Share News

AP News: ఎన్నికల్లో వలంటీర్లను వాడుకునేందుకు జగన్ అడ్డదారులు.. రేషన్ వాహనాల పక్కన నిలబడినందుకు.

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:17 AM

‘రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.55 లక్షలమంది గ్రామ, వార్డు వలంటీర్లే నాకున్న బలమైన సైన్యం. మిమ్మల్ని హీరోలను చేసే బాధ్యత నాది.

AP News: ఎన్నికల్లో వలంటీర్లను వాడుకునేందుకు జగన్ అడ్డదారులు.. రేషన్ వాహనాల పక్కన నిలబడినందుకు.

రేషన్‌ వాహనాల పక్కన

నిలబడినందుకు నెలకు 500 నజరానా

ఎన్నికల్లో వారిని వాడుకునేందుకు అడ్డదారులు

పీకల్లోతు అప్పుల్లో పౌరసరఫరాల కార్పొరేషన్‌

దానిపై ఇప్పుడు 12 కోట్లకుపైగా భారం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.55 లక్షలమంది గ్రామ, వార్డు వలంటీర్లే నాకున్న బలమైన సైన్యం. మిమ్మల్ని హీరోలను చేసే బాధ్యత నాది. ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా పనిచేయండి’ అంటూ బహిరంగంగానే పిలుపునిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌.. ఆ వలంటీర్లకు మరో బిస్కెట్‌ విసిరారు. రేషన్‌ సరుకులను ఇంటింటికీ అందిస్తున్న ఎండీయూ(మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్లు) వాహనాల వెంట ఉంటున్నందుకు అదనపు ప్రోత్సాహకంగా ప్రతి వలంటీర్‌కు నెలకు రూ.500 చొప్పున అదనంగా చెల్లించాలంటూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు ఒకేసారి రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ నిధుల నుంచి ఆ నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆ కార్పొరేషన్‌పై మరో రూ.12 కోట్లకు పైగా ఆర్థిక భారం పడనుంది.

ప్రభుత్వ సేవలను ఇంటింటికీ చేరవేసేందుకంటూ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకుగాను నెలకు రూ.5 వేలు గౌరవ వేతనాన్ని వారికి ఇస్తున్నారు. దీనికి ఖజానా నుంచి రూ.392 కోట్లు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. ఇప్పుడు ఎన్నికల ముందు వలంటీర్లు అందిస్తున్న ప్రతి సేవకు ఒక రేటు కట్టి.. వారికి ప్రజాధనాన్ని అధికారికంగానే పంచుతున్నారు. జగన్‌ పత్రికను వలంటీర్లతో కొనుగోలు చేయిస్తూ ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతినెలా అదనంగా రూ.200 వలంటీర్లకు చెల్లిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎండీయూ వాహనాల వెంట ఉంటున్నందుకు రూ.500 వలంటీర్లకు అందించాలని ఆదేశించింది. వాస్తవంగా ఎండీయూ వ్యవస్థను ప్రారంభించినప్పటి నుంచే వాటి ద్వారా రేషన్‌ సరుకులను ఇంటింటికీ సక్రమంగా అందించేలా చూసే బాధ్యతను ప్రభుత్వం వలంటీర్లకే అప్పగించింది. వలంటీర్ల మీద నిజంగా అంత ప్రేమే ఉంటే.. మొదటి నుంచే రూ.500 ప్రోత్సాహకం ఇవ్వాలి కదా! ఈ నాలుగేళ్లుగా లేనిది.. ఇప్పుడే ఎందుకు ఇస్తున్నట్టు? ఇక్కడే ఉంది ట్విస్ట్‌. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం వలంటీర్లతో కూడా పనిచేయించుకోవడానికి పాలకులు ఇలాంటి అడ్డమైన దారులు తొక్కుతున్నారు. ప్రజాధనాన్ని అధికారికంగానే వలంటీర్లకు పంచిపెడుతూ వారికి ఆయాచిత లబ్ధి చేకూరుస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఎన్నికల్లో వారంతా వైసీపీ కోసం పనిచేసేలా పథక రచన చేశారన్నమాట. వాస్తవానికి వలంటీర్లకు వచ్చే మూడు నెలల కాలానికి అదనంగా రూ.750 చొప్పున అందిస్తామని జగన్‌ గత డిసెంబరులోనే హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ అదనపు మొత్తాన్ని రూ. 500లకు కుదించారు.

గుదిబండలా మారిన ఎండీయూ వ్యవస్థ: రాష్ట్రంలోని 1.49 కోట్ల రేషన్‌కార్డుదారులకు రేషన్‌ సరకులను డోర్‌ డెలివరీ చేసేందుకు్ట్ర ప్రభుత్వం కొత్తగా 9,260 ఎండీయూ వ్యాన్లను ఆర్భాటంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామంటూ 60 శాతం సబ్సిడీపై ఎండీయూ వాహనాలను లబ్ధిదారులకు అందించింది. సబ్సిడీ కింద మొత్తం రూ. 539 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించింది. ఎండీయూ వాహనాల నిర్వాహకులకు నెలకు రూ.21 వేలు జీతాలు కూడా ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రతినెలా రూ.21 కోట్ల ప్రజాధానాన్ని ఖర్చు పెడుతోంది. గతంలో ముగ్గురు డీలర్లకు చెల్లించే కమీషన్‌ మొత్తాన్ని ఇప్పుడు ఒక ఎండీయూకే చెల్లిస్తున్నారన్నమాట.

ఇంటింటికీ వెళ్లని వలంటీర్లు

ఎండీయూలను ప్రారంభించిన మొదట్లో వలంటీర్లు కూడా ఇంటింటికీ వెళ్లినప్పటికీ.. ఆ తర్వాత మానేశారు. పింఛన్ల పంపిణీ, ఇతర ప్రభుత్వ సేవలలో వలంటీర్లు బిజీ అయిపోయారు. దాంతో ఎండీయూ ఆపరేటర్లు ఇంటింటికీ వెళ్లకుండా.. వీధి చివరన వాహనాన్ని నిలిపి.. సైరన్‌ మోగిస్తున్నారు. చుట్టుపక్కల రేషన్‌ కార్డుదారులంతా వాహనం వద్దకు వచ్చి గంటల తరబడి వరుసలో నిల్చుని సరకులు తీసుకోవాల్సివస్తోంది. వాహనం వచ్చిన సమయంలోనే కార్డుదారులు సరకులు తీసుకోవాలి. లేకపోతే ఇక ఆ నెలకు సరకులు దక్కనట్టే. ఎన్నికల నేపథ్యంలో తాజాగా వలంటీర్లకు అదనంగా రూ.500 చొప్పున చెల్లించాలంటూ ఉత్తర్వులు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పార్టీ తరఫునా వలంటీర్లకు తాయిలాలు..

వచ్చే ఎన్నికల్లో వలంటీర్ల సేవలను వినియోగించుకునేందుకు ఒకవైపున ప్రభుత్వమే అధికారికంగా ప్రజాధానాన్ని పంచుతుంటే.. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటి నుంచే గ్రామ, వార్డు వలంటీర్లకు భారీఎత్తున తాయిలాలు పంచుతున్నారు. తొలివిడతగా రూ.5 వేల నగదుతోపాటు దుస్తులు, కుక్కర్లు, హాట్‌బాక్సులు పంచుతూ వలంటీర్లను మచ్చిక చేసుకుంటున్నారు. దీంతో వలంటీర్లు రాజకీయకార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదంటూ విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఇదే అంశంపై పలువురు కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 07:09 AM