‘బటన్’పై జగన్ ‘బటన్’పై జగన్ వింత బాణి
ABN , Publish Date - May 12 , 2024 | 04:10 AM
బటన్’ నొక్కుడుపై సీఎం జగన్ బాణి మార్చేశారు. ఆన్‌గోయింగ్ పథకాల నిధులను కుట్రపూరితం గా నిలిపివేయించారని ప్రచార సభల్లో చంద్రబాబుపై ఆక్రోశిస్తున్న జగన్..

పథకాల నిధులు ఎన్నికల తర్వాత ఇచ్చినా ఫర్వాలేదట!
60 నెలలు పాలించకుండా 3 నెలల ముందే నొక్కేశారు
ఢిల్లీ సాయంతో తనపై బాబు కుట్ర చేస్తున్నారని విసుర్లు
పవన్ నలుగురు భార్యలను మార్చారంటూ అవాకులు
చివరి రోజు పేట, కైకలూరు, పిఠాపురంలో సభలు
కాకినాడ, ఏలూరు/కైకలూరు, మే 11(ఆంధ్రజ్యోతి) చిలకలూరిపేట: ‘బటన్’ నొక్కుడుపై సీఎం జగన్ బాణి మార్చేశారు. ఆన్‌గోయింగ్ పథకాల నిధులను కుట్రపూరితం గా నిలిపివేయించారని ప్రచార సభల్లో చంద్రబాబుపై ఆక్రోశిస్తున్న జగన్.. పిఠాపురంలో దానికి విరుద్ధంగా మాట్లాడారు. తాను నొక్కిన బటన్‌లకు డబ్బులు ఎన్నికలు అయ్యాక ఇచ్చినా ఫర్వాలేదన్నారు. 60 నెలల పాలనావ్యవధి ఉన్నా, 57 నెలలకే తన గొంతు నొక్కేస్తున్నారని దొంగ ఏడ్పు ఏడ్చారు. తనకు ఉన్న ‘బటన్’ నొక్కుడు అధికారాన్ని ఢిల్లీ పెద్దల సహకారంతో చంద్రబాబు మూడు నెల ల ముందే కుట్రపూరితంగా నొక్కివేశారన్నారు. ఎన్నికల ప్రచారం చివరిరోజు అయిన శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట, ఏలూరు జిల్లా కైకలూరు, కాకినాడ జిల్లా పిఠాపురం సభల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. పిఠాపురంలో మాట్లాడుతూ.. సీఎం అయ్యాక రాష్ట్రంలో 2.30లక్షల ఉద్యోగాలు ఇచ్చానని, అందులో 1.35లక్షలు గ్రామ సచివాలయాల ఉద్యోగులున్నారని చెప్పిన జగన్.. మెగా డీఎస్సీని ఎగ్గొట్టిన విషయం మాత్రం చెప్పలేదు. ఢిల్లీ నుంచి ఒత్తిడి తెచ్చి ఇంటికి వలంటీర్లు వచ్చి ఇచ్చే పెన్షన్లు ఆపివేయించారన్న జగన్.. వలంటీర్లు లేకపోయినా ఇంటి వద్దే పంపిణీ చేయడానికి సరిపడా ప్రభుత్వ సిబ్బంది ఉన్నా వినియోగించని వైనాన్ని చెప్పలేదు. పవన్ కల్యాణ్ నలుగురు భార్యలను మార్చారంటూ విసుర్లు విసిరారు. చంద్రబాబు 2014లో పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రస్తావిస్తూ...‘ఇవన్నీ మీకు దక్కాయా’ అన్నప్పుడు జనం నుంచి స్పందన రాలేదు. కాగా, అసలే మండుటెండ. పైగా కైకలూరు సభకు సీఎం గంట ఆలస్యంగా రావడంతో అప్పటికే గంటల తరబడి వేసి ఉన్న జనం మెల్లగా సర్దుకోవడం కనిపించింది.
డిప్యూటీ సీఎంకు బదులు డిప్యూటీ సీఐ
పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగాగీత తనకు తల్లి, అక్కలాంటిది అని జగన్ పేర్కొన్నారు. వంగా గీతను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గెలిపిస్తే డిప్యూటీ సీఐ పదవి ఇస్తానని ప్రకటించారు. దీంతో డిప్యూటీ సీఐ పదవి ఎక్కడ సృష్టించారంటూ అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. డిప్యూటీ సీఎం పదవికి బదులు డిప్యూటీ సీఐ అని జగన్ పలికారని పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఈలోపే జగన్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.