Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

జగనా.. మజాకా?

ABN , Publish Date - Mar 04 , 2024 | 03:46 AM

ఐదేళ్ల అధికారం చివరి దశకు చేరుకున్న సమయంలో సీఎం జగన్‌ విశ్వరూపం చూపిస్తున్నారు.

జగనా.. మజాకా?

‘అన్‌రాక్‌’కు అన్‌స్టాపబుల్‌ మేళ్లు

జగన్‌ హయాంలో అయిన వారు ఏ రూపంలో వచ్చినా అందిన కాడికి మేళ్లు జరుగుతున్నాయి. గత బకాయిలు సైతం మాఫీ అయిపోతున్నాయి. రూ.కోట్లకు కోట్ల బకాయిలు ఉన్న కంపెనీ పేరుమార్చుకుని వచ్చినా.. దాని నుంచి బకాయి సొమ్మును రాబట్టాల్సిన ప్రభుత్వం వాటిని రాబట్టకపోగా మరిన్ని మాఫీలు చేస్తూ ‘మేలు’రాయి నిర్ణయాలతో దూసుకుపోతోంది.

ప్రభుత్వ ప్రయోజనాలకు పాతర

అస్మదీయ కంపెనీకి 2013 నాటి ధరలకే అప్పనంగా 479 ఎకరాలు

150.23 కోట్ల భూమి 13.57 కోట్లకే.. పేరు మార్చుకుని వచ్చిన అన్‌రాక్‌

‘పయనీర్‌ అల్యూమినియం’గా ఎంట్రీ.. రాయితీపై భూమి కోసం దరఖాస్తు

రూ.93.77 కోట్ల పాత బకాయిలపై వడ్డీ, ప్రాసెసింగ్‌ ఫీజులూ ఎత్తివేత

గొంతెమ్మ కోరికలు తీర్చేసిన జగన్‌.. ఇప్పటికే సంస్థ చేతిలో 2 వేల ఎకరాలు

వాటి సొమ్మే పూర్తిగా చెల్లించని వైనం.. అయినా దానికే కొత్త కేటాయింపు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఐదేళ్ల అధికారం చివరి దశకు చేరుకున్న సమయంలో సీఎం జగన్‌ విశ్వరూపం చూపిస్తున్నారు. ప్రభుత్వం సహా ప్రజా ప్రయోజనాలకు పాతరేసి తన సొంత మనుషులు, అస్మదీయుల గొంతెమ్మ కోరికలు తీరుస్తున్నారు. తన చేతికి మట్టి అంటకుండా వ్యవస్థలను రంగంలోకి దింపి ఖజానా ఏమైనా ఫర్వాలేదన్నట్టుగా సొంత మనుషుల జేబులు నింపుతున్నారు. భూములు, రాయితీలు, మినహాయింపులతో మేళ్లు చేస్తున్నారు. విశాఖ మన్యంలోని బాక్సయిట్‌ను తవ్వితీసేందుకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయంలో తీసుకొచ్చిన కంపెనీ.. అన్‌రాక్‌ అల్యూమినియం లిమిటెడ్‌. ప్రజాసంఘాలు, ఆదివాసీల ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేసి వేలకోట్ల విలువైన బాక్సయిట్‌ను తవ్వితీసేందుకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)తో ఒప్పందం చేయించి మరీ ఆ సంస్థను నిలబెట్టారు. 2013, మార్చి వరకు ఆ సంస్థ వ్యాపారం అప్రతిహతంగా సాగింది. అప్పటికే 2వేల ఎకరాల భూమిని కారుచౌకగా ఆ సంస్థకు కట్టబెట్టారు. ఆదివాసీ గిరిజనుల పోరాట ఫలితంగా నాటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం 2013, ఏప్రిల్‌లో ఒప్పందం రద్దుచేసింది. దీంతో ఆ కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

ఇటీవలే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. దాదాపు 10-11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అన్‌రాక్‌ కొత్త రూపంలోకి మారింది. ‘అన్‌రాక్‌ అల్యూమినియం లిమిటెడ్‌’ పేరును ‘పయనీర్‌ అల్యూమినియం ఇండ స్ట్రీ్‌స’గా మార్చుకుని కొత్తగా తెరమీదకు రాబోతుంది. 2009-2013 కాలంలో సర్కారు నుంచి కారుచౌకగా తీసుకున్న భూములను కొత్త కంపెనీ పేరిట మార్చడంతోపాటు, అదనంగా మరో 479 ఎకరాలు కేటాయించాలని ఆ సంస్థ జగన్‌ సర్కారును కోరింది. అంతేకాదు, గతంలో తీసుకున్న భూములకు చెల్లించాల్సిన పరిహారం బకాయిలు, వాటిపై విధించిన వడ్డీ, ఇతర ఫీజులను మాఫీచేయాలని, ఇంకా వీలైతే మరిన్ని మేళ్లు చేయాలని కోరింది. అంతే, ప్రభుత్వ.. ప్రజాప్రయోజనాలను ఫణంగా పెట్టి ఆ కంపెనీకి తనదైన శైలిలో జగన్‌ మేలు చేశారు. కొత్తగా 479 ఎకరాలు కట్టబెట్టారు. పాత బకాయుయిలపై ఉన్న వడ్డీలు, ఇతర ఫీజులను మాఫీ చేశారు. పయనీర్‌గా అవతారం మార్చుకున్న అన్‌రాక్‌కు ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే చకచకా మేలు చేసిపెట్టారు. తన మిత్రులకు జగన్‌ ఎంతైనా మేలుచేసుకోవచ్చు. కానీ, ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలకే తొలిప్రాధాన్యత ఇవ్వాలి.

కానీ, జగన్‌ తన మిత్రులకే ప్రాధాన్యం ఇచ్చారు. చాల పద్ధతిగా, ఎక్కడా తేడా కనబడకుండా, అసలు జగన్‌ ప్రమేయం అన్నదే కాగితాలపై కనబడకుండా చాకచక్యంగా మేళ్ల కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేశారు. విశాఖ మన్యంలోని మాకవారిపాలెం పరిసర గ్రామాల్లో దక్షణిసియాలోనే అతి విలువైన బాక్సయిట్‌ నిక్షేపాలున్నాయి. వాటిపై నాటి పాలకుల కన్నుబడింది. బాక్సయిట్‌ మైనింగ్‌ పేరిట రాయలసీమకే చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త, నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడి కంపెనీ అన్‌రాక్‌ అల్యూమినియం లిమిటెడ్‌ అనే కంపెనీ ముందుకొచ్చింది. దీంతో బాక్సయిట్‌ సరఫరా చేస్తామని ఖనిజాభివృద్ధి సంస్థ(ఎండీసీ)తో అన్‌రాక్‌ ఒప్పందం చేయించుకునేలా చక్రం తిప్పారు. అనంతరం, ఆ సంస్థకు మాకవారిపాలెం పరిధిలోని నాలుగైదు గ్రామాల్లో ఉన్న 1,925 ఎకరాల పట్టా, ప్రైవేటు భూములను ఏపీఐఐసీ ద్వారా కట్టబెట్టారు. ఎకరం రూ.2.83 లక్షల చొప్పున భూమి ధరను నిర్ణయించారు. అప్పట్లో సంస్థ నికరంగా 100 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ, 2013 దాకా చెల్లించింది రూ.72.91 కోట్లే. మరో రూ.27.41 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉండగానే, ఆదివాసీల పోరాట ఫలితంగా 2013, ఏప్రిల్‌లో అన్‌రాక్‌కు బాక్సయిట్‌ సరఫరా ఒప్పందం నుంచి ఎండీసీ తప్పుకొంది. అప్పుడు అన్‌రాక మరో రాష్ట్రం అంటే ఒడిశా నుంచి బాక్సయిట్‌ తవ్వి తీసుకొచ్చి అన్‌రాక్‌ పరిశ్రమలో ప్రాసెస్‌ చేసుకోవాలి. కానీ ఆ కంపెనీ ఆ పనిచేయలేదు. 10-11 ఏళ్ల తర్వాత అన్‌రాక్‌ కాస్తా పయనీర్‌ అల్యూమినియం ఇండస్ట్రీ్‌సగా పేరు మార్చుకుంది.

కొత్తరూపంలో..

మాకవారిపాలెం సెజ్‌లో తను పొందిన భూములు, ఇతన వనరులను పయనీర్‌ అల్యూమినియం ఇండస్ట్రీస్‌ పేరిట మార్చాలని, ఇంకా తనకు 479 ఎకరాల భూమిని అదనంగా కేటాయించాలని అన్‌రాక్‌ సంస్థ ఇటీవల ఏపీఐఐసీని కోరింది. ఈ ప్రతిపాదన సరే, 2009-13 కాలంలో ప్రభుత్వం కేటాయించిన భూములకు సంబంధించిన పాత బకాయులు రూ.27.41 కోట్లు, దానిపై వడ్డీ రూ.56.24 కోట్లు, జీఎస్టీ(18 శాతం) రూ.10.12 కోట్లు కలిపి మొత్తంగా రూ.93.77 కోట్లు సర్కారుకు చెల్లించాలని ఏపీఐఐసీ కోరింది. అయితే, 2013లో ఎండీసీ బాక్సయిట్‌ సరఫరా ఒప్పందం నుంచి తప్పుకున్నాక తమ పరిస్థితి దయనీయంగా మారిందని, పనిలేకుండా ఖాళీగా ఉన్నామని ఆ సంస్థ చెప్పుకొచ్చింది. కాబట్టి, పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తమ బకాయుయిల చెల్లింపుపై విధించిన వడ్డీ, ప్రాసెసింగ్‌, సర్వీసింగ్‌ ఫీజులను పూర్తిగా మాఫీ చేయాలని కోరింది. అలాగే, తాము కోరుతున్న 479 ఎకరాల భూమిని 2009-2013 నాటి ధరలకే కేటాయించాలని విన్నవించింది.

అన్‌రాక్‌ కోరింది.. జగన్‌ చేసేశారు

2009-13 కాలంలో మాకవారిపాలెం సెజ్‌ పరిధిలో అన్‌రాక్‌కు ఎకరా భూమిని రూ.2.83 లక్షల చొప్పున కేటాయించారు. ఇప్పుడు తమకు కావాల్సిన 479 ఎకరాలను కూడా అదే ధరకు ఇవ్వాలని ఆ సంస్థ కోరింది. నిజానికి ఇప్పుడక్కడ భూమి ధర(రిజిస్ట్రేషన్‌ ధర) రూ.31.36 లక్షలని ఏపీఐఐసీనే తేల్చింది. కొత్త ధర ప్రకారం 479 ఎకరాలకు గాను అన్‌రాక్‌ రూ.150.23 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలి. పాత ధర అయితే రూ.13.57 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. అందుకే, తనపై భారం పడకుండా 2013 నాటి ధరకే భూములు కట్టబెట్టాలని ఆ కంపెనీ కోరింది. ఎలాగూ దాని గొంతెమ్మ కోరికలను తీర్చాలని జగన్‌ ముందుగానే నిర్ణయించారు కాబట్టి, ఆ ప్రతిపాదనలకు వ్యూహాత్మకంగా పరిశీలనలు చేయించారు. ఈ ఏడాది జనవరి 29న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ(ఎ్‌సఐపీబీ)తో ఆమోదింపజేశారు. మరుసటి రోజే బోర్డులో చర్చకు పెట్టి చకచకా ఆమోదింపజేశారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టం రూ.136.66 కోట్లు. ఇదిగాక, ఆ సంస్థకు ఇచ్చిన మినహాయింపులు సైతం సర్కారు కోల్పోయింది. దీని విలువ రూ.66.36 కోట్లు. అంటే, అన్‌రాక్‌కు జగన్‌ చేసిన మేలు కారణంగా సర్కారు ఖజానాకు నికరంగా రూ.203.02 కోట్ల మేర చిల్లుపడింది. ఇది చట్టబద్ధంగా, హక్కుగా ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము. అన్‌రాక్‌ యజమాని అస్మదీయుడైనందునే సర్కారుకు నష్టం వచ్చినా, ఒకవైపు చిన్న చిన్న అవసరాలకే అప్పులు చేయాల్సి వచ్చినా ప్రభుత్వం పాత ధరలకే కట్టబెట్టడం పట్ల ఏపీఐఐసీ అధికారులే విస్మయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

Updated Date - Mar 04 , 2024 | 03:46 AM