Share News

‘సిద్ధం’ కాలేదు!

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:05 AM

అంతన్నారు.. ఇంతన్నారు.. 400 ఎకరాల్లో సభ అన్నారు.. ఆరు జిల్లాల పరిధిలో 15 లక్షల మంది జనం వస్తారన్నారు.. మేనిఫెస్టో ప్రకటిస్తామనీ

‘సిద్ధం’ కాలేదు!

జగన్‌ మేదరమెట్ల సభ 3 నుంచి 10కి వాయిదా

జనసమీకరణపై నాయకుల నుంచి దక్కని భరోసా

నేతల మధ్య సమన్వయ లోపంతో బెంబేలు

ఎంపీల రాజీనామాలు.. టీడీపీలోకి భారీగా వలసలు

బాపట్ల, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): అంతన్నారు.. ఇంతన్నారు.. 400 ఎకరాల్లో సభ అన్నారు.. ఆరు జిల్లాల పరిధిలో 15 లక్షల మంది జనం వస్తారన్నారు.. మేనిఫెస్టో ప్రకటిస్తామనీ అన్నారు.. చివరకు తుస్సుమనిపించారు.. సీఎం జగన్‌ నిర్వహిస్తున్న చివరి ‘సిద్ధం’ సభ బాపట్ల జిల్లా అద్దంకి పరిధిలోని మేదరమెట్ల వద్ద మార్చి 3న జరుగుతుందని వైసీపీ అట్టహాసంగా ప్రకటించింది. అయితే ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులు పార్టీకి అనుకూలంగా లేవనే తత్వం బోధపడిందో.. నేతల మధ్య సమన్వయం లోపంతో జన సమీకరణ సాధ్యం కాదనే అనుమానం కలిగిందో.. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ముందు పెట్టే సభ ఫ్లాప్‌ అయితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భయపడ్డారో.. సరైన కారణాలేవీ చెప్పకుండానే ’సిద్ధం’ సభను మార్చి 3 నుంచి 10కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని వైసీపీ పెద్దలు బుధవారం మేదరమెట్లలోని సభాస్థలి వద్దే ప్రకటించారు. మరోవైపు ఆయా జిల్లాల్లో వైసీపీ కీలక నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. బుధవారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పగా.. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అంతకుముందే వైసీపీతో తెగదెంపులు చేసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సైతం ఇటీవలే పార్టీని వీడారు. ఈ ముగ్గురు ఎంపీలు సిద్ధం సభ జరగాల్సిన జిల్లాల పరిధిలోని వైసీపీ కీలక నేతలే కావడం గమనార్హం. మరోవైపు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాక వైసీపీ నుంచి వలసలు జోరందుకున్నాయి. ముఖ్యంగా గుంటూరుతో పాటు సిద్ధం సభకు వేదికగా నిలవనున్న బాపట్ల జిల్లాలో చేరికలు పోటెత్తడం కూడా అధికార పార్టీని కలవరపాటుకు గురిచేశాయి. మేదరమెట్ల ప్రాంతం అద్దంకి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు పతాక స్థాయిలో ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు అద్దంకి వైసీపీ ఇన్‌చార్జిగా పనిచేసిన చైతన్య ఇటీవలే చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవడం కూడా కారణంగా కనబడుతోంది.

ii.jpg

రాప్తాడు సభతో భయాందోళన...

రాప్తాడు సిద్ధం సభలో పాలకపార్టీ శ్రేణులు చేసిన అరాచకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆ పార్టీ ఉన్మాద చర్యలను చర్చకు నిలిపింది. ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌పై వైసీపీ మూకలు దాడితో పాటు బస్సుల కోసం సామాన్య జనం ఇక్కట్లు కూడా వైసీపీ గ్రాఫ్‌ను మరింత దిగజార్చాయి. వైసీపీ దుర్మార్గాలను జనం ఏవగించుకుంటున్నారనే రిపోర్టు పార్టీ పెద్దలకు చేరడంతోనే మేదరమెట్ల సిద్ధం సభను వాయిదా వేశారనే చర్చ నడుస్తోంది.

Updated Date - Feb 29 , 2024 | 08:18 AM