Share News

న్యాయానికి జగన్‌ సంకెళ్లు..!

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:12 AM

వెబ్‌ల్యాండ్‌ ఆర్‌ఓఆర్‌లో రాత్రికి రాత్రే ఓ రెవెన్యూ అధికారి తన లాగిన్‌ ద్వారా ఓ పేద రైతు సాగు భూ మిని మరో రైతు పేరిట మార్చేస్తాడు. అదేమంటే ఆర్డీ వో దగ్గర అప్పీల్‌ చేసుకోమంటాడు.

న్యాయానికి జగన్‌ సంకెళ్లు..!

సివిల్‌ కోర్టుల ప్రమేయాన్ని నిషేధించిన టైటిల్‌ చట్టం

కొత్త చట్టంలో రైతులకు న్యాయం పొందే హక్కు నిరాకరణ.. భూ సమస్య వస్తే ఇక అధికారుల దయపైనే ఆధారం

అధికారి నిర్ణయం నచ్చకపోతే ల్యాండ్‌ అప్పీలేట్‌కు.. అప్పీళ్ల కోసం ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సిందే

చివరి పరిష్కారంగానే హైకోర్టుకు వెళ్లే అవకాశం.. టైటిల్‌ అధికారులకు సూపర్‌ పవర్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వెబ్‌ల్యాండ్‌ ఆర్‌ఓఆర్‌లో రాత్రికి రాత్రే ఓ రెవెన్యూ అధికారి తన లాగిన్‌ ద్వారా ఓ పేద రైతు సాగు భూ మిని మరో రైతు పేరిట మార్చేస్తాడు. అదేమంటే ఆర్డీ వో దగ్గర అప్పీల్‌ చేసుకోమంటాడు. ఆ అధికారి అక్రమంగా రికార్డులు మార్చేశాడని ఆధారం ఉంటే బాధిత రైతు సివిల్‌ కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేయవచ్చు. తన భూమిని వెనక్కి తెచ్చుకోవడంతోపాటు తప్పుచేసిన అధికారిపై చట్టపరమైన చర్యలు కోరవచ్చు. సివిల్‌ కోర్టులు ఆ కేసును విచారించి న్యాయం చేస్తాయి. ఇదీ ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకం చట్టం-1971 (ఆర్‌ఓఆర్‌-రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) రైతుకు కల్పిస్తోన్న చట్టబద్దమైన హక్కు. కానీ, సీఎం జగన్‌ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య హక్కు (ల్యాండ్‌ టైటిల్‌) చట్టం-2022 ఈ హక్కును నిరాకరిస్తోంది. చట్టం అమలుకు ముందు, తర్వాత భూమిపై వివాదం వస్తే తక్షణ న్యాయం కోరుతూ సివిల్‌ కోర్టుకెళ్లడానికి లేదు. అలాగని సివిల్‌ కోర్టులు జోక్యం చేసుకోవాడానికి కూడా వీల్లేదు. ఈ మేరకు టైటిల్‌ చట్టంలోని చాప్టర్‌-6లోని 38వ క్లాజు కింద సివిల్‌ కోర్టుల ప్రమేయాన్ని నిషేధించారు. అంటే రైతులు న్యాయంపొందే హక్కును నిలువరించినట్టే..! న్యాయం కోరుతూ రైతు సివిల్‌ కోర్టు మెట్లు ఎక్కకుండా ప్రభుత్వం అడ్డుగోడ కట్టిందని స్పష్టమవుతోంది. గత అక్టోబరు 17న ఈచట్టాన్ని గజిట్‌ పబ్లికేషన్‌ చేసింది. అక్టోబరు 31నుంచే అమల్లోకి వచ్చినట్టుగా నవంబరు 1న జగన్‌ సర్కారు జీవో 512ను జారీచేసింది. అయితే ఈ ఉత్తర్వును రహస్యంగా ఉంచింది.

అంతా జగనేచ్ఛ...

సర్కారు చర్యను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నవంబరు నుంచే ఆందోళనలు మొదలయ్యాయి. టైటిల్‌ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని రాజకీయ పార్టీలూ డిమాండ్‌ చేస్తున్నాయి. న్యాయవాదులు, బార్‌ అసోసియేషన్‌లు చేస్తోన్న ఆందోళనలకు ప్రజామద్దతు పెరిగింది. టైటిల్‌ చట్టంపై హైకోర్టులో కేసు దాఖలు కాగా తాము ఆ చట్టాన్ని అమలు చేయడం లేదని సర్కారు అబద్దాలు చెప్పింది. అయితే, అదే అంశంపై అఫిడవిట్‌ వేయాలని కోరింది. ఒక వైపు హైకోర్టును తప్పుదోవపట్టించేలా, టైటిల్‌ చట్టం అమలులో కీలకమైన ల్యాండ్‌ అథారిటీని ఏర్పాటు చేస్తూ గత డిసెంబరు 29న సర్కారు జీవో 630ని జారీచేసింది. ఆ ఉత్తర్వును కూడా సీక్రెట్‌గానే ఉంచింది. టైటిల్‌ చట్టం అమల్లోకి రాలేదని రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు, చట్టాన్ని అమలు చేయడం లేదని ప్రభుత్వం పదేపదే ప్రకటనలిస్తూ రహస్యంగా చట్టం అమలులో కీలకమైన అథారిటీని ఏర్పాటు చేస్తూ జీవో ఇవ్వడం జగన్‌కే చెల్లింది. అంటే.. దేశంలోనే తొలిసారిగా అంటూ తాను తీసుకొచ్చిన చట్టాన్ని సకల వర్గాలు వ్యతిరేకించడం జగన్‌కు ఇష్టంలేదు. తాను ఏ చట్టం తీసుకొచ్చినా కోర్టులతోపాటు అంతా ఆమోదించాలని ఆయన కోరుకుంటారు. అలాంటిది ఆ చట్టం అమలుపై ప్రజలు మూకుమ్మడి పోరాటాలు చేయడం ఆయనకు నచ్చలేదు. అందుకే సీక్రెట్‌గా టైటిల్‌ చట్టం అమలుకు ల్యాండ్‌ అథారిటీని ఏర్పాటు చేసేశారు. చట్టం అమలుకు ఇంకా రూల్స్‌ ఇవ్వలేదు కాబట్టి అది అమల్లో లేదనే వితండవాదాన్ని ప్రభుత్వం వినిపిస్తోంది. ఇది కూడా తప్పే. చట్టం 2023, అక్టోబరు 31 నుంచే అమల్లోకి వచ్చినట్టుగా ఇచ్చిన జీవో 512 ఇంకా అమల్లోనే ఉంది. దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదు. వీటిన్నింటినీ పరిశీలిస్తే సర్కారు బయటకు చెప్పేది ఒకటి, చేసేది మాత్రం తను అనుకున్నదే అని స్పష్టమైంది. టైటిల్‌ చట్టం గత అక్టోబరులో వచ్చింది. కానీ అంతకుముందే, 2022 నుంచే శాశ్వత భూ హక్కు పేరిట పాసుపుస్తకాలు ఇచ్చారు. ఆర్‌ఓఆర్‌ చట్టం-1971 అమల్లో ఉండగా, టైటిల్‌ చట్టం పేరిట భూ హక్కు పత్రాలు ఎలా ఇస్తారు..? జగన్‌ కంటే లాజిక్‌ తెలియకపోవచ్చు. సీనియర్‌ ఐఏఎ్‌సలకు ఈ మాత్రం తెలియదా..? పైగా టైటిల్‌ చట్టం కింద ఇస్తున్న పాస్‌ పుస్తకాలపై జగన్‌ బొమ్మలు నింపేశారు. ఇది కూడా ఇప్పుడున్న ఆర్‌ఓఆర్‌ చట్టానికి విరుద్దమే. అంటే అధికారులు తెలిసితెలిసీ జగన్‌ మెప్పుకోసం, ఆయన సేవలో తరించేందుకు ఈ పనులు చేస్తున్నట్టు కనిపిస్తోంది.


టైటిల్‌ చట్టంలో అధికారులే సుప్రీమ్‌

అధికారులు తప్పుచేస్తే రైతులు న్యాయపోరాటం చేసే అవకాశం ఆర్‌ఓఆర్‌ చట్టం కల్పిస్తోంది. కానీ టైటిల్‌ చట్టం ఆ అవకాశాన్ని అడ్డుకుంది. రైతుకు శాశ్వత హక్కు ఇచ్చే అధికారం టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిదే. ఒకవేళ ఎవరైనా ఆ భూమి తనదేనని ముందుకొస్తే భూమిని వివాద రిజిస్టర్‌లో ఉంచుతారు. రైతు ఆ భూమి తనదే అని నిరూపించుకోవాలి. లేదంటే చేజారిపోతుంది. ఆ భూమిపై టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి నిర్ణయమే ఫైనల్‌. సివిల్‌ కోర్టు న్యాయమూర్తికి ఉండే అధికారాలను ఆ పోస్టుకు చట్టబద్దంగా కట్టబెట్టారు. ఆ అధికారి తీసుకునే నిర్ణయం రైతుకు నచ్చకపోతే ల్యాండ్‌ అప్పీలేట్‌ అధికారి వద్ద అప్పీల్‌ చేసుకోవాలి. అక్కడా న్యాయం దొరక్కపోతే రాష్ట్రస్థాయి అప్పీలేట్‌ వద్ద అప్పీల్‌ చేసుకోవాలి. అక్కడ కూడా న్యాయం లభించకపోతే ఇక ల్యాండ్‌ అథారిటీని ఆశ్రయించాలి. అంతే, తప్ప సివిల్‌ కోర్టులకు వెళ్లడానికి ఈ చట్టం అనుమతించదు. రైతుకు ల్యాండ్‌ అథారిటీ కూడా న్యాయం చేయకపోతే చివరి ప్రయత్నంగా హైకోర్టును ఆశ్రయించాలి. ఒక సాధారణ పేద రైతు భూమి కోసం ఏళ్ల తరబడి టైటిల్‌ అధికారుల చుట్టూ ఈ చట్టం తిప్పుతుంది. అక్కడా న్యాయం దొరక్కపోతే హైకోర్టుకే వెళ్లమంటోంది. ఓ పేదరైతు హైకోర్టుకు వెళ్లడం అయ్యేపనేనా..? అంటే.. పేద రైతులకు సాధ్యం కాని క్లాజులు, నిబంధనలు చేర్చడం ద్వారా సర్కారు టైటిల్‌ అధికారులను సూపర్‌ పవర్‌ చేయాలనుకుంటోంది.

ప్రభుత్వ పెద్దల మనుషులే అధికారులు

ఆర్‌ఓఆర్‌ చట్టం అమలులో భాగంగా తహసీల్దార్‌, ఆర్‌డీవో, డీఆర్‌వోలు ఉన్నారు. ఆర్‌డీవో, డీఆర్‌వోలుగా డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తారు. ఈ పోస్టింగ్‌లు ప్రభుత్వ పెద్దల దయాదాక్షి ణ్యాలపై ఆధారపడి ఉన్నాయి. సొంత మనుషులు అనుకున్న వారినే కీలక ప్రాంతాలకు ఆర్డీవోలుగా నియమిస్తున్నారు. ఇక నమ్మకస్తులనుకున్న వారిని కీలకమైన మండలాలకు తహసీల్దార్లుగా పంపిస్తున్నారు. పోస్టింగ్‌లు తీసుకున్న తర్వాత ఎవరెవరు ఏం చేస్తున్నారో ప్రజలకు సుపరిచితమే. చివరకు పెట్రోల్‌ బంకు ఏర్పాటుకు ఎన్‌వోసీలు ఇవ్వడానికి కూడా లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న ఆర్డీవో, తహసీల్లార్లు ఉన్నారు. తిరుపతి ఉదంతమే ఇందుకు నిదర్శనం. ప్రకాశం జిల్లాలోనూ ఓ తహసీల్దార్‌ రాత్రికి రాత్రే భూమి రికార్డులు మార్చేసిన ఉదంతంలో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. అలాగని, అందరూ అక్రమాలకు పాల్పడటం లేదు. కీలకమైన డివిజన్లు, మండలాల్లో అడ్డగోలు పద్ధతుల్లో పోస్టింగ్‌లు తెచ్చుకున్నవారే రైతులను రాచిరంపాన పెడుతున్నారు. ఇక టైటిల్‌ చట్టం వస్తే ప్రభుత్వ పెద్దల జోక్యం మరింత పెరిగిపోతుంది. డిప్యూటీ కలెక్టర్‌, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను టెటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులుగా నియమిస్తారు. కీలకమైన ఈ పోస్టుల్లో తమ సొంత మనుషులే ఉండాలని నేతలు, ప్రభుత్వ పెద్దలు ఆరాటపడుతుంటారు. వారి ఆశీస్సులతో పోస్టులు పొందేవారు రైతులకు ఏం మేలు చేస్తారు..? పైగా, వారికి సివిల్‌ కోర్టు అధికారాలు ఇచ్చి మరింత సూపర్‌ పవర్‌గా చేయాలని చట్టం చెబుతోంది.


‘ల్యాండ్‌ టైటిల్‌’ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు

ఈ చట్టాన్ని మేం అమలు చేయడం లేదు: మంత్రి ధర్మాన

శ్రీకాకుళం అర్బన్‌, ఏప్రిల్‌ 29: భూయాజమాన్య హక్కు (ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌) రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని, కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్ణయమని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నీతి ఆయోగ్‌ సూచనల మేరకు అన్ని రాష్ట్రాలూ ఈ చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందన్నారు. అయితే దీనిపై వైసీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ ఈ చట్టంపై ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడు దాని అమలుపై వైసీపీ ఆలోచిస్తుందని తెలిపారు. ఇప్పుడు ఈ చట్టాన్ని వైసీపీ అమలు చేయదని, దీనిపై చర్చకు తాను సిద్ధమని అన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 04:13 AM