AP Budget : అప్పు చేసి చిప్పకూడు!

ABN , First Publish Date - 2024-02-08T03:46:44+05:30 IST

..ఇదీ ఐదేళ్లుగా జగన్‌ సర్కారు అనుసరిస్తున్న విధానం! ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘ఓటాన్‌ అకౌంట్‌’ కూడా సరిగ్గా ఇలాగే రూపొందింది. రూ.2.86 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌లో... రూ.1,20,000 కోట్లు అప్పే! ప్రభుత్వం మాత్రం అసలు అప్పులకు

AP Budget : అప్పు చేసి  చిప్పకూడు!

మొత్తం బడ్జెట్‌: రూ.2,86,389 కోట్లు

4 నెలలకు : రూ.95,463 కోట్లు

ఆదాయం : రూ.2,05,352 కోట్లు

అప్పులు : రూ.81,037 కోట్లు’

రెవెన్యూ లోటు: రూ.24,758 కోట్లు

  • అంకెలే.. ఆదాయం ఎక్కడ?

  • జగన్‌ సర్కారు బడ్జెట్‌ సారాంశం ఇదే!

  • ఐదేళ్లుగా అప్పులే ఆలంబనగా పాలన

  • రూ.2.86 లక్షల కోట్లతో

  • బుగ్గన బడ్జెట్‌ఇందులో రూ.1.20 లక్షల కోట్లకు అప్పులే ఆధారం

  • ‘మంగళవారం’ అప్పుల అంచనాలే 81వేల కోట్లు

  • మరో 40 వేల కోట్లు వివిధ మార్గాల్లో తేవాల్సిందే

  • కేవలం అప్పుల కోసంరెవెన్యూ లోటుకు కోత

  • రాష్ట్ర ఆదాయంపై లేనిపోని గొప్పలు

  • 4 నెలల కాలానికి 95,463 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌

తిందాం.. తిందాం!

ఏం తెచ్చుకొని తిందాం?

అప్పు తెచ్చుకొని తిందాం!

తెచ్చిన అప్పు ఎలా తీరుద్దాం!

ఆ తిప్పలు వచ్చే ప్రభుత్వాలవి, ఓట్లేసే జనాలవి! తిని పారిపోవడమే మన పని!

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

...ఇదీ ఐదేళ్లుగా జగన్‌ సర్కారు అనుసరిస్తున్న విధానం! ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘ఓటాన్‌ అకౌంట్‌’ కూడా సరిగ్గా ఇలాగే రూపొందింది. రూ.2.86 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌లో... రూ.1,20,000 కోట్లు అప్పే! ప్రభుత్వం మాత్రం అసలు అప్పులకు ముసుగేసి.. రూ.81,000 కోట్లు మాత్రమే రుణం చూపిస్తోంది. అప్పు పుట్టకపోతే... ఆర్థికంగా రాష్ట్రం ఢమాల్‌! అప్పులపై అంతగా ఆధారపడిపోయిన సర్కారు ఇది. సరైన,. సమర్థ పాలనలో ఏటా ఆదాయం పెరుగుతూ రావాలి. అభివృద్ధి జరగాలి. అప్పులు తగ్గాలి. కానీ, రాష్ట్రంలో అంతా రివర్స్‌. ఆదాయం అంచనాల్లో మాత్రమే పెరుగుతుంది. అప్పులు మాత్రం అంచనాలు దాటేస్తాయి. అభివృద్ధి ఎక్కడా కనిపించదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్‌లోనూ ఆదాయం పెంచి చూపించారు. ఎందుకంటే... అప్పులు తగ్గించి చూపాలి కాబట్టి! ఈ రెండూ చేస్తేనే రెవెన్యూ లోటు తగ్గించి చూపించగలరు. రెవెన్యూ లోటు తగ్గించి చూపిస్తేనే... భారీగా అప్పులు తెచ్చుకోగలరు. ఇదీ... జగన్‌ ఆర్థిక ప్రణాళిక! వైసీపీ సర్కారు ధ్యేయం ఒక్కటే! తప్పులు చేసైనా అప్పులు తేవడం! రాష్ట్రాన్ని రివర్స్‌ గేర్‌లో నడపడం!

అంచనాలకే ఆదాయం....

అద్దంలో చందమామను చూసి మురిసినట్లుగా... జగన్‌ సర్కారు హయాంలో ఆదాయం పెరుగుదలను కేవలం బడ్జెట్‌ అంచనాల్లోచూసి మురిసిపోవడమే! ఈసారి రూ.2,05,352 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. గత ఆర్థికసంవత్సరంలో రూ.1,57,768కోట్ల ఆదాయం రాగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు వరకు రూ.1,19,125 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అంటే... సగటున నెలకు 13,236కోట్లు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ.39,708కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తం ఆదాయం రూ.1,58,833 కోట్లు. ఇది సవరించిన అంచనాల కంటే రూ.37,869 కోట్లు తక్కువ. బడ్జెట్‌ అంచనాల ప్రకారం చూస్తే రూ.47,869 కోట్లు తక్కువ. ఇదీ ప్రస్తుత పరిస్థితి. మరి... కొత్తగా ఏం సాధించారని, ఏ రూపంలో సాధిస్తారని ఏకంగా రూ.2,05,352కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు? ఇది... రూ.40వేల కోట్లదాకా తప్పుల అప్పులు తెస్తామని పరోక్షంగా చెప్పడమే! ఈ బడ్జెట్లో దాదాపు రూ.40,000కోట్ల లేని రాని ఆదాయాన్ని చూపించారు. తర్వాత ఆ రూ.40,000 కోట్లను అప్పు రూపంలో తీసుకొస్తారు. ఐదేళ్లుగా వైసీపీ సర్కారు అనుసరిస్తున్న ప్లాన్‌ ఇదే!

అప్పులు పెరిగాయి.. కానీ వడ్డీ తగ్గిందంట!

అప్పులే కాదు... వడ్డీ లెక్కలూ తప్పులే! వారం వారం అప్పులు తెస్తూ పోతుంటే... వడ్డీల భారం తగ్గుతుందా? పెరుగుతుందా? కచ్చితంగా పెరుగుతుంది. కానీ... జగన్‌ సర్కారు

దీనిపైనా రివర్స్‌ లెక్కలే వేసింది. ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో వడ్డీల కింద రూ.28,673 కోట్లు చెల్లిస్తున్నట్టు రాశారు. కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రం వడ్డీ చెల్లింపులు 28,017 కోట్లే ఉంటాయట!

అప్పుల గంతలు...

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.81,037 కోట్ల అప్పులు మాత్రమే తెస్తామని బడ్జెట్‌ పత్రాల్లో పేర్కొన్నారు. కానీ... ఇది వాస్తవ విరుద్ధం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అప్పులు రూ.69,000 కోట్లు అని సవరించిన అంచనాలు వేశారు. కానీ, ఇప్పటికే ప్రభుత్వం రూ.1,06,000 కోట్లకు పైగా అప్పులు చేసింది. రూ.69,000 కోట్ల అప్పుల లెక్క కేవలం ఆర్‌బీఐ నుంచి ప్రతి మంగళవారం తెచ్చే అప్పు మాత్రమే. అవి కాకుండా, కేంద్రం ఇచ్చే రుణాలు, ఈఏపీ రుణాలు, నాబార్డు లోన్లు, పబ్లిక్‌ అకౌంట్‌ నెట్‌ నుంచి వాడుకునే డబ్బులు, కార్పొరేషన్ల నుంచి తెచ్చే దొంగచాటు అప్పులు వీటన్నింటి వివరాలు బడ్జెట్లో చెప్పలేదు. అలాగే, 2024-25లో కేవలం ‘మంగళవారం’ అప్పులనేరూ.81,037 కోట్లుగా చూపించారు. ఆదాయం అంచనాలను ఎక్కువ చేసి చూపించిన రూ.40వేల కోట్లనూ వివిధ మార్గాల్లో అప్పుల ద్వారానే తెస్తారు. అంటే... మొత్తం అప్పుల అంచనా 1,21,370 కోట్ల రూపాయలు!

తూచ్‌.. ఒక్క పట్టా ఇవ్వలేదు సభలో తడబడ్డ మంత్రి బుగ్గన

గత ప్రభుత్వం తన ఐదేళ్ల కాలంలో 4.63 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా, తమ ప్రభుత్వం 2019 సంవత్సరం నుంచి రూ.1.53 లక్షల కోట్ల విలువ గల 30.65 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిందని అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రకటించారు. సభలోనే ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ సూచనతో మంత్రి తిరిగి సర్దుకున్నారు. గత ప్రభుత్వంలో ఒక్క ఇళ్ల పట్టా కూడా ఇవ్వలేదని మంత్రి సవరించి చదివారు. తడబడినా మంత్రి నిజమే చెప్పారంటూ సభలో పలువురు నవ్వుకోవడం కనిపించింది. కాగా, శాసనమండలిలో భారీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 35 నిమిషాలకే ప్రసంగం పూర్తిచేసి తిరిగి అసెంబ్లీకి మంత్రి చేరుకున్నారు.

అమరావతిలో అపురూప శిల్పాలా.!

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రసంగ పుస్తకం తొలి పేజీలోనే ‘మా తెలుగు తల్లికి’ గీతాన్ని ప్రచురించారు. ఈ ఐదేళ్లలో ఈ గీతం ఎక్కడా, ఎప్పుడూ వినిపించలేదు. ఎన్నికల ముందు మాత్రం ఒక్కసారిగా బడ్జెట్‌ పుస్తకంలో ముద్రించారు. ‘తెలుగు మీడియం వద్దు.. ఆంగ్లమే కావాలి’ అంటూనే ‘తెలుగు తల్లి’ పాట పాడటం విశేషం. ఇక... ‘అమరావతినగర అపురూప శిల్పాలు’ ఎక్కడున్నాయో, ఏమో! అఽధికారంలోకి రాగానే... జగన్‌ ప్రజా రాజధానిని అమరావతిని అటకెక్కించారు. అధికారంలోకి ‘ప్రజా వేదిక’ను కూల్చేసి, శిథిలాలను అలా కుప్పగా పోశారు. త్యాగయ్య గొంతులో నాదాలు తారాడగా... వైసీపీ నేతల నోట్లో మాత్రం బూతులే! ఇలా... మా తెలుగు తల్లికి గీతంలో ఉన్న ప్రతి పంక్తికీ వైసీపీ పాలన విరుద్ధమే!

ఆరోగ్యానికి అంతంతే!

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఆరోగ్యశాఖకు ఆశించిన స్థాయిలో కేటాయుంపులు చేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరంతో పోల్చితే కేవలం 11 శాతం మాత్రమే పెంచారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.17,916 కోట్లు కేటాయింపులు చేశారు. దీనిలో తొలి 4నెలలకు రూ.5972 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఆరోగ్యశాఖ పథకాలు, ఖర్చులు ఆధారంగా చూస్తే దాదాపు రూ.20 వేల కోట్లు అవసరమని నిపుణులు అంచనా. ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్‌ ప్రసంగంలో నాడు-నేడు కింద రూ.16,852 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించారు. కానీ, బోధనాసుపత్రుల్లో ఇప్పటివరకు నాడు-నేడు ప్రారం భం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసిన 17 మెడికల్‌ కాలేజీల్లో ఇప్పటికే 10 కాలేజీలు ప్రారంభించినట్టు మంత్రి బుగ్గన గొప్పలు చెప్పారు. వాస్తవానికి 5 మెడికల్‌ కాలేజీల్లో మాత్రమే అడ్మిషన్లు జరిగాయి.

పర్యాటకానికి విదిలింపు

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పర్యాటక రంగం గురించి పెద్ద ఎత్తున ఉపన్యాసం దంచికొట్టినా ఆ రంగం అభివృద్ధికి, పర్యాటకులను ఆకర్షించే ప్రణాళికలకు మాత్రం ఆశించిన స్థాయిలో కేటాయింపులు చేయలేదు. రాష్ట్రం పురాతన చారిత్రక ప్రదేశాలతో అపారమైన పర్యాటక సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పిన మంత్రి బుగ్గన వాటిని అభివృద్ధి చేసేందుకు నిధులు మాత్రం కంటితుడుపుగా కేటాయించారు. ఓటాన్‌ అకౌంట్‌లో 4 నెలలకు గాను కేవలం రూ.38 కోట్లు విదిలించారు.

విద్యపై అంకెలగారడీ రూ.33,898 కోట్లు కేటాయింపు

విద్యారంగంపై బడ్జెట్‌ కేటాయింపులు గందరగోళంగా మారాయి. 2023-24బడ్జెట్‌లో కేటాయింపులు మొత్తం ఖర్చు చేయలేక సవరణ అంచనాల్లో కేటాయింపులు తగ్గించుకున్న ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో కేటాయింపులు పెంచి చూపించింది. 2023-24లో విద్యారంగానికి రూ.32,198 కోట్లు కేటాయించింది. కానీ, ఖర్చులో మాత్రం విఫలమైంది. దీంతో అదే సంవత్సరానికి సవరణ అంచనాల్లో ఆ కేటాయింపులను రూ.31,363 కోట్లుగా చూపించింది. ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ కేటాయింపులు చూపించేందుకు తాజా బడ్జెట్‌లో విద్యారంగానికి 33,898 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఏడాది కేటాయింపుల్లోనే వెనక్కి తగ్గిన ప్రభుత్వం మళ్లీ ఎలా పెంచిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

‘సాగు’కు స్పష్టత కరవు

వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ప్రభుత్వం అరకొర నిధులే కేటాయించింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఏ పథకానికి ఎంత ఖర్చు చేయనున్నారో స్పష్టం చేయలేదు. 2023-24లో రైతు సంక్షేమ పథకాలకు రూ.11,589 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. రానున్న మూడు నెలల్లో ఆయా పథకాలకు ఎంతెంత ఖర్చు చేస్తారో వివరించలేదు. కాగా, 2024-25 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.11,424.51 కోట్లు కేటాయించింది. తొలి 4 మాసాలకు రూ.5558.17 కోట్లు అంచనా వ్యయంగా చూపారు. మొదటి త్రైమాసికానికి పశుసంవర్ధక, మత్స్యరంగానికిరూ.619.34 కోట్లు, సహకార రంగానికి రూ.264.78 కోట్లు కేటాయించారు.

విద్యారంగంపై బడ్జెట్‌ కేటాయింపులు గందరగోళంగా మారాయి. 2023-24బడ్జెట్‌లో కేటాయింపులు మొత్తం ఖర్చు చేయలేక సవరణ అంచనాల్లో కేటాయింపులు తగ్గించుకున్న ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో కేటాయింపులు పెంచి చూపించింది. 2023-24లో విద్యారంగానికి రూ.32,198 కోట్లు కేటాయించింది. కానీ, ఖర్చులో మాత్రం విఫలమైంది. దీంతో అదే సంవత్సరానికి సవరణ అంచనాల్లో ఆ కేటాయింపులను రూ.31,363 కోట్లుగా చూపించింది. ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ కేటాయింపులు చూపించేందుకు తాజా బడ్జెట్‌లో విద్యారంగానికి 33,898 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఏడాది కేటాయింపుల్లోనే వెనక్కి తగ్గిన ప్రభుత్వం మళ్లీ ఎలా పెంచిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

‘సాగు’కు స్పష్టత కరవు

వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ప్రభుత్వం అరకొర నిధులే కేటాయించింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఏ పథకానికి ఎంత ఖర్చు చేయనున్నారో స్పష్టం చేయలేదు. 2023-24లో రైతు సంక్షేమ పథకాలకు రూ.11,589 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. రానున్న మూడు నెలల్లో ఆయా పథకాలకు ఎంతెంత ఖర్చు చేస్తారో వివరించలేదు. కాగా, 2024-25 బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.11,424.51 కోట్లు కేటాయించింది. తొలి 4 మాసాలకు రూ.5558.17 కోట్లు అంచనా వ్యయంగా చూపారు. మొదటి త్రైమాసికానికి పశుసంవర్ధక, మత్స్యరంగానికిరూ.619.34 కోట్లు, సహకార రంగానికి రూ.264.78 కోట్లు కేటాయించారు.

అభివృద్ధి వ్యయంపై అవే కోతలు

రాష్ట్ర అభివృద్ధికి పనికొచ్చే ఖర్చు... క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌! ఈ ఏడాదికి సవరించిన అంచనాల్లో దీనిని రూ.27,308 కోట్లుగా చూపించారు. కానీ, ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు చేసిన ఖర్చు రూ.19,202 కోట్లు మాత్రమే. ఈ లెక్క కూడా నమ్మశక్యంగా లేదు. ఏటా ఫిబ్రవరి నుంచి మార్చికెళ్లే సరికి కాగ్‌ నివేదికల్లో ప్రభుత్వం పెట్టుబడులపై చేసిన ఖర్చు తగ్గిపోతూ కనిపిస్తోంది. అలాగే, తాజా బడ్జెట్‌లో అభివృద్ధి వ్యయం పద్దులో రూ.30,530కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. ఇదీ ఆచరణ సాధ్యంకాని మాయ లెక్కే!

ఉద్యోగులకు ఐఆర్‌, పీఆర్సీ లేనట్టే

రెవెన్యూ వ్యయం రూ.2,30,110 కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాకంటే ఇది రూ.1873 కోట్లు మాత్రమే అధికం. ఈ జంబో బడ్జెట్‌లో ఇది నామమాత్రం. దీని అర్థం ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్‌, డీఏ బకాయిలు, పదకొండో పీఆర్సీ బకాయిలు, ఇతర పెండింగ్‌ బకాయిలు లేనట్టే. ఉద్యోగులకు 12వ పీఆర్సీ ఇవ్వాల్సిన సమయం దాటిపోయింది. కమిషన్‌ వేసిన 6 నెలలకు కార్యాలయం కోసం ఒక గది కేటాయించారు. దీనిపై ఎలాంటి తదుపరి చర్యలు లేవు. పోనీ ఐఆర్‌ అయినా ఇస్తారా అంటే దానికీ చాన్స్‌ లేదు. ఎందుకంటే రెవెన్యూ వ్యయాన్ని ప్రభుత్వం పెంచలేదు. వ్యయంలో పెరుగుదల లేదంటే ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్‌, డీఏ బకాయిలు, రిటైర్మెంట్‌ ప్రయోజనాలు ఇచ్చే ఉద్దేశం లేదని అర్థమవుతోంది.

బడ్జెట్‌ సమగ్ర స్వరూపం

BUDGET.jpg

బ.అం.- బడ్జెట్‌ అంచనా స.అం.- సవరించిన అంచనా (అంకెలు రూ. కోట్లలో)

Updated Date - 2024-02-08T03:46:45+05:30 IST