Share News

అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక సీఎం జగనే!

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:13 AM

గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్‌ చరిత్రలో మిగిలిపోతారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక సీఎం జగనే!

మూర్ఖంగా ప్రవర్తించి చరిత్ర హీనుడయ్యారు

ఫ్యాక్షనిస్టు, విజనరీ తేడాను ప్రజలు గమనించాలి

మంగళగిరి ఎన్నికల ప్రచారంలో లోకేశ్‌

మంగళగిరి, ఏప్రిల్‌ 7: గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్‌ చరిత్రలో మిగిలిపోతారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొలనుకొండ ఆర్‌ఆర్‌ రచన అపార్ట్‌మెంట్‌ వాసులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చంద్రబాబు నాటిన మొక్కను తర్వాత ప్రభుత్వాలు కొనసాగించినందువల్లే హైదరాబాద్‌ ఈరోజు విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. ఏపీలో మాత్రం గత టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులను జగన్‌ మూర్ఖంగా నిలిపేసి చరిత్ర హీనుడయ్యారు. అనాలోచితంగా పీపీఏలను కూడా రద్దుచేశారు. ఫ్యాక్స్‌ కాన్‌, అమర్‌ రాజా, జాకీ వంటి పరిశ్రమలను పొరుగు రాష్ర్టాలకు తరిమేశారు. కులముద్రవేసి వేధించడంతో దేశంలోనే పేరెన్నికగన్న వ్యాక్సిన్‌ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ ఒడిసా వెళ్లి రూ.1,200 కోట్లతో యూనిట్‌ ఏర్పాటు చేసుకుంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి ట్రాన్స్‌ పోర్టు, క్యాంటీన్‌ కాంట్రాక్ట్‌ కోసం టీసీఎల్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ను నిర్బంధించారు. ఇలాంటి ప్రభుత్వం...ఈ తరహా ప్రజాప్రతినిధులు ఉన్నచోట పరిశ్రమలు ఎలా వస్తాయి? జగన్‌ చేతగానితనం, అహంకారం వల్లే పరిశ్రమలన్నీ ఇతర రాష్ర్టాలకు క్యూ కడుతున్నాయి. స్వతహాగా జగన్‌ ఒక ఫ్యాక్షనిస్టు. బాబాయిని ఎలా చంపారో వివేకం సినిమాలో కళ్లకు కట్టినట్టే చూపించారు. ప్రజలు అభివృద్ధి చెందకుండా తాము విసిరే చిల్లర కోసం ఎదురుచూస్తూ ఉండాలన్నదే ఫ్యాక్షనిస్టు జగన్‌ నైజం’ అని లోకేశ్‌ దుమ్మెత్తిపోశారు.

బాబు విజన్‌ వల్లే లక్షలాది ఉద్యోగాలు..

‘జగన్‌ విధ్వంసక పాలనలో యువతకు ఉద్యోగాలు లేవు. చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎత్తేశారు. విదేశీవిద్య పథకాన్ని నాశనం చేశారు’ అని లోకేశ్‌ ఆవేదన చెందారు. చంద్రబాబు విజన్‌తో నిర్మించిన సైబరాబాద్‌ వల్ల నేడక్కడ పదిలక్షలమంది యువతకు ఉపాధి లభిస్తోందన్నారు. ఫ్యాక్షనిస్టుకు, విజనరీకి ఉన్న ఈ తేడాను రాష్ట్రప్రజలంతా గమనించాలని కోరారు. ‘గత ప్రభుత్వంలో 72 శాతం పూర్తిచేసిన పోలవరాన్ని రివర్స్‌ పాలనతో సర్వనాశనం చేశారు. అతి చౌకగా లభించే రెన్యువబుల్‌ ఎనర్జీ పీపీఏలను జగన్‌ రద్దుచేసి, యూనిట్‌ రూ.10కి బహిరంగమార్కెట్‌లో కొనుగోలు చేసిన కారణంగానే విద్యుత్‌ చార్జీల భారం ప్రజలపై పడుతోంది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్‌ చార్జీలు పెంచబోం. ఏడాదిలోగా రాజధానికి అనుసంధానంగా ఉన్న రోడ్లనిర్మాణాలను పూర్తిచేస్తాం’ అని లోకేశ్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీతో టీచర్‌ పోస్టులను భర్తీచేస్తామని, అయిదేళ్లలో పెండింగ్‌ పోస్టులన్నీ భర్తీచేసి యువత కలలను సాకారం చేస్తామన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 04:13 AM