Share News

స్టీల్‌ ప్లాంట్‌ ప్రయోజనాలు పరిరక్షించడం ముఖ్యం

ABN , Publish Date - Apr 26 , 2024 | 04:54 AM

గంగవరం అదానీ పోర్టులో నిర్వాసిత కార్మికుల సమ్మెతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా నిలిచిపోయిందని, సమస్యకు పరిష్కారం కనుగొనేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.

స్టీల్‌ ప్లాంట్‌ ప్రయోజనాలు పరిరక్షించడం ముఖ్యం

బొగ్గు నిల్వల ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి

అదానీ పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం

బొగ్గు సరఫరా లేక ప్లాంట్‌ మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరం

నిర్వాసిత కార్మికుల సమ్మె పరిష్కారానికి ఉన్నతాధికారులు చొరవ చూపాల్సింది

సీఎస్‌ నుంచి వివరాలు తీసుకుని మా ముందుంచండి

ప్రభుత్వ న్యాయవాదికి కోర్టు సూచన

సీఎస్‌, పోలీసు కమిషనర్‌ను ప్రతివాదులుగా చేర్చాలని రిజిస్ట్రీకి నిర్దేశం

విచారణ నేటికి వాయిదా

అమరావతి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): గంగవరం అదానీ పోర్టులో నిర్వాసిత కార్మికుల సమ్మెతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా నిలిచిపోయిందని, సమస్యకు పరిష్కారం కనుగొనేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రయోజనాలు పరిరక్షించడం ముఖ్యమని వ్యాఖ్యానించింది. కర్మాగారానికి అవసరమైన బొగ్గు సరఫరా చేసేందుకు వీలుగా గంగవరం పోర్టులో అన్‌లోడ్‌ చేయకుండా ఉన్న కోకింగ్‌ కోల్‌ ఓడను విశాఖ పోర్టుకు మళ్లించాలని అదానీ పోర్టు యాజమాన్యాన్ని ఆదేశించింది. బొగ్గు సరఫరా లేక స్టీల్‌ ప్లాంట్‌ మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. పోర్టు నిర్వాసిత కార్మికుల సమ్మె నేపఽథ్యంలో సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు చొరవ చూపించి ఉండాల్సిందని పేర్కొంది. జిల్లా కలెక్టర్‌ ఎన్నికల విధుల్లో తీరికలేకుండా ఉన్నానని చెప్పడంపై విస్మయం వ్యక్తం చేసింది. బొగ్గు సరఫరా సమస్యకు పరిష్కారం చూపాలని ప్లాంట్‌ సీఎండీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖరాశారని గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై సీఎస్‌ నుంచి వివరాలు తీసుకుని తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. ఈ వ్యాజ్యంలో సీఎస్‌, విశాఖ పోలీసు కమిషనర్‌ను ప్రతివాదులుగా చేర్చిన తర్వాతే వారికి తగిన ఆదేశాలు ఇవ్వగలమని పేర్కొంది. వారిద్దరినీ ప్రతివాదులుగా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య గురువారం ఆదేశాలిచ్చారు. నిర్వాసిత కార్మికుల సమ్మె కారణంగా గంగవరం పోర్టు నుంచి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు బొగ్గు సరఫరాలో ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు తీసుకునేలా విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాలని కోరుతూ స్టీల్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె.వెంకట దుర్గాప్రసాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది అంబటి శ్రీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. గంగవరం పోర్టులో కార్మికుల సమ్మెతో స్టీల్‌ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా నిలిచిపోయిందన్నారు. బొగ్గు కొరతతో ప్లాంట్‌లోని మూడు ఫర్నే్‌సలలో ఒకటి మాత్రమే పనిచేస్తోందని.. మిగతా రెండు దెబ్బతిన్నాయని తెలిపారు. తిరిగి వాటిని ప్రారంభించాలంటే రూ.వేల కోట్లు ఖర్చవుతాయని.. ప్రస్తుతం ఉన్న బొగ్గు నిల్వలు కూడా కరిగిపోతే ప్లాంట్‌ మూతపడుతుందని.. వేల మంది కార్మికులు, ఉద్యోగుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... పోర్టు యాజమాన్యం, కార్మికుల మధ్య చర్చలు జరిగాయని.. అక్కడ జరిగిన ఒప్పందం ప్రకారం కార్మికులకు ప్రయోజనాలు కల్పించాలని పోర్టు యాజమాన్యానికి కలెక్టర్‌ సూచించారని తెలిపారు. కలెక్టర్‌ ప్రస్తుతం ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా ఉన్నారన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 04:54 AM