Share News

జగన్‌... నీకిది తగునా?

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:03 AM

‘నిన్ను సీఎంగా చూడాలని తపించిన మీ చిన్నాన్న వ్యక్తిత్వాన్ని మీ పత్రికల్లో, టీవీల్లో, సోషల్‌ మీడియాలో హననం చేయడం తగునా? న్యాయం కోసం పోరాడుతున్న నీ చెల్లి సునీత..

జగన్‌... నీకిది తగునా?

నీ సొంత మీడియాలోనే మీ చిన్నాన్న వ్యక్తిత్వ హననమా?

కుటుంబ సభ్యుడిగా కాకపోయినా.. సీఎంగా ఇదేనా నీ కర్తవ్యం?

నీ చెల్లెళ్లను టార్గెట్‌ చేస్తుంటే... నిమ్మకు నీరెత్తినట్లు ఉండటమేంటి?

హత్యకు కారకుడైన నిందితుడికి మళ్లీ పోటీకి అవకాశమివ్వడం సముచితమా?

సీఎం జగన్‌కు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖ

పులివెందుల, ఏప్రిల్‌ 25: ‘‘నిన్ను సీఎంగా చూడాలని తపించిన మీ చిన్నాన్న వ్యక్తిత్వాన్ని మీ పత్రికల్లో, టీవీల్లో, సోషల్‌ మీడియాలో హననం చేయడం తగునా? న్యాయం కోసం పోరాడుతున్న నీ చెల్లి సునీత.. ఆమెకు మద్దతు ఇస్తున్న షర్మిలపై నిందలు మోపుతుంటే.. కుటుంబ సభ్యునిగా కాకపోయినా.. ముఖ్యమంత్రిగా అయినా ఇదేనా నీ కర్తవ్యం?’’ అని సీఎం జగన్‌ను వివేకా భార్య వైఎస్‌ సౌభాగ్యమ్మ ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె సీఎంకు రాసిన బహిరంగ లేఖను గురువారం సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘‘2009లో తండ్రి చనిపోయినపుడు నువ్వు ఎంత వేదనను అనుభవించావో 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే వేదన అనుభవించింది. అప్పటినుంచి జరిగిన పరిణామాల్లో మమ్మల్ని ఎక్కువ బాధించిన విషయం.. మన కుటుంబంలోని వారే ఈ హత్యకు కారకులు కావడం... వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం. నిన్ను సీఎంగా చూడాలని తపించిన చిన్నాన్నపై మీ సొంత మీడియా, పార్టీ వర్గాలు తీవ్ర విమర్శలు చేశాయి. మాటల్లో చెప్పలేనంత విధంగా వ్యక్తిత్వ హననం చేయడం, చేయించడం నీకు తగునా? న్యాయం కోసం పోరాడుతున్న నీ చెల్లెలు సునీతను హేళన చేస్తూ, నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు పట్టడం లేదా? సునీతకు మద్దతుగా పోరాడుతున్న షర్మిలను కూడా టార్గెట్‌ చేస్తుంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏమిటి? కుటుంబ సభ్యునిగా కాకపోయినా ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే విషయం.. హత్యకు కారకులైన వారికి మళ్లీ పోటీచేసే అవకాశాన్ని కల్పించడం. ఇది సముచితమా? ఇటువంటి చర్యలు నీకు మంచిది కాదు. హత్యకు కారకుడైన నిందితుడు నామినేషన్‌ దాఖలు చేశాడు. చివరి ప్రయత్నంగా న్యాయం, ధర్మం గురించి ఆలోచించమని నిన్ను అర్థిస్తున్నా. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా న్యాయం, ధర్మం, నిజంవైపు నిలబడమని వేడుకుంటున్నా’’ అని సౌభాగ్యమ్మ తన లేఖలో పేర్కొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 05:03 AM