Share News

ముస్లింలకు ద్రోహం చేసింది జగనే

ABN , Publish Date - Mar 16 , 2024 | 02:21 AM

రాష్ట్రంలోని ముస్లింలకు ద్రోహం చేసింది సీఎం జగనేనని.. వారి పథకాలన్నీ రద్దు చేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

ముస్లింలకు ద్రోహం చేసింది జగనే

వాళ్ల పథకాలన్నీ రద్దు చేశాడు

బీజేపీతో పొత్తుపై తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలి

రాష్ట్ర భవిష్యత్‌ కోసమే మూడు పార్టీల మైత్రి

చరిత్రలో నిలిచేలా ‘పేట’ సభ: చంద్రబాబు

టీడీపీ నేతలతో టెలి కాన్ఫరెన్స్‌

అమరావతి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ముస్లింలకు ద్రోహం చేసింది సీఎం జగనేనని.. వారి పథకాలన్నీ రద్దు చేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వారికి ఏమీ చేయకుండా మళ్లీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని.. బీజేపీతో టీడీపీ పొత్తుపై వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగుతోందని విమర్శించారు. దీనిని పూర్తిస్థాయిలో తిప్పికొట్టాలని టీడీపీ నేతలకు పిలుపిచ్చారు. ఆయన శుక్రవారం వారితో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లు కాపాడింది టీడీపీయేనని.. పార్టీ తరఫున ఆనాడు న్యాయస్థానంలో వాదించేందుకు న్యాయవాదులను నియమించామని గుర్తు చేశారు. మత సామరస్యాన్ని కాపాడామని, ఉర్దూ యూనివర్సిటీ, హజ్‌హౌ్‌సల నిర్మాణంతో పాటు ఉర్దూను రెండో అధికార భాషగా చేశామన్నారు. పండుగ సమయంలో రంజాన్‌ కానుకతో పాటు దుల్హన్‌ పథకంతో ముస్లింలను ఆదుకున్నామని.. టీడీపీ ముస్లింల కోసం తీసుకొచ్చిన 10 పథకాలను జగన్‌ రద్దు చేశాడని అన్నారు. వలంటీర్లను ఇంటింటికీ పంపి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, దానిని ఎండగట్టాలని నేతలను కోరారు. చిలకలూరిపేట సభను చరిత్రాత్మకంగా నిర్వహించబోతున్నామని, పొత్తు ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ‘ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఎవరికి ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదు. పొత్తులో భాగంగా ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉండాలి. ఎవరూ తక్కువ కాదు.. ఎవరూ ఎక్కువా కాదు. రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడుకోవడం అందరి బాధ్యత. మూడు పార్టీల నేతలు ఏకతాటిపైకి రావాలి. జగన్‌ అరాచకాలతో రాష్ట్రం ధ్వంసమైంది. కేంద్ర సాయం ఉంటే రాష్ట్రాభివృద్ధికి నిధులు వస్తాయి. ప్రచారంలో ఎవరు ముందుంటారో వారిదే యుద్ధంలో పై చేయి అవుతుంది. జాతీయ మీడియా సర్వేలతో మనమే గెలుస్తామని తేలిపోయింది. 20 పార్లమెంట్‌ సీట్లు గెలుస్తామని చెబుతున్నారు. మరింత కృషి చేస్తే 25 సీట్లు గెలుస్తాం. దొంగ ఓట్లకు అవకాశమే ఉండకూడదు. జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత మనపైనే ఉంది’ అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఐదేళ్లుగా ప్రాణాలకు తెగించి పోరాడారని, సీట్లు త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లుగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

నకిలీ లేఖపై సీఐడీ చీఫ్‌కు వర్ల లేఖ

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పిఠాపురం పార్టీ ఇన్‌చార్జి ఎస్‌వీఎ్‌సఎన్‌ వర్మ మధ్య విభేదాల సృష్టికి అచ్చెన్నాయుడి పేరుతో నకిలీ లేఖ తయారుచేసి ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఐడీ చీఫ్‌కు ఆయన లేఖ రాశారు. పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి వర్మ సస్పెన్షన్‌ అంటూ ఫేక్‌ లేఖ వైరల్‌ చేశారని.. ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించినందుకు చంద్రబాబును, లోకేశ్‌ను వర్మ విమర్శించారని.. దాంతో ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆ నకిలీలో లేఖలో ఉంది.

Updated Date - Mar 16 , 2024 | 07:38 AM