విషం చిమ్మడమే నైజం!
ABN , Publish Date - Jul 21 , 2024 | 04:19 AM
వ్యక్తిగత గొడవలు, ఫ్యాక్షన్ మర్డర్లు, ఇతరత్రా కారణాలవల్ల జరిగే హత్యలు...
అదే విద్వేషపు రాత.. నిజాల ఊచకోత
రోత పత్రికలో టీడీపీపై అడ్డగోలు దాడులు
అధికారంలో ఉన్న ఐదేళ్లూ అరాచకపర్వం
విపక్షంలోకి వచ్చిన 5 వారాలకే జగన్ గగ్గోలు
నాడు వివేకా హత్య, కోడికత్తి చంద్రబాబుపైకే
ఇప్పుడు వినుకొండ ఘటన టీడీపీపైనే
అసలు నిజాలు మరిచి రోత రాతలు
నిజాలు ఏవైనా సరే... విషం చిమ్మాలి! ‘రోత పత్రిక’లో నీచ రాతలు రాయాలి! అక్షరాలకు రక్తం పులిమి... అదంతా టీడీపీ ఖాతాలో వేయాలి! ఇదీ... జగన్ నైజం! టీడీపీ అధికారంలోకి వచ్చీ రాగానే ఆయనకు ‘అరాచకాలు, అన్యాయాలు, రక్త చరిత్రలు’ గుర్తుకు వస్తాయి. ఐదేళ్లు అధికారంలో ఉండగా తన పార్టీ పరివారం చేసిన నడిరోడ్డు హత్యలు, దాడులపై నోరు మెదిపిన దాఖలాలే లేవు. ఇప్పుడు... కూటమి సర్కారు
కొలువుదీరిన ఐదు వారాలకే ‘రాష్ట్రంలో రాష్ట్రపతి
పాలన విధించాలి’ అని జగన్ గగ్గోలు పెడుతున్నారు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
వ్యక్తిగత గొడవలు, ఫ్యాక్షన్ మర్డర్లు, ఇతరత్రా కారణాలవల్ల జరిగే హత్యలు... ఏం జరిగినా టీడీపీపైన తోసేయడమే! 2014-19లో జగన్ అనుసరించిన విష వ్యూహం ఇదే. చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు.. అది చంద్రబాబు పనేనంటూ ‘నారాసుర రక్త చరిత్ర’ పేరిట తన రోతపత్రికలో నీచ రాతలు రాశారు. కోడికత్తి ఘటన జరిగినప్పుడు కూడా టీడీపీని ఒక హంతక పార్టీలా చూపించేందుకు చేతిలోని అన్ని ప్రచార అస్ర్తాలను యథేచ్ఛగా వాడుకున్నారు. చివరికి.. ఆ తర్వాత ఈ రెండు ఘటనల్లోనూ ఉన్నది వైసీపీకి సంబంధించిన వ్యక్తులే అని తేలడం గమనార్హం. ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి... పూర్తిగా కుదురుకోకముందే మళ్లీ అదే విష వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. వినుకొండలో గ్యాంగ్ వార్ కారణంగా హత్య జరిగితే.. అది చంద్రబాబు ప్రభుత్వమే చేయించిందనే అర్థం వచ్చేలా ‘నారా రూప రాక్షసుడు’ అని తన రోతపత్రికలో విషం చిమ్మారు. వినుకొండలో హతుడూ, హంతకుడూ ఇద్దరూ ఒకప్పుడు వైసీపీ స్థానిక నేత గ్యాంగ్‌లోని సభ్యులే. శుక్రవారం బాధితుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్ పక్కన ఆ గ్యాంగ్ లీడర్ కూడా ఉన్నాడు.
సర్వం విధ్వంసం.. నరమేధమే..
రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు ధ్వంసం చేసి అప్పుల ఊబిలోకి నెట్టేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్... ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కుట్ర చేస్తున్నారని టీడీపీ అనుమానిస్తోంది. అందుకే... చిన్నస్థాయి ఘటనలు, ఇతర కారణాలవల్ల జరిగిన హత్యలకు సైతం రాజకీయ రంగుపులిమి... రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ జాతీయ స్థాయిలో గగ్గోలు పెట్టేందుకు వ్యూహం రచించారని భావిస్తోంది. జగన్ ప్రభుత్వంలో ఇటు అనంతపురం నుంచి అటు శ్రీకాకుళం దాకా.. రక్తంతో తడవని రోజు, దౌర్జన్యం, కక్ష సాధింపులు జరగని సందర్భం ఒక్కటి కూడా లేదు. నంద్యాలలో అబ్దుల్ సలామ్ కుటుంబం వైసీపీ దాష్టీకానికి బలైపోయింది. కడప జిల్లా పొద్దుటూరులో చేనేత సుబ్యయ్య హత్య, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి అరాచకాలు, నెల్లూరు కోర్టులో మాజీ మంత్రి కాకాణి కోసం దొంగతనం, అదే జిల్లాలో బీజేపీ మహిళపై కత్తులతో దాడి, ప్రకాశం జిల్లాలో మైనింగ్ దోపిడీ, బీసీ వర్గానికి చెందిన బాలుడు అమర్నాథ్ గౌడ్ హత్య, పల్నాడులో జై జగన్ అనేందుకు నిరాకరించిన చంద్రయ్య హత్య.. జగన్ అరాచక పాలనకు నిదర్శనంలా నిలిచాయి.
అలాగే, గుంటూరులో రంగనాయకమ్మను సీఐడీ వేధించిన వైనం, రాజధాని మహిళా రైతులపై దాడులు, డీజీపీ ఆఫీసు పక్కనే టీడీపీ కార్యాలయం ధ్వంసం, ఎన్‌ఎ్‌సజీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమే్‌షకు మంత్రి పదవి ఇవ్వడం, విజయవాడలో టీడీపీ కార్పొరేటర్ గాంధీ కన్ను పొడిచేయడం, పట్టాభి ఇంటిపై దాడులకు తెగబడటం, కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి, ఉభ య గోదావరి జిల్లాల్లో దళితుడికి పోలీసు స్టేషన్లో శిరోముండనం, వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్‌ను చంపి శవాన్ని ఇంటికి పార్శిల్ చేయడం, కాకినాడలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలు, దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోని మాజీ సైనికుడిపై పోలీసులతో చేయించిన దాడి.. ఫ్యాక్షన్ పాలనను గుర్తుకు తెచ్చిన ఘటనలు. విశాఖపట్నంలో దళిత వైద్యుడు సుధాకర్‌ను నడిరోడ్డులో రెక్కలు విరిచి పోలీసులతో కొట్టించిన దుర్మార్గం, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సెటిల్మెంట్లు, వైసీపీ మూకల బెదిరింపులు, కబ్జాలు, హత్యలు.. విజయనగరంలో రాముడి విగ్రహ ధ్వంసం, పరిశీలించేందుకు వెళ్లిన చంద్రబాబు, టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టడం గురించి ఢిల్లీలో చెప్పాలంటూ బాధితులు, ప్రజా సంఘాల ప్రతనిధులు జగన్ రెడ్డికి గుర్తు చేస్తున్నారు.
ప్రతిపక్షాలపై అరాచకాలు..
ప్రశ్నించే వ్యక్తులపై అక్రమ కేసులు, బెదిరింపులు.. ప్రతిపక్షాలపై అణచివేతలు, దాడులు.. 2019 జూన్ నుంచి ఇటీవలి వరకూ రాష్ట్రంలో నిత్యకృత్యం. బీసీ నాయకుడు అచ్చెన్నాయుడు నుంచి అనంతపురంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి వరకూ కేసు పెట్టించి జైలుకు పంపే దాకా జగన్ మనసు శాంతించలేదు. అసెంబ్లీలో అడిగి న ప్రతిసారీ తనకు మైకు ఇవ్వలేదన్న అక్కసుతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబాన్ని వేధించిన తీరుతో ఆయన ఏకంగా లోకాన్నే వదిలేశా రు. అశోక్ గజపతిరాజును సైతం తమ కుటుంబం నిర్మించిన ఆలయంలోకి రానీకుండా చేసి పైశాచిక ఆనందాన్ని పొందారు. పులివెందులలో దళిత మహిళ కు మద్దతుగా ఆందోళన చేసినందుకు వంగలపూడి అనిత(ఎ్‌ససీ)పై అట్రాసిటీ కేసు పెట్టించారు. వీటన్నింటికీ పరాకాష్ఠగా చంద్రబాబుపై కేసులు సృష్టించి 50 రోజులకు పైగా జైళ్లో పెట్టించారు. జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులతో అడ్డుకున్నారు.