Share News

జగన్‌ ఇచ్చిందే స్కీమట!

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:06 AM

తాను ఇవ్వలేని ఏ స్కీమునూ ఎవరూ అందించలేరని సీఎం జగన్‌ గొప్పలు పోయారు.

జగన్‌ ఇచ్చిందే స్కీమట!

నా మాదిరిగా ఎవరూ చేయలేరు.. నేను ఇవ్వనిదేన్నీ ఇవ్వలేరు

పరాకాష్ఠకు చేరిన జగన్‌ స్వోత్కర్ష

టెక్కలిలో ముగిసిన బస్సుయాత్ర

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి)/టెక్కలి : తాను ఇవ్వలేని ఏ స్కీమునూ ఎవరూ అందించలేరని సీఎం జగన్‌ గొప్పలు పోయారు. జగన్‌కు ఓటు వేస్తేనే ఇప్పుడున్న పథకాలు ఉంటాయని; చంద్రబాబుకు, ఆయన పొత్తు పెట్టుకున్న పార్టీల అభ్యర్థులకు ఓటువేస్తే అవన్నీ నిలిచిపోతాయంటూ సొంత డబ్బా మరోసారి కొట్టుకున్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ముగింపు సభలో జగన్‌ మాట్లాడారు. ఎప్పటిలాగే స్వోత్కర్ష, పర నిందలతో, కళ్లార్పకుండా చెప్పే అబద్ధాలతో సొంత పార్టీ శ్రేణులకే విసుగు తెప్పించేలా జగన్‌ ప్రసంగం సాగింది. ఇడుపులపాయ నుంచి మొదలెట్టిన సిద్ధం యాత్రను ఇచ్ఛాపురంలో ముగించామని జగన్‌ అనగా, సభికులు అవాక్కయ్యారు. సభ జరుగుతున్నది టెక్కలిలో కదా అంటూ జనం గొనుక్కోవడం కనిపించింది. అనంతరం.. వైసీపీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ.. అభ్యర్థులందరూ సౌమ్యులూ.. మంచివారని జగన్‌ కొనియాడారు. .

నరకం చూపిన ట్రాఫిక్‌ ఆంక్షలు

టెక్కలి సిద్ధం సభకు వందల బస్సులను ఆర్టీసీ తరలించింది. పల్లె ప్రాంతాలు ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ సర్వీసులే ప్రజలకు ప్రధాన రవాణా సాధనం. జగన్‌ కోసం దాదాపుగా బస్సులన్నీ ఈడ్చేయడంతో గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు అవస్థ పడ్డారు. బుధవారం అక్కివలస నుంచి జగన్‌ బస్సుయాత్ర ప్రారంభమై.. జాతీయ రహదారి మీదుగా టెక్కలి వరకూ సాగింది. ఈ క్రమంలో ఆంక్షలు కారణంగా శ్రీకాకుళంలో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం నుంచి శ్రీకాకుళం కొత్తరోడ్డు వరకు సుమారు రెండున్నర గంటలపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ముఖ్యమంత్రి సాయంత్రం 4.10 గంటలకు జాతీయరహదారి పరశురాంపురం జంక్షన్‌కు బయలుదేరగానే.. పరశురాంపురం నుంచి కోటబొమ్మాళి వరకు లారీలు,బస్సులు, ఇతర వాహనాలను నిలిపివేశారు. అక్కవరం మొదలుకొని జగతిమెట్ట, ఆది ఆంధ్రావీధి, టెక్కలి శివారు ప్రాంతం నుంచి నందిగాం మండల పరిధి వరకు అన్నిరకాల వాహనాలు రెండువైపులా బారులుతీరాయి.

నేడు పులివెందులలో జగన్‌ నామినేషన్‌

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ గురువారం పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. జగన్‌ స్వయంగా పులివెందులలో ఉదయం 11.25 నుంచి 11.40 గంటల మధ్య రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాన్ని అందజేస్తారు. అనంతరం భాకరాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ’

Updated Date - Apr 25 , 2024 | 04:07 AM