Share News

బటన్‌ నొక్కుడంతా జగన్మాయ

ABN , Publish Date - Apr 19 , 2024 | 03:56 AM

బటన్‌ నొక్కుడంతా జగన్మాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి ఆరోపించారు. ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి... మరో చేత్తో వెండి చెంబు దొబ్బేస్తున్నాడని సీఎం జగన్‌పై ఆమె మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా...

బటన్‌ నొక్కుడంతా  జగన్మాయ

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్‌ లేరు

జగన్‌ పాలనలో ఇసుక, మద్యం, మైనింగ్‌, భూ దందాలే

కాంగ్రెస్‌తోనే ప్రత్యేక హోదా, పోలవరం: షర్మిల

అనంతపురం, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): బటన్‌ నొక్కుడంతా జగన్మాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి ఆరోపించారు. ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి... మరో చేత్తో వెండి చెంబు దొబ్బేస్తున్నాడని సీఎం జగన్‌పై ఆమె మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా... ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర, శింగనమల, ఉరవకొండ నియోజకవర్గాల్లో గురువారం ఏర్పాటు చేసిన న్యాయయాత్ర బహిరంగ సభల్లో ఆమె ప్రసంగించారు. అధికారంలోకి రావడానికి అనేక హామీలిచ్చారని, ఐదేళ్ల పాలనలో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారని ధ్వజమెత్తారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో డీఎస్సీ అంటూ నిరుద్యోగ యువత జీవితాలతో జగన్‌ చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఐదేళ్లలో 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని జగన్‌ హామీ ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మద్యనిషేధం అమలు చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని హామీ ఇచ్చిన జగనన్న.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఇసుక, మద్యం, మైనింగ్‌, భూ దందాలతో దోచుకోవడంతోనే సరిపెట్టారని, ప్రజల సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోసం ఏ ఒక్కరూ పనిచేయలేదని ఆరోపించారు. నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వార్టర్‌ బాటిల్‌ ధర రూ.60 అయితే.. ఈ ప్రభుత్వం రూ.200కు అమ్ముతోందని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం తాగి మృతిచెందిన వారి కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని సీఎం జగన్‌ను నిలదీశారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా, ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా అని ప్రశ్నించారు. మూడు రాజధానులు కడతామని అంటున్నారని, ఒక్క రాజధాని అయినా కట్టారా? అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్‌ లేరని, వై అంటే వైవీ సుబ్బారెడ్డి... ఎస్‌ సాయిరెడ్డి... ఆర్‌ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని వివరించారు. కాంగ్రె్‌సతోనే ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తి సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే.. ప్రతి మహిళ పేరిట రూ.5లక్షలతో పక్కా గృహం, పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఆర్థికసాయం, వృద్ధులకు రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు పింఛను అందిస్తామని షర్మిల హామీ ఇచ్చారు. ‘ఓటు వజ్రాయుధం. ఓటు మీ భవిషత్తు, మీ పిల్లల భవిషత్తును నిర్ణయిస్తుంది. ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఓటు వేయండి’ అని ప్రజలను కోరారు. ఎన్నికల్లో డబ్బు పంచడానికి వైసీపీ నాయకులు సిద్ధమయ్యారన్నారు. ‘ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి. ఆ డబ్బులన్నీ మీవే’ అని అన్నారు. ప్రజలకు మంచిచేసే కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.

Updated Date - Apr 19 , 2024 | 07:42 AM