Share News

మా ఊర్లో జగనన్న శూన్యం..!

ABN , Publish Date - Jan 17 , 2024 | 02:40 AM

జగన్‌ ప్రభుత్వం వచ్చాక మా ఊర్లో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదు.. మీటరు సీసీ రోడ్డూ వేయలేదప్పా..

మా ఊర్లో  జగనన్న శూన్యం..!

గ్రామంలో ఒక్క రూపాయి పనైనా చేసినాడా..?

జగనన్న ఇల్లూ లేదు.. సెంటు స్థలమూ ఇవ్వలేదు

శ్మశానాల్లో కాపురం చేయమన్నట్టుంది జగన్‌ అభివృద్ధి

ఈ వైసీపీ ఉంటుందో.. ఊడిపోతుందో అర్థం కావట్లేదు

ఐప్యాక్‌ టీం సర్వేలో వైసీపీ నేత రాజన్న ఘాటు సమాధానం

కర్నూలు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ ప్రభుత్వం వచ్చాక మా ఊర్లో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదు.. మీటరు సీసీ రోడ్డూ వేయలేదప్పా.. జగనన్న ఇల్లు లేదు.. సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. నేను బటన్‌ నొక్కుతున్నా అంటున్నాడు..! ఎవరికి నొక్కుతున్నాడు.. ఎవరు అడిగారు డబ్బులు..? రేపు ఎన్ని ఓట్లు వేయించుకుంటాడో ఈ జగన్మోహన్‌రెడ్డి.. ఈ వైసీపీ ఉంటుందో.. ఊడిపోతుందో..? అర్థం కావడం లేదు....’ ఐప్యాక్‌ టీం సర్వే సందర్భంగా.. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం పుడిచెర్ల గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్‌ నాయకుడు రాజన్న అన్న మాటలివి. ఇటీవల ప్రజల నుంచి సర్వే పూర్తిచేసిన ఐప్యాక్‌ టీం తాజాగా వైసీపీ నేతలతో నేరుగా మాట్లాడుతోంది. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో ఓ సంభాషణ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఐప్యాక్‌ టీం మోహన్‌, వైసీపీ నేత రాజన్న మధ్య ఫోన్‌ సంభాషణ సాగిందిలా...

ఐప్యాక్‌ మోహన్‌: నమస్తే సార్‌.. రాజన్న గారా..? నా పేరు మోహన్‌.. ఐప్యాక్‌ టీం నుంచి ఫోన్‌ చేస్తున్నాను

రాజన్న: అవును రాజన్ననే.. చెప్పండప్పా..

ఐప్యాక్‌ మోహన్‌: అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినవి చెప్పినట్టు చేశామా..? ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా?

రాజన్న: అభివృద్ధి అంటే.. మా ఊర్లో జరిగిన అభివృద్ధి ఇండియాలో ఎక్కడా జరిగి ఉండదప్పా (హేళనగా)... జగనన్న కాలనీలో ఏ ఒక్కరికీ ఒక్క షెడ్డు కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఓ గంప కంకర.. సిమెంట్‌ రోడ్డు వేయలేదు.

ఐప్యాక్‌ మోహన్‌: ఏ అభివృద్ధీ జరగలేదా..?

రాజన్న: ఏడిది లేదప్పా.. అభివృద్ధి అనేది అంతా శూన్యం..! రూపాయి పని కూడా జరగలే..

ఐప్యాక్‌ మోహన్‌: ఎందుకని సార్‌...?

రాజన్న: ఎందుకంటే.. ఏమని చెప్పాలప్పా! జగనన్న ఫండ్స్‌ ఒక్క రూపాయి ఇవ్వలేదు. జగనన్న పార్టీలో ఉండామంటే అట్లే ఉన్నాం.. ఈదుకుంటూ సస్తున్నాం.. సొంత ఖర్చులు పెట్టుకొని.. అభివృద్ధి అనేది చెప్పకూడదు ఈ ఊర్లా!

ఐప్యాక్‌ మోహన్‌: గడప గడప కార్యక్రమాలు కంప్లీట్‌ చేశారా..?

రాజన్న: పార్టీలో ఉన్నాం కాబట్టి చేయకతప్పదు కదా..?

ఐప్యాక్‌ మోహన్‌: గడప గడప ఫండ్స్‌ వస్తాయి కదా.. వాటితో కూడా ఏమీ చేయలేదా?

రాజన్న: రూపాయి పని చేయలేదు.. గడప గడప అయిపోయి ఎన్నో దినాలైంది.. ఈపొద్దుకి ఒక రూపాయి పని లేదు.. జగన్‌ ఏమిస్తాడో ఏమో గాని మాకేమి తెలియదు. మా ఊరికైతే ఒక్క రూపాయి ఫండ్స్‌ రాలేదు. అన్ని ఊళ్లలో అయితే జగనన్న కాలనీలు అంటారు..? మా ఊర్లో జగనన్న కాలనీ లేదు.. జగనన్న శూన్యం తప్ప అభివృద్ధి ఏదీలేదు... మా పుడిచెర్లకు ఏదీ లేదు..?

ఐప్యాక్‌ మోహన్‌: మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని మీ కులంలో ఉంటుందా?

రాజన్న: మేం బోయోళ్లం కాబట్టి మేం తక్కువ అనేకాటికి ఉంది ఈ పార్టీలో.. నియోజకవర్గం (పాణ్యం) అంతా ఇదే కంప ఉంది. మొన్న బలమైన లీడర్లు టీడీపీలోకి పోయినారు. సుధాకర్‌రెడ్డి, కేవీ సుబ్బారెడ్డి (కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత, ఆయన కుటుంబం), కర్నూలులో కార్పొరేటర్లు పోయారు. వారం పది రోజులు ఇంకా దండిగా పోయోవాళ్లుండారు.

ఐప్యాక్‌ మోహన్‌: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఇండిపెండెంట్‌గా చేసిన వ్యక్తులమధ్య వర్గపోరా..?

రాజన్న: మేం మొదటి నుంచీ భూపాల్‌రెడ్డి వెంటే ఉన్నాం. వైసీపీలోనే రెండు మూడు వర్గాలున్నాయి. ఎమ్మెల్యేను కలసి రెండు మూడు వర్గాలు వద్దు రెడ్డీ.. రేపొద్దున ఇబ్బందులుంటాయి.. వీళ్లు చేస్తారని వాళ్లు.. వాళ్లు చేస్తారని వీళ్లు అని చెప్పాను. భూపాల్‌రెడ్డినే విలేకరులు అడిగితే ఇద్దరూ నా మనుషులే కాదా అని ఆయనే చెప్పాడు. ఏమో అర్థం కావడం లేదు. ఈ వైఎ్‌సఆర్‌ పార్టీ ఉంటుందా..? ఊడిపోతుందా..? అని.

ఐప్యాక్‌ మోహన్‌: వచ్చే ఎన్నికల్లో మెజార్టీ రాదంటారా..?

రాజన్న: ఒక్కరూపాయి పనికూడా చేయలేదయ్యా.. ఏ పనీ చేయలేదని నీవు ఎమ్మెల్యేను అడిగినా బాధలేదు.. మెజార్టీ వస్తుందో.. ఊడిపోతుందో అర్థం కాకుంది.. జగన్‌ మళ్లీ గెలిస్తే ఊర్లు వదిలి గట్టున ఉండమంటాడేమో..?రాష్ట్రం విడిచి వేరే రాష్ట్రానికి పొమ్మాంటాడేమో..? కొళాయి విరిగిపోయిందంటే కొత్తది వేయించేందుకు లేదు.. ఇదా అభివృద్ధి. శ్మశానంలో కాపురం చేయమన్నట్టుంది అయన అభివృద్ధి. మహానుభావుడు చల్లగా నూరేళ్లు బతకనీ.. ఇలాంటి నాయకుడు మనకు దొరకడు.. ఉంటా..!

Updated Date - Jan 17 , 2024 | 07:05 AM