Share News

IAS లకూ జగన్‌ టోపీ

ABN , Publish Date - Feb 26 , 2024 | 03:27 AM

జగన్‌ అధికారంలోకి వచ్చిన 6 నెలల వరకు ఉద్యోగులు ప్రశాంతంగానే ఉన్నారు. కానీ, ఆ తర్వాత నుంచి తమకిచ్చిన హామీలు, హక్కుల కోసం నేటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు.

IAS లకూ జగన్‌ టోపీ

రెండేళ్లుగా ఎన్‌పీఎస్‌ కంట్రిబ్యూషన్‌ ఎగవేత

సాధారణ ఉద్యోగులకే కాదు.. అఖిల భారత సర్వీసు ఉద్యోగులైన ఐఏఎస్‌లకు కూడా జగన్‌ ప్రభుత్వం టోపీ పెడుతోంది. రెండేళ్లకుపైగా ఎన్‌పీఎస్‌ కంట్రిబ్యూషన్‌ జమ చేయకుండా సొంత అవసరాలకు వాడేసుకుంటోంది. దీనిపై రగిలిపోతున్న ఐఏఎస్‌లు ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.

రిటైర్‌మెంట్‌ తర్వాత మిగిలేది శూన్యం

రెండేళ్లుగా సొంత అవసరాలకు వినియోగం

అఖిల భారత సర్వీసు అధికారుల ఆవేదన

ప్రభుత్వంతో తేల్చుకునేందుకు సిద్ధం

నేడు ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ అత్యవసర భేటీ

అజెండాలో చేరిస్తే మీడియాకు తెలుస్తుందని బెంగ

అందుకే టేబుల్డ్‌ ఐటమ్‌గా చేర్చాలని నిర్ణయం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ అధికారంలోకి వచ్చిన 6 నెలల వరకు ఉద్యోగులు ప్రశాంతంగానే ఉన్నారు. కానీ, ఆ తర్వాత నుంచి తమకిచ్చిన హామీలు, హక్కుల కోసం నేటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలా పోరాటం చేస్తున్న ఉద్యోగులతో ప్రభుత్వం తరపున అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎ్‌సలే సమావేశాలు, సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే, చిత్రంగా జగన్‌ ప్రభుత్వం ఐఏఎ్‌సలకు కూడా కుచ్చుటోపీ పెడుతోంది. గత 25 నెలల నుంచి వీరి ఖాతాలకు చేరాల్సిన ఎన్‌పీఎ్‌స(జాతీయ పింఛను పథకం) కంట్రిబ్యూషన్‌ సొమ్మును జమ చేయడం లేదు. దీంతో వారు రగిలిపోతున్నారు. అలాగని.. ఈ విషయంపై బయటపడితే పొలిటికల్‌ బాసుల నిర్ణయాలకు బలైపోవాల్సి వస్తుందని భయపడి మిన్నకుండిపోయారు. నాలున్నరేళ్ల నుంచి ఉద్యోగులు తమ హక్కులు, ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నా ఐఏఎ్‌సలు మాత్రం నోరుమెదపలేదు. అయితే, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్పందించకపోతే.. మరింతగా నష్టపోతామని గ్రహించి, ఎన్నికలకు 2 నెలల ముందు బయటపడ్డారు. తమకు 25 నెలల నుంచి ఎన్‌పీఎస్‌ కంట్రిబ్యూషన్‌ జమకావడం లేదని, ఇదేం ఖర్మరా బాబు అని ఏ ఇద్దరు ఐఏఎ్‌సలు కలిసినా చర్చించుకుంటున్నారు.

ఎప్పటి కంట్రిబ్యూషన్‌ అప్పుడు జమచేయకపోతే మార్కెట్‌ రైజింగ్‌లో ఉన్నప్పుడు దక్కాల్సిన రాబడులు తమకు దక్కకుండా పోతాయని ఐఏఎ్‌సలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల రిటైర్మెంట్‌ తర్వాత తమకు పెన్షన్‌ రూపంలో అందాల్సినసొమ్ము సామాజిక పెన్షన్ల కంటే తక్కువగా ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదని భావిస్తున్నారు. పైగా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు వచ్చే ప్రభుత్వం ఇస్తుందన్న గ్యారంటీ లేదని, ఇప్పుడు గట్టిగా ఒత్తిడి చేయకపోతే మొదటికే మోసం వస్తుందని నిర్ణయానికి వచ్చారు. ఈ అంశంపై సీరియ్‌సగా చర్చించాలని ఐఏఎ్‌సలు నిర్ణయించుకున్నారు. అంతేకాదు, ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవాలని తమ సంఘం నాయకులకు తేల్చి చెబుతున్నారు. ఈ సమస్యే ప్రధాన అజెండాగా సోమవారం ఐఏఎ్‌సల అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ జరగనుంది. అయితే, ఈ సమస్యను సమావేశం అజెండాలో చేర్చితే, అది మీడియాకు లీకైతే ప్రభుత్వం పరువుపోతుందని అసోసియేషన్‌ నాయకులు వేదన పడుతున్నారు. అందుకే ఈ అంశాన్ని అప్పటికప్పుడు టేబుల్డ్‌ ఐటమ్‌గా చర్చించాలని నిర్ణయించారు. 25 నెలల నుంచి ఐఏఎ్‌సలకు ఎన్‌పీఎస్‌ కంట్రిబ్యూషన్‌ జమ కావడంలేదన్న విషయం బయటకుపొక్కితే తీవ్రచర్చనీయాంశం అవుతుందని, ఈ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇబ్బందులు పడుతుందని అసోసియేషన్‌ నాయకులు భావిస్తున్నారు. అందుకే గుట్టుచప్పుడు కాకుండా చర్చించి, మీడియాకు దూరంగా ఉంచాలని నిర్ణయించారు.

ఉద్యోగులకు ఏడాదిగా ఎగవేత: ప్రభుత్వ ఉద్యోగులు తమకు హక్కుగా అందాల్సిన ప్రయోజనాలపై నాలుగున్నరేళ్ల నుంచి వివిధ రూపాల్లో జగన్‌ సర్కారుపై పోరాటం చేస్తున్నారు. 2022 నవంబరులో తమకు సీపీఎస్‌ కంట్రిబ్యూషన్‌ జమ చేయాలంటూ మంత్రులకు, సెక్రటరీలకు వినతిపత్రాలిస్తూ నిరసన వ్యక్తంచేశారు. దీంతో ప్రభుత్వం 2023, మార్చి వరకు సీపీఎస్‌ కంట్రిబ్యూషన్‌ జమ చేసింది. అంతే, అప్పటి నుంచి కంట్రిబ్యూషన్‌ కింద ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో మార్కెట్‌లో పెట్టుబడుల ద్వారా ఉద్యోగులకు దక్కాల్సిన మెరుగైన రాబడులను వారు కోల్పోతున్నారు. ఫలితంగా రిటైర్మెంట్‌ తర్వాత వారికి అందే అరకొర పెన్షన్‌లో భారీకోత పడనుంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం ప్రతినెలా ఉద్యోగుల వేతనం నుంచి 10 శాతం సొమ్మును కట్‌చేస్తూ దానిని సొంత అవసరాలకు వాడేస్తోంది.

ఎన్‌పీఎస్‌ కంట్రిబ్యూషన్‌ జమ అంటే

2004 సెప్టెంబరు నుంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి ఎన్‌పీఎస్‌ కింద పెన్షన్‌ ఇస్తున్నారు. దీనికిగాను ఉద్యోగుల వేతనంలో 10 శాతం కట్‌ చేసి, ఆ సొమ్ముకు మరో 10 శాతం కలిపి ప్రభుత్వం ఎన్‌ఎ్‌సడీఎల్‌కి జమ చేస్తే వారు మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. మార్కెట్‌ హెచ్చుతగ్గులను బట్టి రాబడులు ఉంటాయి. ఉద్యోగులు రిటైరయ్యే నాటికి రాబడులతో కలిపి జమయిన మొత్తం సొమ్ములో 60శాతం ఉద్యోగులకు ఇస్తారు. 40శాతం సొమ్మును తిరిగి పెట్టుబడి పెట్టి, దానిపై వచ్చిన రాబడిని ఉద్యోగికి పెన్షన్‌గా నెలనెలా అందిస్తారు. ఈ పెన్షన్‌ మొత్తం ఎక్కువగా ఉండాలంటే ఎప్పటికప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయాలి. కానీ, జగన్‌ సర్కార్‌ ఈ పని చేయడం లేదు.

ఎన్‌పీఎస్‌ కింద ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ను సకాలంలో జమచేయడంలో, అసలు జమచేయని సందర్భాల్లో ఉద్యోగులకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర ఆర్థిక శాఖ 2019లోనే అన్ని రాష్ట్రాలకు మెమో ఇచ్చింది. ఎంతకాలమైతే ఆలస్యమైందో ఆ కాలానికి వడ్డీని ఉద్యోగుల ఖాతాలో వేయాలని కేంద్రం ఆదేశించింది. జీపీఎ్‌ఫపై అమలయ్యే వడ్డీరేటునే ఈ ఆలస్యపు డిపాజిట్లపై అమలు చేయాలని కేంద్రం పేర్కొంది. జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్కనెల కూడా సకాలంలో ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ను ప్రభుత్వం జమచేయలేక పోయింది. అయినప్పటికీ, ఏ ఒక్క సందర్భంలో కూడా ఉద్యోగులకు వడ్డీ చెల్లించలేదు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఎస్‌ కింద తన కంట్రిబ్యూషన్‌ను 14 శాతానికి పెంచి, ఉద్యోగులకు మెరుగైన రాబడులు అందించేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం తరహాలోనే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ కంట్రిబ్యూషన్‌ను 14 శాతానికి పెంచి ఉద్యోగులకు మేలు చేస్తున్నాయి. చంద్రబాబు హయాంలో చివరి ఏడాదిలో ఉద్యోగులతో జరిగిన చర్చల్లోను, టక్కర్‌ కమిటీ నివేదికలోనూ ఈ కంట్రిబ్యూషన్‌ను 14 శాతానికి పెంచేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. కానీ, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ మాత్రం కంట్రిబ్యూషన్‌ను 10 శాతం వద్దే ఉంచి, దాన్ని కూడా సకాలంలో జమ చేయకుండా ఏళ్ల తరబడి ఉద్యోగులకు కుచ్చుటోపీ పెడుతున్నారు.

Updated Date - Feb 26 , 2024 | 03:29 AM