Share News

Jagan : అగ్రిగోల్డ్‌ ఆస్తులకు జగన్‌ ఎసరు!

ABN , Publish Date - May 30 , 2024 | 02:43 AM

ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పులు చేసిన సీఎం జగన్‌... ప్రైవేటు ఆస్తులనూ వదిలిపెట్టలేదు.

Jagan : అగ్రిగోల్డ్‌ ఆస్తులకు జగన్‌ ఎసరు!

తాకట్టు పెట్టి రూ.12 వేల కోట్ల అప్పులకు ఎత్తు

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులనూ తనఖాకు తరలించిన జగన్‌.. ప్రైవేటు ఆస్తులపైనా గురిపెట్టి ప్రజలను ముంచేయాలని చూశారు. అగ్రిగోల్డ్‌ మోసాల వల్ల ఉమ్మడి ఏపీలో దాదాపు 11 వేల మంది డిపాజిటర్లు మునిగిపోయారు. పిల్లల ఉన్నత చదువులు, అమ్మాయి పెళ్లి, పదవీ విరమణ అనంతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు డిపాజిట్లు కట్టారు. వారందరినీ అగ్రిగోల్డ్‌ సంస్థ ముంచేసింది. డిపాజిటర్లకు న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్‌.. ఆ తర్వాత వారికే శఠగోపం పెట్టాలని చూశారు. వారికి ఉన్న చట్ట రక్షణలను తొలగించాలని కుట్ర చేశారు. అమ్మి డిపాజిటర్లకు చెల్లింపులు చేయాల్సిన అగ్రిగోల్డ్‌ ఆస్తులను తాకట్టు పెట్టాలని చూశారు. దీనికోసం ఆర్డినెన్స్‌ను కూడా సిద్ధం చేశారు. అయితే, అప్పటి గవర్నర్‌ జోక్యంతో జగన్‌ ఎత్తు చిత్తయింది.

అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లను ఆదుకుంటానని అధికారంలోకి

చివరికి వారికే శఠగోపం పెట్టేందుకు భారీ కుట్ర

డిపాజిటర్లకు చట్టరక్షణను తొలగిస్తూ ఆర్డినెన్స్‌

అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ రూ.4,500 కోట్లు

వాటిని అమ్మి డిపాజిటర్లకు కడతామన్న జగన్‌

కానీ, తాకట్టు పెట్టేందుకు పకడ్బందీ వ్యూహం

దీనికోసం రూపొందించిన ఆర్డినెన్స్‌ గవర్నర్‌కు

జగన్‌ సర్కారు ఆలోచనకు అప్పటి గవర్నర్‌ బ్రేక్‌

వరుసగా రెండుసార్లు ఆ ప్రతిపాదన వెనక్కి...

(అమరావతి - ఆంధ్రజ్యోతి : ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పులు చేసిన సీఎం జగన్‌... ప్రైవేటు ఆస్తులనూ వదిలిపెట్టలేదు. వివాదాల్లో ఉన్న ప్రైవేటు సంస్థల ఆస్తులను తాకట్టు పెట్టి భారీ మొత్తంలో అప్పులు తీసుకురావడానికి భారీ స్కెచ్‌ వేశారు. ఇందులోభాగంగా చట్టానికి సవరణ తీసుకురావడం ద్వారా అగ్రిగోల్డ్‌కు చెందిన ఆస్తులను ప్రభుత్వమే తనఖాపెట్టి దాదాపు రూ.12 వేల కోట్ల రుణాలు తీసుకుందామని చూశారు. అయితే, జగన్‌ అప్పుల మాస్టర్‌ ప్లాన్‌కు అప్పటి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ చెక్‌ పెట్టారు. లేదంటే ఈపాటికి ఎవరి ఆస్తులు ఎవరి తాకట్టులోకి వెళ్లిపోయావో వెతుకోవాల్సిన పరిస్థితి. ఆ వివరాల్లోకి వెళితే.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కన్నా కూడా ముందే ప్రైవేటు సంస్థల ఆస్తులు తనఖా పెట్టేందుకు ఒక చట్టాన్ని చేయాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు ఆస్తులు తనఖా పెట్టి వాటి ద్వారా వేల కోట్లు అప్పులు తెచ్చేద్దామని ఆర్డినెన్స్‌ తీసుకురావాలనుకుంది. నిజానికి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ తాకట్టులోకి వెళ్లిపోయాయి. నదుల్లో ఇసుకను, మద్యాన్ని, భవిష్యత్తులో ప్రభుత్వానికి రాబోయే ఆదాయాన్ని... ఇలా ఏది కనిపిస్తే దాన్ని తాకట్టులోకి తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే వివాదాల్లో ఉన్న అగ్రిగోల్డ్‌ ఆస్తులపైనా జగన్‌ కన్నేశారు.

ప్రైవేటు ఆస్తులపై కన్నేసి...

డిపాజిటర్లకు డబ్బు చెల్లించకుండా బిచాణా ఎత్తేసిన అగ్రిగోల్డ్‌ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. 2019 ఎన్నికలకు ముందు అగ్రిగోల్డ్‌ బాధితులందరికీ న్యాయం చేస్తానని జగన్‌ ఆర్భాటం చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు తాను అధికారంలోకి వస్తే రూ.1100 కోట్లు కేటాయిస్తానని మాటిచ్చారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట దేవుడెరుగు.. అగ్రిగోల్డ్‌ ఆస్తులపైనే గురిపెట్టారు. అగ్రిగోల్డ్‌ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.4500 కోట్లు విలువైన స్థిర, చరాస్థులున్నాయి. వీటిని గత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అగ్రిగోల్డ్‌ కేసును సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సమస్య కోర్టు పరిధిలో ఉంది. డిపాజిటర్లు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జగన్‌ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. పైగా ఇచ్చిన మాట పక్కన పెట్టి అగ్రిగోల్డ్‌ ఆస్తులను తనఖా పెట్టేద్దామని భారీ స్కేచ్‌ వేశారు. ఇందుకోసం ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ యాక్ట్‌- 1999కు సవరణ తెచ్చేందుకు సిద్ధమయ్యారు. డిపాజిటర్లకు రక్షణగా కోసం తెచ్చిన ఈ చట్టానికి తూట్లు పొడవాలని ప్రయత్నించారు. తద్వారా అగ్రిగోల్డ్‌ ఆస్తులు మొత్తం తనఖా పెట్టేద్దామన్నదే జగన్‌ భారీ ప్లాన్‌. డిపాజిటర్లు ఎలా పోయినా ఫర్వాలేదన్న ఆలోచనతో ముందుకు వెళ్లారు. ప్రస్తుతం ఉన్న చట్టం.. ఆగ్రిగోల్డ్‌ ఆస్తులు తనఖా పెట్టేందుకు అనుమతించదు. దీనికోసం ఈ చట్టాన్ని సవరిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్‌కు సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది. దానిని అత్యంగ గోప్యంగా గవర్నర్‌కు పంపించారు. కానీ ఇక్కడే సీన్‌ రివర్స్‌ అయింది.


గవర్నర్‌ తిరస్కరణ...

రాజ్‌భవన్‌కు చేరిన ఆర్డినెన్స్‌ ముసాయిదాను అప్పటి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ క్షుణ్ణంగా పరిశీలించారు. సీఎస్‌, న్యాయ శాఖ అధికారులను రాజ్‌భవన్‌కు పిలుపించుకుని చర్చించారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా పరిశీలించారు. సీఎంవో అధికారులతో రాజ్‌భవన్‌ అధికారులు అనేకసార్లు చర్చించిన తర్వాత ఈ చట్టం అత్యంత ప్రమాదకరమని తేల్చేశారు. భవిష్యత్తులో డిపాజిటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గవర్నర్‌ భావించారు. ప్రభుత్వం పంపించిన ఆర్డినెన్స్‌ ముసాయిదాను తిరస్కరించారు.

ఆర్థిక శాఖతో కమిటీయా?

ఆర్డినెన్స్‌ ముసాయిదాను తిరస్కరిస్తూ గవర్నర్‌ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇస్తూ, ప్రభుత్వం అందులో మరికొన్ని మార్పులు చేసింది. దానిని రెండోసారి గవర్నర్‌కు పంపించింది. డిపాజిటర్లకు ఎలా న్యాయం చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు మరో ఇద్దరు సీనియర్‌ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రత్యేక మార్గదర్శకాలు సిద్ధం చేస్తామని పేర్కొంది. ఈ కేసులో సీఐడీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని గవర్నర్‌కు తెలిసింది. సీఐడీ స్థానంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అయితే, ప్రభుత్వం ఎంత వివరణ ఇచ్చినప్పటికీ గవర్నర్‌ ఆర్డినెన్స్‌ ముసాయిదాను ఆమోదించేందుకు ఆంగీకరించలేదు. అదే సమయంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ అనగానే గవర్నర్‌కు అనుమానం వచ్చింది. ఆస్తులు తనఖా పెట్టాలన్నా, అమ్మకం చేయాలన్నా ఆర్థికశాఖ పరిధిలోనే జరగాలి. ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆర్థిక శాఖతో కమిటీ అంటున్నదన్న విషయాన్ని గవర్నర్‌ గ్రహించారు. దీంతో ఆయన ఆర్డినెన్స్‌ ముసాయిదాను రెండోసారి కూడా తిరస్కరించారు.

న్యాయం జరగలేదు

గత ఐదేళ్లల్లో కేవలం రూ.5వేలు, రూ.10 వేలు కట్టిన డిపాజిటర్లకు మాత్రమే జగన్‌ ప్రభుత్వం చెల్లింపులు చేసింది. రూ10 వేలు పైన కట్టిన డిపాజిటర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. మొత్తం అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించాల్సింది ఆరువేల కోట్లు కాగా, ప్రభుత్వం రూ.900కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇప్పటికీ రూ.5100 కోట్లు వరకూ డిపాజిటర్లకు చెల్లించాల్సి ఉంది.

ఏమిటీ చట్టం?

ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ చట్టం ప్రకారం..ఏదైనా ఫైనాన్స్‌, చిట్‌ సంస్థ డిపాజిటర్లను మోసం చేస్తే, దాని ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఆ ఆస్తులకు ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుంది. ప్రభుత్వానికి అవసరమైతే ఆస్తుల విలువ ఆధారంగా నిధులు సమకూర్చడం, లేదంటే ప్రభుత్వమే వాటిని విక్రయానికి పెట్టి దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మోసపోయిన డిపాజిటర్లకు సెటిల్‌ చేయడం చేయాల్సి ఉంటుంది. డిపాజిటర్ల కోసం పగడ్బందీగా తయారైన చట్టం ఇది.

Updated Date - May 30 , 2024 | 02:43 AM