చెరువులను నింపకపోవడం సిగ్గుచేటు
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:03 PM
ఉమ్మడి జిల్లాలో 77 చెరువులను, అలాగే రిజర్వాయర్లను నింపలేకపోవడం సిగ్గుచేటని, వరద నీళ్లు సుమారు 2000 టీఎంసీలు వస్తే కూడా నింపడంలో విఫలమయ్యారని జడ్పీ చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి ఇరిగేషన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇరిగేషన అధికారులపై జడ్పీ చైర్మన ఆగ్రహం
ముగిసిన జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు
కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో 77 చెరువులను, అలాగే రిజర్వాయర్లను నింపలేకపోవడం సిగ్గుచేటని, వరద నీళ్లు సుమారు 2000 టీఎంసీలు వస్తే కూడా నింపడంలో విఫలమయ్యారని జడ్పీ చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి ఇరిగేషన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నగరంలోని జడ్పీ మినీ సమావేశం భవనంలో ఏడు స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. చైర్మన అధ్యక్షత వహించగా సీఈవో జి.నాసరరెడ్డి పర్యవేక్షించారు. జడ్పీ చైర్మన మాట్లాడుతూ కేవలం 1.50 టీఎంసీల నీటితో 77 చెరువులను నింపే ఆస్కారం ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలోని మేజర్ పంచాయతీలకు ఆదాయ మార్గాలు పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. నాసిరకం విత్తనాలను అరికట్టాలన్నారు. గ్రామాల్లో కూలీలు ఖాళీగా ఉన్నప్పుడు ఉపాధి హమీ పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేజీబీవీలో సీట్ల సంఖ్య పెంచే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బారెడ్డి, జడ్పీటీసీలు దివ్య, సుధాకర్‌రెడ్డి, సుంకన్న, పోచా జగదీశ్వరరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, అనసూయమ్మ, ఉమ్మడి జిల్లాల అఽధికారులు పాల్గొన్నారు.
జడ్పీటీసీలు ఏమన్నారంటే...
పర్మినెంటు పంచాయతీ కార్యదర్శులను నియమించాలని వెల్దుర్తి, ప్యాపిలి జడ్పీటీసీలు కోరారు. కొత్తపల్లి మండలం ఎర్రమఠం సచివాలయంలో సిబ్బంది కొరత ఉందని జడ్పీటీసీ అన్నారు. రైతులను దృష్టిలో ఉంచుకుని ఉపాధి హమీ పనులు జనవరి 15 తర్వాత ప్రారంభించాలని ప్యాపిలి జడ్పీటీసీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఓర్వకల్లు ఆసుపత్రిలో స్కానింగ్, ఎక్స్‌రే యంత్రాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జడ్పీటీసీ చెప్పారు. మిడ్తూరు-గార్గేయపురం రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించలేదని, నందికొట్కూరు-పగిడ్యాల ప్యాచ పనులు ఇంకా ప్రారంభంకాకపోవడం సరికాదని జుపాడుబంగ్లా జడ్పీటీసీ అన్నారు. మహానంది నుంచి గాజులపల్లె రోడ్డు వేయాలని జడ్పీటీసీ, మద్దికెర నుంచి గుంతకల్లు మధ్య కసాపురం వరకు గత ప్రభుత్వంలోనే టెండరు వేసిన రోడ్డు పనులు ప్రారంభంకాలేదని జడ్పీటీసీ, గడివేముల నుంచి మంచాలకట్ట రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిందని తక్షణమే మరమ్మతులు చేపట్టాలని జడ్పీటీసీ కోరారు.
కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కృషి
- బస్తిపాటి నాగరాజు, కర్నూలు ఎంపీ
కర్నూలు పార్లమెంటు పరిధిలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తే కేంద్ర మంత్రితో సంప్రదించి వాటిని మంజూరు చేయిస్తాను. పంచలింగాల గ్రామంలో మైనార్టీ పాఠశాల ఇతర ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. ముస్లిం స్మశాశాలకు ప్రహరీ నిర్మించాలి. పాఠశాలల్లో సీట్ల సంఖ్య పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. యునాని మెడిసిన ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర మంత్రితో చర్చిస్తాను.
ఫ కమ్యూనిటీ భవన నిర్మాణాల్లో జాప్యం వద్దు
- గిత్తా జయసూర్య, నందికొట్కూరు ఎమ్మెల్యే
నందికొట్కూరు నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాల నిర్మాణంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఏవైనా అడిగితే సైట్ దొరకలేదని సమాధానం చెబుతున్నారు. అధికారులు సొంత నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు. 2017-18 సంవత్సరంలో నియోజకవర్గంలో 13 అంగనవాడీ కేంద్రాలు మంజూరయ్యాయి. అవి ఏ దశంలో ఉన్నాయో వివరాలు ఇవ్వాలి. ఉమ్మడి జిల్లాలోని సాంఘిక సంక్షేమ హస్టళ్లలో అవకతవకలు జరుగుతున్నాయి. ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయాలి.