Share News

రైల్వే జోన్‌కు జగనే శాపం!

ABN , Publish Date - Apr 28 , 2024 | 02:37 AM

సీఎం జగన్‌ చేష్ఠలు విశాఖలో రైల్వేజోన్‌కు శాపంగా మారాయని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ధ్వజమెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వకపోవడం వల్లే విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటు కాలేదని, దానిని కప్పిపుచ్చుకోవడానికి సీఎం జగన్‌, మంత్రి బొత్స కుంటి సాకులతో కాలక్షేపం చేస్తున్నారని దుయ్యబట్టాయి.

రైల్వే జోన్‌కు జగనే శాపం!

భూములు ఇవ్వకే ఏర్పాటు కాలేదు

కూటమి వస్తేనే కల సాకారం

టీడీపీ, జనసేన, బీజేపీ స్పష్టీకరణ

అమరావతి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ చేష్ఠలు విశాఖలో రైల్వేజోన్‌కు శాపంగా మారాయని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ధ్వజమెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వకపోవడం వల్లే విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటు కాలేదని, దానిని కప్పిపుచ్చుకోవడానికి సీఎం జగన్‌, మంత్రి బొత్స కుంటి సాకులతో కాలక్షేపం చేస్తున్నారని దుయ్యబట్టాయి. ఈ మూడు పార్టీల అధికార ప్రతినిధులు లంకా దినకర్‌(బీజేపీ), పిల్లి మాణిక్యాలరావు(టీడీపీ), గౌతమ్‌ (జనసేన) శనివారమిక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘రైల్వే జోన్‌ విశాఖకు తేవాలన్న చిత్తశుద్ధి జగన్‌కు, వైసీపీకి లేవు. అసత్యాలు చెప్పడంలో చూపించే శ్రద్ధ జోన్‌ ఏర్పాటుపై లేదు. ప్రభుత్వం భూములు ఇవ్వకపోవడం వల్లే రాష్ట్రానికి రైల్వే జోన్‌ రాలేదని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చెబితే దాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. విశాఖలో రైల్వే స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని దానికి బదులుగా ముడసర్లోవ రిజర్వాయర్‌ వద్ద 52ఎకరాలు ఇచ్చింది. ఆ భూమిని రైల్వే జోన్‌కు ఇచ్చామని బొత్స అబద్ధాలు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం రిజర్వాయర్‌ ముంపు ప్రాంతంలో ఉన్న ఆ భూమికి చుట్టూ 800ఎకరాల్లో ఏ నిర్మాణం చేపట్టకూడదు.


మరి రైల్వే జోన్‌ భవనాల నిర్మాణం ఎలా చేస్తారు? దీనిపై ప్రజల్లో తీవ్ర విమర్శలు రావడంతో 2023 డిసెంబరులో వేరే భూమిని కేటాయించారు. కానీ దాన్ని రైల్వేశాఖకు బదలాయించలేదు. దానిపై నా విమర్శలు రావడంతో ఇటీవల భూముల బదలాయింపు జరిగింది. ఇవే భూములు 2019లోనే ఇచ్చి ఉంటే ఈ సరికి జోన్‌ ఆచరణలోకి వచ్చేది. జోన్‌కు కేంద్రం 2020-21 బడ్జెట్‌లో రూ.106 కోట్లు కేటాయించింది. భూముల్లేక ఆ నిధులు మురిగిపోయాయి. 2009-14మధ్య కాంగ్రెస్‌ ఈ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు ఏడాదికి సగటున రూ.886 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం దానిని రూ.7,500 కోట్లకు పెంచింది. రాష్ట్రంలో రూ.70 వేల కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇంత చేస్తుంటే ఇంకా కేంద్రాన్ని తప్పుబట్టడానికి వైసీపీ మంత్రులకు సిగ్గుండాలి’ అని దినకర్‌ విమర్శించారు. సీఎం ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్నా ఈ ప్రాంతానికి చెందిన బొత్సకు మాట్లాడే శక్తి లేదని మాణిక్యాలరావు ఎద్దేవా చేశారు. వరదలు వస్తే మునిగిపోయే స్ధలం ఇచ్చి.. అందులో రైల్వే జోన్‌ కట్టలేదని బొత్స చెప్పడం దుర్మార్గమని గౌతమ్‌ అన్నారు. కూటమి ప్రభుత్వం వస్తేనే రైల్వే జోన్‌ ఏర్పాటు కల సాకారమవుతుందని చెప్పారు.

Updated Date - Apr 28 , 2024 | 09:06 AM