Share News

జగన్‌ బీసీల ద్రోహి

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:58 AM

సామాజిక న్యాయాన్ని జపిస్తున్న జగన్‌ రాష్ట్రంలోని బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆరోపించారు.

జగన్‌ బీసీల ద్రోహి

27 సంక్షేమ పథకాలు రద్దుచేశారు: లోకేశ్‌

బీసీలకు తీవ్ర అన్యాయం చేశారు

సొంత సామాజికవర్గానికి పెద్దపీట

బీసీ, ఎస్సీ ఎమ్మెల్యేలకే బదిలీలు

‘స్థానిక’ కోటా 10ు తగ్గించారు

మేం రాగానే మళ్లీ పెంచుతాం

రద్దయిన స్కీంలు మళ్లీ అమలు: లోకేశ్‌

3 రాజధానుల పేరుతో దోపిడీ

వైవీ, సాయిరెడ్డి, బొత్సపై ఫైర్‌

మేసిందంతా కక్కిస్తామని వార్నింగ్‌

మన్యం, విజయనగరం జిల్లాల్లో

3 చోట్ల శంఖారావ సభలు

విజయనగరం/పార్వతీపురం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయాన్ని జపిస్తున్న జగన్‌ రాష్ట్రంలోని బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆరోపించారు. బుధవారం రాత్రి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగిలో, ఉదయం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం వెంకంపేట వద్ద, సాయంత్రం సాలూరులో జరిగిన శంఖారావం బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. బీసీ, ఎస్సీ ఎంపీ, ఎమ్మెల్యేలను వేరే సీట్లకు బదిలీ చేయడమేనా సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. ‘సొంత సామాజికవర్గ ప్రతినిధుల జోలికి పోకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీలపై పడ్డారు. యాదవ కులానికి చెందిన జంగా కృష్ణమూర్తి, కొలుసు పార్థసారథి, కర్నూలు ఎంపీ సంజీవ్‌ సహా అనేక మందిని వేరే ప్రాంతాలకు పంపారు. గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన 27సంక్షేమ పథకాలను అకారణంగా రద్దు చేశారు. స్థానికసంస్థల రిజర్వేషన్లలో 10 శాతం తగ్గించారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు స్థానిక కోటా పెంచుతాం. రద్దయిన సంక్షేమ పథకాలు అమలు చేస్తాం’ అని వెల్లడించారు. మూడు రాజధానుల పేరుతో వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ ఉత్తరాంరఽధను దోచుకుంటున్నారని.. పందికొక్కుల్లా మేసిన మేతను కక్కిస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయకుండా కాపాడతామన్నారు. భోగాపురం, తారకరామతీర్థసాగర్‌, నదుల అనుసంధానం,అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని.. వీటిని పూర్తిచేసే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. బీసీలపై 27వేల కేసులు పెట్టి వారి వెన్నుముక విరగ్గొట్టారని.. బీసీలు కలిసికట్టుగా పోరాడి జగన్‌ వెన్నుముక విరగ్గొట్టాలని పిలుపిచ్చారు. ఇంకా ఏమన్నారంటే..

ప్రత్యేక హోదా మరిచారు

అధికారంలోకి వచ్చే వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చి తీరుతామని జగన్‌ హామీ ఇచ్చారు. గద్దెనెక్కగానే 22 ఎంపీలు, 9 రాజ్యసభ సభ్యులు ఉన్నా ప్రత్యేక హోదా మరిచారు. కేంద్రం వద్ద రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. టీడీపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వం రాగానే రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. డీఎస్సీని ప్రతి ఏటా ప్రకటిస్తాం. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు భృతి కల్పిస్తాం. ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున చెల్లిస్తాం. రైతులకు ప్రతి ఏటా రూ.20 వేల పెట్టుబడి అందిస్తాం. మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. 18 నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలకు నెలకు రూ.1,500 అందిస్తాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. సూపర్‌ సిక్స్‌ద్వారా పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తాం.

చీమ కుట్టినట్లయినా లేదు..

సీఎం జగన్‌కు డయేరియా వచ్చింది. రోగ నిర్ధారణ కోసం తాడేపల్లి ప్యాలెస్‌ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిద్దాం. గుంటూరులో సురక్షిత నీరు ప్రజలకు అందించక పోవడంతో డయేరియా వచ్చి ఇద్దరు మరణించారు. ప్రజలు మృతి చెందుతున్నా దున్నపోతు ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. జగన్‌కు సినిమా పిచ్చి ఎక్కువైంది. ఒక వైపు వ్యూహం, మరో వైపు యాత్ర సినిమా అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు ఉచితంగా టికెట్లు ఇస్తున్నారు. అయినా సినిమా చూడడానికి ఎవరూ వెళ్లడం లేదు. అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. వైసీపీకి అంతిమ యాత్రే. నిర్మాత.. జగన్‌రెడ్డి వద్దకు వెళ్లి ఆదుకోమని కోరితే పొమ్మన్నారు. డబ్బులు ఇవ్వకపోతే అంతిమ యాత్ర సినిమా తీస్తానని ప్రొడ్యూసర్‌ చెప్పడంతో అతడికి హార్సిలీహిల్స్‌ వద్ద ఖరీదైన రెండెకరాల ప్రభుత్వ భూమిని అప్పగించారు. ప్రభుత్వ భూమి ఇచ్చేందుకు జగన్‌ ఎవరు? తాడేపల్లిలోనో, ఇడుపులపాయలోనో, బెంగుళూరు ప్యాలె్‌సలోనో రెండెకరాలు ఇవ్వొచ్చు కదా!

కోడికత్తి వారియర్స్‌

జగన్‌ను చూస్తే పిట్టల దొర గుర్తుకు వస్తున్నాడు. కేంద్రం తెచ్చిన ఖేలో ఇండియాను ఆడుదాం ఆంధ్రా అని మార్చారు. అది విఫలమైంది. నియోజకవర్గానికో స్టేడియం నిర్మిస్తామని చెప్పిన జగన్‌ ఎక్కడైనా నిర్మించాడా? ఆయన ఐపీఎల్‌ టీంను పెడతామని చెబుతున్నాడు. దాని పేరు కోడికత్తి వారియర్స్‌. ఆ టీంలో బాబాయిని గొడ్డలితో చంపిన ఆల్‌రౌండర్‌ అవినాశ్‌రెడ్డి, బెట్టింగ్‌ స్టార్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌, అరగంట స్టార్‌ అంబటి రాంబాబు, గంట స్టార్‌ అవంతి శ్రీనివాస్‌, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ గోరంట్ల మాధవ్‌, రీల్‌ స్టార్‌ మార్గాని భరత్‌, బూతుల స్టార్‌ కొడాలి నాని, కమెడియన్‌ బియ్యపు మధుసూదనరెడ్డి ఆటగాళ్లు. నాకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదని చెప్పే జగన్‌.. ఇప్పుడు కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.

ప్రత్యేక హోదా ఎక్కడ..?

25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్‌.. ఎందుకు తీసుకురాలేదు? వైసీపీకి మొత్తం 31 మంది ఎంపీలు ఉంటే ఏనాడైనా ప్రత్యేక హోదా అడిగారా? కేంద్రంలో ఏపీ పరువు తీశారు. ఒక ఎంపీ బాబాయిని లేపేసిన వ్యక్తి అయితే.. ఇంకో ఎంపీ టిక్‌టాక్‌, యూట్యూబ్‌ రీల్స్‌లో బిజీగా ఉంటారు. తన భార్యాబిడ్డలను కిడ్నాప్‌ చేశారన్న భయంతో మరో ఎంపీ పూర్తిగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి జగన్‌ అవినీతి కేసుల్లో ఏ-2 గా ఉన్నారు. జగన్‌ అవినీతిని పుస్తకంలో రాస్తున్నాడు.

3 కుటుంబాలకు అవినీతి లైసెన్స్‌

రాష్ట్రంలో మూడు కుటుంబాలకు జగన్‌ అవినీతి లైసెన్స్‌ ఇచ్చాడు. బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి చెరువులు, భూములు కబ్జా చేస్తున్నారు. గిరిజనుల సంక్షేమం, ఉద్యోగావకాశాల కోసం టీడీపీ హయాంలో ఇచ్చిన జీవో నంబర్‌ 3ను వైసీపీకి వచ్చాక రద్దు చేసింది. మేమొచ్చాక దానిని పునరుద్ధరిస్తాం. గిరిజనులకు ఆగిపోయిన 17 సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం. ఎస్టీ నియోజకవర్గాల్లో ఏడుకు ఏడు స్థానాలను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం.

బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్‌ కాదు. బ్యాక్‌ బోన్‌. జగన్‌ బీసీల వెన్నెముక విరుస్తున్నారు. ఆయన్ను గద్దె దించేందుకు రాష్ట్రంలో బీసీలందరూ సిద్ధమవ్వాలి.

యాత్ర-2 సినిమా తీసిన నిర్మాతకు నష్టం వచ్చిందని, రెండెకరాల హర్సిలీహిల్స్‌ భూమిని సదరు నిర్మాతకు అందివ్వడం దారుణం.

- లోకేశ్‌

Updated Date - Feb 15 , 2024 | 03:58 AM