మొహం చెల్లకే దావోస్‌కు వెళ్లని జగన్
ABN , Publish Date - Jan 18 , 2024 | 04:06 AM
తన నిర్ణయాలతో జాతీయంగా, అంతర్జాతీయంగా పరువు తీసుకొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మొహం చెల్లకే దావోస్ వెళ్లలేదని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది.
దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేదు
సైకో పోయి సైకిల్ రావాలన్నది ప్రజల ఆకాంక్ష: టీడీపీ
అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): తన నిర్ణయాలతో జాతీయంగా, అంతర్జాతీయంగా పరువు తీసుకొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మొహం చెల్లకే దావోస్ వెళ్లలేదని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధ రామయ్య దావోస్ సదస్సుకు వెళ్లి తమ రాష్ట్రాలకు పెట్టుబడులు తెచ్చుకోవడానికి శ్రమిస్తుంటే జగన్‌రెడ్డి ఆ శక్తి లేక ఇంట్లో కూర్చుండిపోయారని ఆ పార్టీ విమర్శించింది. రాష్ట్రం పరువు తీసి జగన్‌రెడ్డి చరిత్ర హీనుడిలా మిగిలిపోయారని, ఆయన ఐదేళ్ల పాలనలో రాష్ట్రం దారుణంగా నష్టపోయిందని ఆ పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం బుధవారం ఇక్కడ తమ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘జగన్‌రెడ్డికి ఈ రాష్ట్రంలో వనరులను దోచుకొని సొంత ఖజానాను నింపుకోవడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తేవడంపై లేదు. పెట్టుబడుల ఆకర్షణలో దావోస్ సదస్సు ఒక కీలక కేంద్రం. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు అనేకసార్లు అక్కడకు వెళ్లి తెలుగు రాష్ట్రాలకు ఎంతగానో ప్రాచుర్యం కల్పించారు. ఆయన కృషివల్ల టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాష్ట్రం రూ.65 వేల కోట్ల విదేశీ పెట్టుబడులను సంపాదించగలిగింది. ఆ సమయంలో మొత్తం దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 15శాతం మన రాష్ట్రానికే వచ్చాయి. జగన్ సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రానికి గతంతో పోలిస్తే కేవలం 10 శాతం పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఈ నాలుగున్నరేళ్లలో వచ్చిన విదేశీ పెట్టుబడులు రూ.ఆరున్నర వేల కోట్లు మాత్రమే. మొత్తం దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో ఇది ఒక శాతానికంటే తక్కువ. ఇంత ఘోరంగా రాష్ట్రం పరిస్థితి ఏనాడూ లేదు. విద్యుత్ పీపీఏలను అడ్డగోలుగా రద్దు చేయడంతో జగన్ వల్ల దావోస్ సదస్సులో విదేశీ కంపెనీల ముందు తల దించుకోవాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వాపోయారు. జగన్ వైఫల్యం రాష్ట్రంలో నిరుద్యోగులకు శాపంగా మారింది. అందుకే ప్రజలు సైకో పోయి సైకిల్ రావాలని కోరుకొంటున్నారు’ అని పట్టాభి వ్యాఖ్యానించారు.