జగనన్నా.. ఎందుకు భయం?
ABN , Publish Date - Apr 03 , 2024 | 04:15 AM
తన తండ్రి వివేకానందరెడ్డి హత్య విషయంలో తనతోపాటు రాష్ట్ర ప్రజలందరూ జగన్ ఉచ్చులో పడ్డారని సునీతా రెడ్డి పేర్కొన్నారు.

సునీత సూటి ప్రశ్నలు
అవినాశ్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు?
అరెస్టు చేస్తే నిజాలు బయటపడతాయనా?
షర్మిలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నాడు ఆమెను కడప ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని వివేకా నిర్ణయించారు. ఆమెకు మద్దతు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే మా నాన్నను కిరాతకంగా హత్య చేశారా? నిజమేంటో బయటకు రావాలి. నా ప్రశ్నలకు జగనన్న సమాధానం చెప్పాలి.
షర్మిల లక్ష్యం, నా లక్ష్యం ఒక్కటే. అవినాశ్ రెడ్డిని ఓడించాలి. కుదిరితే... జగనన్ననూ (పులివెందులలో) ఓడించాలి. రాష్ట్రంలో తిరిగి వైసీపీ అధికారంలోకి రాకూడదు.
- సునీతా రెడ్డి (వివేకా కుమార్తె)
సీఎంగానైనా నా ప్రశ్నలకు బదులివ్వాలి
జగన్ చానల్‌లో చర్చకు కూడా సిద్ధం
వివేకా హత్య తర్వాత జగన్ ఉచ్చులో నేనూ, జనం
తండ్రి చనిపోయాక నన్ను తోలుబొమ్మలా ఆడించారు
రక్తంలో మునిగిన వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకూడదు
అవినాశ్ ఓటమి, కుదిరితే జగన్ ఓటమే లక్ష్యం: సునీత
అమరావతి, ఏప్రిల్ 2( ఆంధ్రజ్యోతి): తన తండ్రి వివేకానందరెడ్డి హత్య విషయంలో తనతోపాటు రాష్ట్ర ప్రజలందరూ జగన్ ఉచ్చులో పడ్డారని సునీతా రెడ్డి పేర్కొన్నారు. ‘‘నాన్న హత్య తర్వాత మిమ్మల్ని (జగన్‌ను) గుడ్డిగా నమ్మి మీరు చెప్పినట్లు చేశాను. నేను చేసిన తప్పును గ్రహించాను. దానిని సరిదిద్దుకొనేందుకు సమయం వచ్చింది. అందుకోసమే ఈ ప్రయత్నం’’ అని తెలిపారు. పులివెందుల పోలీసులు తనపైనా, తన భర్తపైనా నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యం సోమవారం విచారణ ఉన్న సందర్భంగా సునీత హైకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘చిన్నాన్నను ఎవరు హత్య చేశారో దేవుడికి తెలుసు, కడప ప్రజలకు తెలుసు అని జగనన్న ప్రకటనలు చేస్తున్నారు. అంటే.. ఆ ప్రాంతవాసిగా ఆయనకు కూడా తెలుసనే కదా. మరి హత్య చేసినవారి పేర్లను ఎందుకు బయటపెట్టడం లేదు? ముఖ్యమంత్రిగానైనా దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగనన్నపై ఉంది. అవినాశ్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి. ఆయనను అరెస్ట్ చేస్తే ఇతర విషయాలు కూడా బయటకు వస్తాయని భయపడుతున్నారా?’’ అని సునీత ప్రశ్నించారు. తన ప్రశ్నలకు ఒక అన్నగా జగన్ తనకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేనప్పటికీ... ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత కచ్చితంగా ఉందన్నారు. ‘‘జగన్ ఎందుకు భయపడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను లేవనెత్తిన ప్రశ్నలపై జగన్ సొంత చానల్‌కు వచ్చి చర్చించేందుకూ సిద్ధం’’ అని సునీత పేర్కొన్నారు.
ప్రతిసారీ మోసం చేయలేరు...
‘‘ఎవరో పన్నిన ఉచ్చులో నేను, షర్మిల పడ్డామని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డితోపాటు పలువురు పదేపదే చెబుతున్నారు. వాస్తవానికి వివేకా హత్య తర్వాత జగన్ పన్నిన ఉచ్చులోనే నాతోపాటు రాష్ట్రప్రజలంతా పడ్డారు. అప్పట్లో నన్ను జగన్ తోలుబొమ్మలా ఆడించారు. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టించి అవినా్‌షరెడ్డికి అనుకూలంగా మాట్లాడించారు. ఎవరినైనా ఒకసారి మోసం చేయవచ్చు. పదేపదే చేయలేరు. ప్రజలు చాలా తెలివైనవారు. నిజం గ్రహిస్తారు. సానుభూతి మాటలతో ప్రతీసారి ప్రజలను మోసం చేయలేరు’’ అని సునీత తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగి ఉందని, దీని నుంచి బయటపడితేకానీ రాష్ట్ర పురోగతి సాధ్యం కాదని తెలిపారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే తనకు, రాష్ట్ర ప్రజలకూ మంచిది కాదని హెచ్చరించారు.
పార్టీని నిలబెట్టిన షర్మిల...
కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిలకు సునీత అభినందనలు తెలిపారు. అప్పట్లోనే షర్మిలకు కడపలో పోటీకి నిలబెట్టాలని వివేకానందరెడ్డి శాయశక్తులా ప్రయత్నించారని, ఈ క్రమంలోనే ఆయన హత్యకు గురయ్యారని చెప్పారు. ‘‘పెదనాన్న రాజశేఖరెడ్డి చనిపోయిన తరువాత జగన్ జైలుకు పోయినప్పుడు జరిగిన ఉపఎన్నికల్లో షర్మిల కష్టపడి ప్రచారం చేశారు. పాదయాత్ర చేసి షర్మిల పార్టీని నిలబెట్టారు. జైలు నుంచి వచ్చిన తర్వాత షర్మిల ఎక్కడ బలపడుతుందో అని ఆమెను జగన్ పక్కనపెట్టారు. వారికి ఎప్పుడు అవసరం వచ్చినా షర్మిల సహాయం చేసింది. 2014, 2019 ఎన్నికల్లో ప్రచారం చేసి పార్టీని గెలిపిస్తే చివరికి ఆమెను పక్కనపెట్టారు’’ అని సునీత పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో విచారణ జరిగి శిక్ష పడితే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కుదరదని విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఇది వ్యవస్థలతో ఆడుకోవడం కాదా అని ప్రశ్నించారు.
అంతకంటే క్రూరంగా చంపారు...
తన తండ్రి హత్యోదంతంపై వచ్చిన ‘వివేకం’ సినిమాను చాలా ధైర్యంగా తీశారని సునీత తెలిపారు. అయితే... సినిమాలో కొన్ని సంఘటనలను చాలా లైట్‌గా తీశారని, వాస్తవంగా అవి మరింత ఘోరంగా ఉన్నాయని చెప్పారు. తన తండ్రిని సినిమాలో చూపించినదాని కన్నా మరింత క్రూరంగా హత్య చేశారన్నారు.