Share News

17న విదేశాలకు జగన్‌!

ABN , Publish Date - May 09 , 2024 | 03:57 AM

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ 13వ తేదీన ముగియనున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన ప్రణాళిక బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.

17న విదేశాలకు జగన్‌!

1 దాకా లండన్‌, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌లో సీఎం దంపతుల పర్యటన

సీబీఐ కోర్టు అనుమతి కోరిన సీఎం.. ఈ నెల 6న పిటిషన్‌ దాఖలు

కౌంటర్‌ వేయాలని దర్యాప్తు సంస్థకు న్యాయస్థానం ఆదేశం

బుధవారం రోజంతా విశ్రాంతి తీసుకున్న జగన్‌!

హైదరాబాద్‌/అమరావతి, మే 8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ 13వ తేదీన ముగియనున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన ప్రణాళిక బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అక్రమాస్తుల కేసులకు సంబంధించిన బెయిల్‌ షరతుల్లో సీబీఐ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న నిషేధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17 నుంచి జూన్‌ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జగన్‌ ఈ నెల 6న జగన్‌ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఆ కోర్టు ప్రధాన న్యాయాధికారి టి.రఘురాం విచారణ చేపట్టారు. జగన్‌ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. కుటుంబ పర్యటన నిమిత్తం ఇంగ్లండ్‌ (లండన్‌), స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని.. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతులు సడలించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు.

నిరుడు గ్రీన్‌సిగ్నల్‌

గత ఏడాది సెప్టెంబరు 2న జగన్‌ దంపతుల లండన్‌ పర్యటనకు సీబీఐ అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు కూడా దర్యాప్తు సంస్థ నుంచి అడ్డంకులూ ఉండే అవకాశం లేదని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో లండన్‌ పర్యటనకు జగన్‌ వెళ్లినప్పుడే .. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టు తాను విదేశాల్లో ఉన్నప్పుడు జరిగిందంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారాన్ని రేపాయి. ముఖ్యమంంత్రికి సమాచారం ఇవ్వకుండా ప్రతిపక్ష నేతను సీఐడీ అరెస్టు చేయగలదా అనే విమర్శలు వచ్చాయి. 13వ తేదీ తర్వాత ఇంకో మూడు దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్‌ జరుగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెలువడతాయి. అంటే మన రాష్ట్ర ప్రజలు మూడు వారాలు ఎదురుచూడాల్సిన తరుణంలో జగన్‌ దంపతులు మళ్లీ లండన్‌కు వెళ్తుండడంతో.. అంతా ప్రశాంతంగా ఉంటుందా లేదంటే అనూహ్య పరిణామాలేమైనా చోటు చేసుకుంటాయా అని చర్చ నడుస్తోంది. కాగా, రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరిన సమయంలో సీఎం జగన్‌ బుధవారం పూర్తిగా విశ్రాం తి తీసుకోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసిం ది. బుధవారమంతా ఆయన తాడేపల్లి ప్యాలెస్‌ వదిలి బయటకు రాలేదు. దీని మర్మమేంటో వైసీపీ, నేతలు, శ్రేణులకు అంతుపట్టలేదు.

ఎల్లుండి కడపకు రాహుల్‌..!

అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): ఈ నెల 11న కడపకు ఏఐసీసీ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ రానున్నారు. కడప లోక్‌సభ అభ్యర్థి వైఎస్‌ షర్మిలను గెలిపించాలని ఆయన కోరనున్నారు. వాస్తవానికి 7న రాహుల్‌ కడపకు వస్తారని పార్టీ నేతలు ఆశించారు. అయితే షెడ్యూల్‌లో మార్పు కారణంగా 11వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకూ కడప సభలో రాహుల్‌ పాల్గొననున్నారు.

Updated Date - May 09 , 2024 | 03:57 AM