Share News

జగన్‌వి శవ రాజకీయాలు

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:03 AM

ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ శవ రాజకీయాలు చేయడం సీఎం జగన్‌కు అలవాటుగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు.

జగన్‌వి శవ రాజకీయాలు

ఇక ఆయనను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు

కృష్ణాయపాలెం ఎన్నికల ప్రచారంలో లోకేశ్‌

మంగళగిరి, ఏప్రిల్‌ 26: ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ శవ రాజకీయాలు చేయడం సీఎం జగన్‌కు అలవాటుగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామం కృష్ణాయపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ 2014లో తండ్రి శవం, 2019లో బాబాయి శవంతో జగన్‌ రాజకీయం చేశాడని ఆరోపించారు. ఈసారి పెన్షన్లను ఇవ్వకుండా 32మంది వృద్ధుల ఉసురు పోసుకుని మళ్లీ శవ రాజకీయాలు మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. జగన్‌ ఏం చేసినా ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు. ఈ ఎన్నికల్లో జగన్‌ పని అయిపోతుందని.. ఆయన శాశ్వతంగా తాడేపల్లి ప్యాలె్‌సకు పరిమితం కావాల్సిందేనని అన్నారు. భవిష్యత్తులో కూడా జగన్‌ అధికారంలోకి రాడనే నమ్మకం కలిగితేనే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు. ఐదేళ్లపాటు జగన్‌ చేసిన విధ్వంసంతో ఏపీ బ్రాండ్‌ పూర్తిగా దెబ్బతినడమే ఇందుకు కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన ఆరంభిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో వాహనాలకు దేశం మొత్తంమీద అతితక్కువ పన్నులు ఉండేలా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను దశల వారీగా భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలను రప్పించడం ద్వారా ప్రైవేట్‌ రంగంలో 20లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. తాము వచ్చాక టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని హమీ ఇచ్చారు.

తల్లి, భార్యను కూడా టీడీపీ అంటాడేమో!

‘‘జగన్‌ సొంత చెల్లి పసుపు చీర కట్టుకుంటే తెలుగుదేశం అంటున్నారు. పసుపు రంగు చీర కట్టుకున్న వాళ్లంతా టీడీపీ అయిపోతారా? ఆయన తల్లి, భార్య కూడా పసుపు చీర కట్టుకుంటే రేపు వారిని కూడా టీడీపీ అంటారేమో’’ అని లోకేశ్‌ వ్యంగ్యాస్ర్తాలను సంధించారు. మంగళగిరి నియోజకవర్గం పెదపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన రచ్చబండ సభలో ఆయన మాట్లాడారు. సొంత తల్లిని, చెల్లిని మెడపట్టి గెంటేసిన వాడు మహిళలకు ఏం న్యాయం చేస్తాడో ప్రజలంతా ఆలోచించాలని కోరారు.

Updated Date - Apr 27 , 2024 | 04:03 AM