Share News

ఎస్సార్బీసీ భూములు ఇళ్ల స్థలాలకు ఇవ్వడం సరైందే

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:28 AM

శ్రీశైలం రైట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఆర్‌బీసీ) కోసం సేకరించిన భూములను నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద అర్హులైన వారికి ఇళ్ల పట్టాలుగా ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.

ఎస్సార్బీసీ భూములు ఇళ్ల స్థలాలకు ఇవ్వడం సరైందే

అస్వాభావిక కారణాలతో పథకం అమలును అడ్డుకోలేం: హైకోర్టు

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం రైట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఆర్‌బీసీ) కోసం సేకరించిన భూములను నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద అర్హులైన వారికి ఇళ్ల పట్టాలుగా ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. అధికారులు జారీచేసిన ప్రొసీడింగ్స్‌ సరైనవేనని స్పష్టం చేసింది. అస్వాభావిక కారణాలతో పథకం అమలును అడ్డుకోవడానికి వీల్లేదని పేర్కొంది. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన రాజ్యాంగ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందంది. పరిహారం చెల్లించి భూమిని సేకరించిన తర్వాత ఆ భూమిపై ప్రభుత్వానికే పూర్తి హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. పరిహారం పొందినవారు భూమిపై ఎలాంటి యాజమాన్య హక్కులు, ప్రయోజనాలు కోరలేరని పేర్కొంది. ఎస్‌ఆర్‌బీసీ కోసం సేకరించిన 130.86 ఎకరాల్లో అర్హులైనవారికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు జారీచేసిన ప్రొసీడింగ్స్‌ సరైనవేనని ప్రకటించింది. ఎస్‌ఆర్‌బీసీ కాలువ భూములను నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకానికి ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు పరిష్కరించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ తీర్పు ఇచ్చారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లె మండల పరిధిలోని భానుముక్కల, బాతులూరుపాడు, యనకండ్ల, బనగానపల్లె గ్రామాల్లోని పలు సర్వే నంబర్లలో ఎస్‌ఆర్‌బీసీ కోసం సేకరించిన 130.86 ఎకరాల భూమిలో అర్హులైనవారికి ఇళ్ల పట్టాలివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి గురువారం నిర్ణయాన్ని వెల్లడించారు. ‘ఎస్‌ఆర్‌బీసీ నిర్మించిన దగ్గర నుంచి ఇప్పటివరకు గోరకల్లు రిజర్వాయర్‌ నుంచి అవుకు రిజర్వాయర్‌కు 800 నుంచి 1000 క్యూసెక్కులు మాత్రమే విడుదలైంది. అదికూడా ఆగస్టు-మార్చి నెలల మధ్య మాత్రమే. మిగిలిన సమయంలో కాలువలో నీరుండదు. ఈ సమయంలో తనిఖీలు చేసి కాలువకు మరమ్మతులు చేయవచ్చు. నిర్ధిష్ఠ ప్రయోజనం కోసం సేకరించిన భూములను అందుకోసం ఉపయోగించని పక్షంలో, నిరుపయోగంగా ఉన్న వాటిని వెనక్కి తీసుకొని ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. అస్వాభావిక కారణాలతో పథకం అమలును అడ్డుకోవడానికి వీల్లేదు’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 07:10 AM