Share News

ఇదేం కక్కుర్తి జగన్‌ మామా?

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:06 AM

ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేయడం చూసుంటారు... కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపేయడమూ చూసే ఉంటారు...

ఇదేం కక్కుర్తి జగన్‌ మామా?

అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేయడం చూసుంటారు... కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపేయడమూ చూసే ఉంటారు... కానీ కళాశాలల విద్యార్థులతో ఒక్కరోజు చేయించుకున్న పనికి ఇవ్వాల్సిన అలవెన్స్‌లు ఆపేయడం ఎక్కడైనా చూశారా?.. విద్యార్థులే కదా.. వారికి డబ్బులు ఎగ్గొడితే ఎవరడుగుతారన్న ధోరణిలో ప్రభుత్వం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాలివీ... జాతీయ విద్యా పరిశోధన మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) ఆదేశాలతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ గత నవంబరులో 3, 6, 9 తరగతుల విద్యార్థుల్లో భాషా సబ్జెక్టులు, గణితం, ఈవీఎస్‌ సబ్జెక్టులపై అవగాహనను తెలుసుకునే రాష్ట్రవ్యాప్తంగా ‘స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే’ నిర్వహించింది. స్థానికంగా ఉన్న కాలేజీల నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు ఒక్కో మండలానికి సగటున 50 మంది.. వెరసి 20వేల మంది ఈ సర్వే చేశారు. వీరికి అలవెన్సు కింద రూ.600 ఇస్తామని ఎంఈవోల ద్వారా ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అందరికీ కలిపి సుమారు రూ.2కోట్ల లోపు చెల్లించాల్సి ఉంటుంది, కానీ.. మూడు నెలలైనా ఆ ఊసే ఎత్తడంలేదు. విద్యా రంగానికి వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకొనే ప్రభుత్వం చిన్నపాటి అలవెన్స్‌ల విషయంలో కక్కుర్తిగా వ్యవహరించడంపై విద్యార్థుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు డబ్బులు అడుగుతున్నారని, నిధులు ఇవ్వాలని ఎంఈవోలు పైఅధికారులను కోరినా ఉన్నతాధికారులు స్పందించడం లేదు.

ఇక అవేం ఇస్తారు?

మరోవైపు ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఎక్స్‌పర్ట్స్‌ పేరుతో ప్రభుత్వం ఇటీవల కొత్త కార్యక్రమం ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించేందుకు సమీపంలోని ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులను ఇన్‌టర్న్‌షిప్‌ కింద వినియోగించుకోవడం దీని ఉద్దేశం. అలా పాఠశాలల్లో ఫ్యూచర్‌ స్కిల్స్‌పై ఇన్‌టర్న్‌షిప్‌ కింద అవగాహన కల్పించినంత కాలం నెలకు రూ.12వేలు పారితోషికంగా ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇలా ఒక్కో ఇంజనీరింగ్‌ విద్యార్థికి మూడు పాఠశాలలను అప్పగిస్తారు. అయితే ఒక్కరోజు అలవెన్స్‌ డబ్బులే ఇవ్వని ప్రభుత్వం ఇన్‌టర్న్‌షిప్‌ చేస్తే పారితోషికం ఇస్తుందా? అని విద్యార్థులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. డబ్బులివ్వకపోతే సమయం వృథా అయినట్లేనని భావిస్తున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 04:06 AM