Share News

జగన్‌.. మాట తప్పావ్‌

ABN , Publish Date - May 03 , 2024 | 03:34 AM

టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై ఈ ఐదు ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన ఆయనకు ఓటడిగే హక్కు ఎక్కడిదని నిలదీశారు.

జగన్‌.. మాట  తప్పావ్‌

ఓటడిగే హక్కు నీకెక్కడిది: చంద్రబాబు

మద్య నిషేధం చేశాకే అడుగుతానన్నావ్‌.. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తానన్నావ్‌

జాబ్‌ కేలెండర్‌, డీఎస్సీ ఏవీ?.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వ పనుల్లో 50ు ఎక్కడ?

మేనిఫెస్టోలో 99ు హామీలు నెరవేర్చలేదు.. వైసీపీ పాలనకు సున్నా మార్కులే

మాది ప్రజా మేనిఫెస్టో.. మొదటి నెల నుంచే రూ.4 వేల పెన్షన్‌

ఉచిత ఇసుక విధానం తెస్తాం.. మళ్లీ జగనొస్తే ఆంధ్రా నార్త్‌కొరియా అవుతుంది

అవినాశ్‌రెడ్డి పిల్లోడైతే బడికి పంపాలి.. పార్లమెంటుకు కాదు

రాయచోటి, కడప సభల్లో టీడీపీ అధినేత ఫైర్‌

ఓటు అడిగే హక్కు నీకెక్కడిది

రాయచోటి, కడప సభల్లో చంద్రబాబు ఫైర్‌

  • మద్యపానం నిషేధిస్తానని చెప్పావా లేదా.? తర్వాతే ఓటడుగుతానని అన్నావా లేదా..?

  • వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తాను.. పీఆర్‌సీ ఇస్తానన్నావు.. మధ్యంతర భృతి ఇస్తానన్నావ్‌.. పీఆర్‌సీ రద్దు చేశావా?

  • జాబ్‌ కేలెండర్‌ ఇస్తానన్నావు.. డీఎస్సీ వేస్తా అన్నావు.. ఇచ్చావా? ఉద్యోగాలు వచ్చాయా?

  • ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇళ్లు కట్టిస్తా అన్నావు.. కట్టించావా?

  • ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వ పనుల్లో 50 శాతం ఇస్తానన్నావు.. కల్పించావా? ఇవేమీ చేయకుండా.. మాట తప్పిన నీవు ఏ విధంగా ఓటు అడుగుతావ్‌?

టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై ఈ ఐదు ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన ఆయనకు ఓటడిగే హక్కు ఎక్కడిదని నిలదీశారు. ప్రజాగళంలో భాగంగా గురువారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో, కడప జిల్లా కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు.

2019 ఎన్నికల సమయంలో జగన్‌ మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 99శాతం అమలు చేయలేదన్నారు. ఆయన పాలనకు జనం సున్నా మార్కులే వేస్తున్నారన్నారు.

టీడీపీ హయాంలో రూ.60 ఉన్న మద్యం ఇప్పుడు రూ.200 అయిందని.. పెరిగిన రూ.140 తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తోందన్నారు. తాము దమ్మున్న ప్రజా మేనిఫెస్టో తెచ్చామని.. దాని ముందు జగన్‌ మేనిఫెస్టో వెలవెలబోయిందని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..

ఎవరు చంపారో తెలియదంట..

జగన్‌ బాబాయిని ఎవరు చంపారో ప్రపంచం మొత్తానికీ తెలుసు.. కానీ, సీఎంకు మాత్రం తెలియదంట..! నిందితుడు అవినాశ్‌రెడ్డిని పక్కనే పెట్టుకుని.. అమాయకుడు, చిన్నపిల్లోడని అంటు న్నారు.

ఇప్పటికైనా హూ కిల్డ్‌ బాబాయ్‌ అని అర్థమైం దా మీకు. అర్థమైంటే చేతులు పైకెత్తండి (అనగానే ప్రజలు చేతులు పైకెత్తారు). మళ్లీ కడపలో మీరు ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే. కిరణ్‌కుమార్‌రెడ్డి, నేను ముఖ్యమంత్రులుగా పనిచేశాం.

మీ పట్టాదార్‌ పాస్‌పుస్తకాలపైన మా ఫొటోలు వేసుకున్నామా..? మీ భూములకు జగన్‌ ఎటువంటి వారసుడూ కాదు.. మీకా భూమి ఆయన తాత, నాన్న ఇవ్వలేదు.

అలాంటప్పుడు జగన్‌ ఫొటో ఎందుకు? మీ భూముల పై కన్ను వేసిన జగన్‌ కొత్త చట్టం తెస్తున్నాడు.. మేం రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తాం. మొదటి నెల నుంచే రూ.4వేలు పెన్షన్‌ ఇస్తాం.

దివ్యాంగులకు రూ.6 వేలు, రెండు చేతులు, రెండు కాళ్లు లేని వారికి రూ.10 వేలు అందిస్తాం. బీసీలకు 50 ఏళ్లకే సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తాం. చంద్రన్నబీమా మళ్లీ తెస్తాం.


కిమ్‌లాంటి దుర్మార్గుడు..

మళ్లీ జగన్‌ వస్తే హైదరాబాద్‌ సౌత్‌ కొరియా అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ నార్త్‌కొరియా అయిపోతుంది ఇలాంటి వాళ్లు ఉంటే. అక్కడ కిమ్‌ అని ఒకాయన ఉన్నాడు.. అక్కడ ఎవరూ ఆనందంగా ఉండడానికి వీల్లేదు. ఏడవడానికీ వీల్లేదు.. అలాంటి దుర్మార్గుడు జగన్‌.

నా జీవితంలో ఇంత అరాచకం చేసేవాడిని చూడలేదు. నేను ఉన్నప్పుడు ఉచిత ఇసుక వచ్చిందా లేదా?

ట్రాక్టర్‌ ఆ రోజు రూ.1,000. ఇవాళ రూ.5,000. జూన్‌ 4వ తేదీ నుంచి మళ్లీ ఉచిత ఇసుక విధానం తీసుకొస్తున్నా. దేవుని కడపలో నిలబడి ఈ సీఎంకు సవాల్‌ విసురుతున్నా. రాయలసీమ స్టీల్‌ ఫ్యాక్టరీకి రెండుసార్లు ఫౌండేషన్‌ వేశావు ఇంకెప్పుడు తెస్తావు. గులకరాయి డ్రామా అందరికీ గుర్తుంది. గులక రాయి కనపడదు, దెబ్బమాత్రం కనపడుతుంది.

కోడికత్తితో ఎయిర్‌పోర్టుకు వెళ్లానంట, ఇపుడు గులకరాయితో హత్యాప్రయత్నం చేశానంట. మరోపక్క గొడ్డలితో నరికి నారాసుర రక్తచరిత్ర అనిరాసిన మీకు.. నీతి నిజాయితీ పద్ధతి ఉందా? మేం అఽధికారంలోకి వస్తే.. ముస్లిం మైనారిటీల రక్షణ బాధ్యత నేను తీసుకుంటాను. నవరత్నాలు అంటున్నాడు..

ఆ నవరత్నాలు ఏంటో తెలుసా? ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూమాఫియా, మైనింగ్‌ మాఫియా, హత్యా రాజకీయాలు, ప్రజల ఆస్తుల కబ్జా.. అదే రేపు వస్తోంది.. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌.. మీ భూమిమీద కన్నేశాడు..

మళ్లీ గెలిస్తే మీ భూమి మీది కాదు.. ఆశ వదులుకోండి. ఏడో రత్నం ప్రభుత్వ టెర్రరిజం సెటిల్‌మెంట్స్‌, ఎనిమిదో రత్నం దాడులు, కేసులు. తొమ్మిదో రత్నం శవరాజకీయాలు, డ్రామాలు, గులకరాయి నాటకాలు. ఇలాంటి వ్యక్తి మీకు కావాలా?

కరెంటు తీసేసినా..

చంద్రబాబు గురువారం సాయంత్రం కడప విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గాన కడప నగరానికి వస్తుండగా అలంఖాన్‌ పల్లె వరకు 3 కిలోమీటర్ల మేర విద్యుద్దీపాలు ఆర్పివేశారు. కాగా.. నగరంలో చంద్రబాబు భారీ రోడ్‌షో నిర్వహించారు. రాత్రి 9.30 గంటలకు సభ ముగించుకుని హైదరాబాద్‌ బయల్దేరారు.

కడప/రాయచోటి, ఆంధ్రజ్యోతి.

గత ఐదేళ్లలో ప్రజల జీవితంలో ఎటువంటి మార్పులు రాలేదు. ఆదాయంలో పెరుగుదల లేదు. జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. ఈ కోతల ప్రభుత్వం ఇంకా ఎందుకు అవసరమో ప్రజలు గుర్తించాలి.

తమిళనాడు, తెలంగాణల్లో దొరికే మద్యం బ్రాండ్లు మన రాష్ట్రంలో ఎందుకు దొరకడం లేదు? జే బ్రాండు నాసిరకం మద్యం మాత్రమే దొరుకుతోంఇ. మేమొచ్చాక విషపూరిత బ్రాండ్లను రద్దు చేస్తాం.

- చంద్రబాబు

Updated Date - May 03 , 2024 | 05:15 AM