Share News

అడ్డుచెప్పడం అసాధ్యం

ABN , Publish Date - Oct 04 , 2024 | 04:00 AM

అభ్యంతరం చెబితే ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకే దిక్కులేని పరిస్థితి. నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేయాల్సిందే.

అడ్డుచెప్పడం అసాధ్యం

నేనేం చెప్పినా ఆగే పరిస్థితి లేదు

వాళ్లు చెప్పినట్లు చేయాల్సిందే

నాడు ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకే దిక్కులేదు

ఇసుక పాలసీ నేను చేయలేదు

కర్త, కర్మ అంతా వాళ్లే

ఫోన్‌ వస్తే.. సంతకం పెట్టాల్సిందే

చేతిరాత వే బిల్లులు పెద్దల పనే

దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు

ఏసీబీ కస్టడీలో గనుల వెంకటరెడ్డి

అమరావతి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘అభ్యంతరం చెబితే ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకే దిక్కులేని పరిస్థితి. నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేయాల్సిందే. వాళ్ల మాటకు అడ్డు చెప్పడం కుదరని పని. వద్దన్నా ఆగే పరిస్థితి లేదు. ఇసుక దందాలో కర్మ, కర్త వాళ్లే’ అని గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వెంకటరెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. ‘అన్నీ తెలిసి నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు!’ అని ఏసీబీ అధికారులతో అన్నట్లు సమాచారం. సహజ వనరు ఇసుకలో వేలకోట్లు ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టి తాడేపల్లి ప్యాలె్‌సకు ప్రతిఫలాలు పంపించిన వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు విచారించారు. కోర్టు 3రోజుల కస్టడీకి అనుమతించడంతో గురువారం ఉదయం విజయవాడ జైలు నుంచి ఆయన్ను కస్టడీకి తీసుకున్నారు. ఏసీబీ కార్యాలయంలో ప్రశ్నించారు. ఇసుక, ఇతర సహజ సంపద తవ్వకాల్లో మీపై వచ్చిన ఆరోపణలకు మీ సమాధానం ఏంటి? అనే ప్రశ్నతో విచారణ మొదలు పెట్టారు. ‘అంతా మీకు తెలుసు. ఫైళ్లన్నీ పరిశీలించారు. ఇసుక రేవుల్లో తనిఖీలు చేశారు. మైన్స్‌, రెవెన్యూ సిబ్బందిని విచారించారు. ఇక చెప్పేది ఏముంది’ అని ఆయన బదులిచ్చినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ఒకే సంస్థకు కట్టబెట్టే ఒప్పందం ఎలా జరిగింది? ఎవరి ఒత్తిడైనా ఉందా? అని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ‘నేను క్రియను మాత్రమే. కర్త, కర్మ నేను కానే కాదు. అవన్నీ మీకు తెలిసిందే. నేను ఏమి చెప్పగలను’ అని చెప్పారు. పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా, నిబంధనలు అనుమతించని చేతిరాత వే బిల్లులను ఎలా స్వీకరించారు? కాంట్రాక్టరు సొంతంగా ముద్రించుకున్న వాటిని మీరెందుకు ఆమోదించారు? ఇదంతా మీ చేతిలో పనే కదా? అని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.

‘పని నా చేతితోనే జరిగింది కానీ పని చేయించింది పెద్ద వాళ్లు. నేను ఇలా బలైపోతానని అప్పుడు ఊహించి ఉంటే అడ్డు చెప్పేవాడిని. ఆ పని చేయకపోవడంతోనే ఈ తిప్పలు’’ అని బదులిచ్చారు. కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుకున్నా ఎందుకు అడ్డుకోలేదని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ‘అడ్డు చెప్పే అవకాశమే ఎవ్వరికీ ఉండదు సర్‌. పెద్ద పెద్ద ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకు అంత ధైర్యం లేదు. నేనెంత?’ అని వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు. ప్రతి పదిహేను రోజులకు చెల్లించాల్సిన మొత్తాన్ని నెలల తరబడి ఆపినా ఎందుకు నోటీసు ఇవ్వలేదని విచారణాధికారులు ప్రశ్నించారు. ‘ఎవరు తవ్వారో, ఎవరి పేరుతో బిల్లులు ఇస్తున్నారో, ఎవరు ఇసుక తీసుకెళ్లి పోతున్నారో అడిగే సాహసం చేయలేని నేను ఎవరికి నోటీసు ఇవ్వగలను?’ అని చెప్పినట్టు తెలిసింది. ప్రభుత్వానికి 850 కోట్లు బకాయి పడ్డ కాంట్రాక్టు సంస్థకు ఎన్‌వోసీ ఇవ్వడం తప్పు అని అనిపించలేదా? కనీసం నోట్‌ ఫైల్‌ లేకుండా ఎవరి ఆదేశాల మేరకు ఇంత అడ్డగోలుగా ఇచ్చేశారని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ‘వాళ్లు వాళ్లు మాట్లాడుకుంటారు. నాకు ఫోన్‌ వస్తుంది. సంతకం పెట్టాల్సిందే. అంతకు మించి ఏమీ చెప్పరు, ఏదీ మాట్లాడరు. మీకు (ఏసీబీ) అంతా తెలుసు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు’ అంటూ దర్యాప్తు అధికారులకు ఆయన దండం పెట్టినట్లు తెలిసింది. విచారణ సందర్భంగా మధ్య మధ్యలో కొన్ని డాక్యుమెంట్లు చూపించి వాటిలో అనుమానాలను ఏసీబీ అధికారులు నివృత్తి చేసుకున్నట్లు తెలిసింది. మరో రెండు రోజుల పాటు విచారణలో మరిన్ని ప్రశ్నలు సంధించి అసలు సూత్రధారులు, కుట్రదారులు, లబ్ధిదారులకు ఉచ్చు బిగించేందుకు ఏసీబీ సిద్ధమైనట్లు సమాచారం.

Updated Date - Oct 04 , 2024 | 04:00 AM