Share News

AP Election Result: ఆత్మ వంచన.. పరనింద!

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:27 AM

ఎంత పని చేశావ్‌ జగనన్నా! పాలన సాగించమంటే... పగ సాధించావ్‌! ఇప్పుడు... నువ్వు మునిగిపోయావ్‌.

AP Election Result: ఆత్మ వంచన.. పరనింద!

ఓటమి తర్వాతా మారని జగన్‌ తీరు

ప్రజలపై కృతఘ్నులుగా ముద్ర

2.70 లక్షల కోట్లు పంచినా...

ఆ అభిమానం ఏమైందో ఏమో!

ఎవరో మోసం చేశారని అనొచ్చు

ఏం జరిగిందో దేవుడికే తెలియాలి

కష్టాలు ఎదుర్కొనేందుకు సిద్ధం

కూటమికి అభినందనలు: జగన్‌

సీఎం పదవికి రాజీనామా ఆమోదించిన గవర్నర్‌

ఎంత పని చేశావ్‌ జగనన్నా! పాలన సాగించమంటే... పగ సాధించావ్‌! ఇప్పుడు... నువ్వు మునిగిపోయావ్‌. నిన్ను నమ్ముకున్న అభిమానులనూ ముంచేశావ్‌! అసలేమైంది నీకు! రాజన్న కొడుకువని ఆదరించాం. అసలే ఒకసారి ఓడిపోయాడు, ‘ఒక్క చాన్స్‌’ అని అడుగుతున్నావని ఓట్లేసి 2019లో గెలిపించాం! చంద్రబాబు ఘోరాలు, నేరాలు చేశాడని కాదు... నువ్వు అడుగుతున్నావని, మేలు చేయకపోయినా చెడు చేయవుకదా అనుకుని ఒక అవకాశమిచ్చాం! ‘ఆరు నెలల్లోనే దేశంలోనే బెస్ట్‌ సీఎం అనిపించుకుంటాను. ఒక్కసారి కాదు... ముప్పైఏళ్లు అధికారంలో ఉండేలా పరిపాలన సాగిస్తాను’ అన్న నీ తొలి పలుకులు విని మురిసిపోయాం. నిజంగానే మంచి చేస్తావని గట్టిగా నమ్మాం. కానీ, నువ్వేం చేశావ్‌! వచ్చీ రాగానే ప్రజావేదిక కూల్చేశావు. అమరావతిని నాశనం చేశావు. పోలవరంపై పగబట్టావు. అభివృద్ధి కాదు... బటన్‌ నొక్కితే చాలనుకున్నావు. పరిశ్రమలను తరిమేశావ్‌. పెట్టుబడిదారులను భయపెట్టావ్‌! జనానికి అన్నం పెడితే చాలు, కూరలు పెట్టకున్నా పర్వాలేదనుకుంటే ఎలా? ఈ సింపుల్‌ లాజిక్‌ కూడా మరిచిపోయావేం జగనన్నా! అభివృద్ధి, సంక్షేమం రెండూ ముఖ్యమే కదా! ‘నేను ఇచ్చేవాడిని. మీరు తీసుకునే వాళ్లు’ అని పోజులు కొడితే ఎలా? పేదలకు కూడా ఆత్మాభిమానం ఉంటుందని మరిచిపోయావా? వాళ్లు సొంతంగా కష్టపడి సంపాదించుకుని తింటే తృప్తి! దానికి సంక్షేమం కూడా తోడైతే సంతృప్తి! తృప్తి లేకుండా సంతృప్తి ఎక్కడిది? ఫలితం చూశావు కదా! ‘మా ఓటు బ్యాంకు’ అని మీరు ఘనంగా చెప్పుకొన్న పేదలు కూడా చెయ్యిచ్చారు.


‘మాట తప్పను. మడమ తిప్పను. చెప్పానంటే చేస్తానంతే’... ఇలా ఎన్ని డైలాగులు చెప్పావన్నా! ఉద్యోగులను నమ్మించి మోసం చేశావు కదా! వాళ్లూ ఓటు బ్యాంకే కదా! ఆ కోణంలోనైనా వాళ్లను మంచి చేసుకోవాలి కదా! మంచి చేసుకోకున్నా... చెడ్డ చేసుకోకుండా ఉండటం రాజకీయ నాయకుడి లక్షణం కదా! ఈ విషయం కూడా మరిచిపోయావేమన్నా! అధికారంలో ఉంటే అంతేనా? మద్య నిషేధం అంటివి. చెత్త బ్రాండ్లు నెత్తిన రుద్దితివి. చివరాఖరికి... మందుబాబులకు కూడా చెడ్డయితివి కదన్నా! ఇసుక పాలసీ అని భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టావు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువత నెత్తిన జెల్ల కొట్టావు. ఇసుక, మద్యం, కాంట్రాక్టులు, గనులు అన్నింటి ఆదాయం ఒక్కచోటికే చేర్చి... కిందున్న వైసీపీ నాయకుల జేబులూ కొట్టావ్‌! ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ పేరుతో రైతులను భయపెట్టావ్‌. ఇలా అందరినీ దూరం చేసుకుని కూడా ‘వైనాట్‌ 175’ అని తొడగొట్టడమేందన్నా! పనులు లేవు, చేసిన పనులకు బిల్లులూ లేవు! ఏ ఆదాయమూ కనిపించక మనోళ్లు జనంమీద పడి దోచుకుంటుంటే..

ప్రజలకు మండదా అన్నా! అసెంబ్లీలో, బయటా వైసీపీ నాయకులు పచ్చి బూతులు, నీచపు మాటలు మాట్లాడుతుంటే జనానికి మండదా అన్నా! కరెంటు చార్జీలు పెంచి, ఆర్టీసీ చార్జీలు పెంచి, ఆస్తి పన్ను పెంచి బాదుతుంటే మండదా అన్నా? మాటికీ మాటికీ పవన్‌ కల్యాణ్‌ పెళ్లిళ్ల గురించి మాట్లాడితే మండదా అన్నా! అసలు పాలన వదిలేసి చెత్త పోగేసుకోవడం ఎందుకన్నా? ఇంకా నిన్ను గెలిపిస్తారని ఎలా అనుకున్నావ్‌! హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి అమెరికా, దుబాయ్‌ నుంచి కూడా పోలోమని వచ్చి ఓట్లు వేశారంటే... అది నిన్ను గెలిపించేందుకని అనుకున్నావా? ‘మళ్లీ జగన్‌ వస్తే ఎలారా బాబోయ్‌’ అని భయంతో వచ్చి ఓటేశారని తెలీలేదా అన్నా! చివరాఖరికి... లండన్‌ ఫ్లైటు ఎక్కేముందు కూడా ‘అంతకుమించి’ ఓట్లు వస్తాయని నమ్మబలికితివే! నువ్వు ‘అన్నీ నిజాలే చెబుతావు’ అని గుడ్డిగా నమ్మిన కొందరు అభిమానులు నిన్నటి దాకా సోషల్‌ మీడియాలో బీరాలు పలుకుతూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ల సంగతేమిటన్నా! తలలు ఎక్కడ పెట్టుకోవాలన్నా? అ అమరావతి కొనసాగించి, పోలవరం పూర్తి చేసి, నీ మార్కు బటన్‌ నొక్కుడుతో ముందుకు పోయి ఉంటే... ఈ పరిస్థితి వచ్చేదా? చంద్రబాబును ఎప్పుడో జనం మరిచిపోయే వాళ్లు కదా! 2019లో టీడీపీ ఓటమికి చంద్రబాబు కారణం కాదు. కానీ... ఇప్పుడు వైసీపీ ఓటమికి నువ్వే... వంద శాతం నువ్వే కారణం! అనుభవించు! నీతోపాటు మీ అభిమానులూ అనుభవించాల్సిందే!

ఇట్లు...

సగటు వైసీపీ అభిమాని

Updated Date - Jun 05 , 2024 | 07:47 AM