేశ్ ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో మంగళగిరిలో 53వేల మెజారిటీతో గెలిచి ఆ సీటును చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు కానుకగా ఇస్తానని లోకేశ్ ప్రకటించారు.