Share News

సభ్యత, సంస్కారం ఉన్నాయా?

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:47 AM

‘సీఎం స్థాయిలో ఉన్న జగన్‌ బహిరంగ సభ పెట్టి.. వేల మంది మగవాళ్లు ఉంటే..

సభ్యత, సంస్కారం ఉన్నాయా?

నేను కట్టుకున్న చీర గురించి మగవాళ్ల ముందు మాట్లాడతావా?.. జగన్‌పై షర్మిల ఫైర్‌

సొంత చెల్లి అన్న ఇంగితం ఉండొద్దా?.. ఇంత దిగజారుడా?

పసుపు చీర కట్టుకోకూడదా?.. నీ పత్రిక పసుపు రంగులో లేదా?

బాబు వద్ద మోకరిల్లింది నేను కాదు.. నువ్వే మోదీ వద్ద మోకరిల్లావు

నీ కేసుల చార్జిషీటులో వైఎస్‌ పేరును చేర్పించింది నీ లాయర్‌ కాదా?

సీఎంకు పీసీసీ అధ్యక్షురాలి స్ట్రాంగ్‌ కౌంటర్‌

పులివెందులలో వివేకా గురించి ఒక్క ముక్క మంచిగా మాట్లాడావా?

రాజశేఖర్‌రెడ్డి తమ్ముడని అన్నావా?

చివరి నిమిషందాకా వైసీపీలోనే ఉన్నాడని ఎందుకు చెప్పలేదు?

అవినాశ్‌ భవిష్యత్‌ను మేమెందుకు పాడుచేస్తాం?

వివేకా వద్దన్నా ఎంపీ టికెట్‌ ఇచ్చినప్పుడు మేం కాదనలేదే!

గుంటూరు/విజయవాడ, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ‘సీఎం స్థాయిలో ఉన్న జగన్‌ బహిరంగ సభ పెట్టి.. వేల మంది మగవాళ్లు ఉంటే.. నేను కట్టుకున్న చీర గురించి మాట్లాడాడు’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. మాట్లాడుతున్నది సొంత చెల్లెలి గురించి అన్న ఇంగితం కూడా లే కుండా తన వంటిపై ఉన్న బట్టల గురించి ప్రస్తావించారంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం గుంటూరు, విజయవాడ ల్లో జరిగిన ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. పులివెందులలో తనపై జగన్‌ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘నేను పసుపు చీర కట్టుకొన్నానని అవహేళనగా మాట్లాడారు. ఏం.. పసుపు చీర కట్టుకోకూడదా? చంద్రబాబు ఏమైనా పసుపు రంగు కొన్నారా? జగన్‌ పత్రికలో పసుపు రం గు ఉంటుంది. దానికి వైఎస్‌ ఆనాడు చెప్పిన మాట.. పసుపు అంటే మంగళకరమైన రం గు. అది టీడీపీది కాదని పెట్టించారు’ అని తెలిపారు. సొంత చెల్లి చీర గురించి మాట్లాడుతున్న వీరికి సభ్యత, సంస్కారం ఉన్నా యా అని విరుచుకుపడ్డారు.. ‘నేను చంద్రబాబు ముందు మోకరిల్లానని, ఆయన ఇచ్చి న స్ర్కిప్టును చదువుతున్నానన్నారు. మక్కీకి మక్కీ స్ర్కిప్టు చదువుతున్నది జగన్‌ కాదా? నాకేం అవసరం చంద్రబాబుకు మోకరిల్లడానికి! నాది రాజశేఖర్‌రెడ్డి రక్తం. అందుకే నా గురించి ఏమి మాట్లాడుతున్నా.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నా మొండి గా కొట్లాడుతున్నా. ఈ రోజున బీజేపీ, మోదీ ముందు మోకరిల్లింది జగన్‌ కాదా? పోలవరం, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఢిల్లీ వెళ్లినప్పుడు సమస్యల గురించి కాకుండా అవినాశ్‌రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఆయన్ను ఎక్కడ అరెస్టు చేస్తారో, బెయిల్‌ రాదోనని ఆదుర్దాపడుతున్నారు. జగన్‌ మోదీకి దత్త పుత్రుడని బీజేపీ నేతలే చెబుతున్నారు. ముమ్మాటికీ మోదీకి జగన్‌ వారసుడే. బీజేపీని వ్యతిరేకించిన నాయకుడు వైఎస్‌. అలాంటిది బీజేపీకి మోకరిల్లుతున్నారంటే ఈయన మోదీకి వారసుడు. రాజశేఖర్‌రెడ్డికి కాదు. మణిపూర్‌ లో తన సొంత మతస్తులైన క్రైస్తవులను చంపుతుంటే పార్లమెంటులో బీజేపీకి అండగా నిలిచారు. అని మండిపడ్డారు.


దేవుడు మీకు ఇంగితం ఇవ్వలేదా?

సీఎం జగన్‌ ఈ రోజున పులివెందుల సభలో వివేకానందరెడ్డి ప్రస్తావన చేశారు. ఆయన గురించి ఒక్క మంచి మాట కూడా నోటి వెంట రాలేదు. వివేకానందరెడ్డికి రెండో పెళ్లి అయిందట. ఇంకో సంతానం ఉందట! అంతేతప్ప.. వివేకానందరెడ్డి ఒక ప్రజానాయకుడని గానీ.. ఎవరైనా సమస్యతో వస్తే ఉత్త చేతులతో పంపడని గానీ.. రాజశేఖర్‌రెడ్డి తమ్ముడని గానీ... ఆఖరి నిమిషం వరకు వైసీపీ కోసమే పని చేశారని గానీ ఒక్క మాటయినా జగన్‌ నోట్లో నుంచి రాలేదంటే ఎంత ఆశ్చర్యం! అవినాశ్‌రెడ్డి అమాయకుడు, చిన్నవాడంట! ఆయన భవిష్యత్‌ను మేం నాశనం చేస్తున్నామని జగన్‌ మాట్లాడుతున్నారు. అతడి భవిష్యత్‌ను పాడు చేసేవాళ్లమే అయితే మీరు ఎంపీగా నిలబెట్టినప్పుడు.. వివేకా వద్దని చెప్పినా మేమెవరం కాదనలేదే! వివేకాను చంపిన రోజునే అవినాశ్‌ చంపాడని చెప్పలేదే! అవినాశ్‌ మంచివాడని నమ్ముతున్నాను.. అందుకే ఎంపీ టికెట్‌ ఇచ్చానని జగన్‌ అంటున్నారు. ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు? మీకు దేవుడు ఇంగితం ఇవ్వలేదా? మీకు ఆలోచించే శక్తి లేదా? సీబీఐ అన్ని ఆధారాలు చూపిస్తోంది కదా! చంపించిన వారు, చంపినవారి గూగుల్‌ టేక్‌ అవుట్స్‌ మ్యాచ్‌ అవుతున్నాయి. లావాదేవీలు జరిగాయి. అడ్వాన్స్‌లు తీసుకున్నారని సీబీఐ చెబుతున్నా ఎందుకు అవినాశ్‌ను ఇంకా నమ్ముతున్నారు? అన్నీ తెలిసి కూడా కాపాడుతున్నారంటే మీకు ఏమి అవసరం ఉందో చెప్పాలి. అవినాశ్‌ను నిందితుడి గా సీబీఐ చేర్చినా ఇన్ని రోజులు ఎందుకు కాపాడారు.. మళ్లీ ఎందుకు టికెట్‌ ఇచ్చారో చెప్పాలి. వివేకాను గొడ్డలితో నరికి నరికి చంపితే మెదడు, ఎముకలు బయటకు వచ్చి ఇల్లంతా రక్తం ఉంటే జగన్‌ చానల్‌లో గుండెపోటుతో చనిపోయారని ఎందుకు ప్రసారం చేశారో చెప్పాలి. అఽధికారంలో లేనప్పుడు సీబీఐ ఎంక్వయిరీని కోరి.. అధికారంలోకి వచ్చాక ఎందుకు వద్దన్నారో చెప్పాలి. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. అది చూసి కూడా మీ మనస్సు చలించలేదంటే మీ ఛాతీలో ఉంది గుండే.. బండా?

జగన్‌కు ఓటేస్తే డ్రెయినేజీలో వేసినట్లే..

జగన్‌కు ఓటు వేస్తే అది డ్రెయినేజీలో వేసినట్లే. పోలవరం, ప్రత్యేక హోదా, రాజధాని కోసం కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలి. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు నిర్మిస్తానన్నాడు. కనీసం ఒక్కదాన్ని అయినా నిర్మించా డా? ఏమీ లేకుండా ఆంధ్రా చేతిలో చిప్ప మాత్రం పెట్టాడు. తెలంగాణకు హైదరాబాద్‌ ఉంటే, కర్ణాటకకు బెంగళూరు ఉంది. మన రాష్ట్రానికి రాజధాని ఎక్కడుంది? అన్నారు.


40 మంది స్టార్‌ క్యాంపెయినర్లు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సహా 40 మంది స్టార్‌ క్యాంపెయినర్లను ఎఐసీసీ జనరల్‌ సెక్రటరీ ముకుల్‌ వాస్నిక్‌ గురువారం ప్రకటించారు. వీరిలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌, మాణిక్కం ఠాగూర్‌, వైఎస్‌ షర్మిల, సిద్దరామయ్య, రేవంత్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమకుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.

అసెంబ్లీ సాక్షిగా నానా తిట్లు తిట్టిన బొత్స సత్యనారాయణ జగన్‌కు తండ్రితో సమానమట. ఆ రోజున వైఎస్‌ విజయలక్ష్మి కంటతడి పెట్టుకున్నారు. అది కూడా గుర్తుకు రావడంలేదా? విడదల రజని, రోజా ఈయనకు చెల్లెళ్లతో సమానమంట!

వీళ్లేమో వివేకా హత్య గురించి మాట్లాడొచ్చంట.. మేం మాత్రం మాట్లాడకూడదని కోర్టు నుంచి ఆర్డర్‌ తీసుకొచ్చారు. ఇది న్యాయమా... ధర్మమా?

- షర్మిల

వైఎస్‌ పేరు చేర్చింది జగన్‌ లాయరే

జగన్‌ కేసుల చార్జిషీటులో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరును చేర్చింది సీబీఐ, కాంగ్రెస్‌ కాదు. ఆ పనిచేసింది ఆయన లాయరే. వైఎస్‌ పేరు లేకుంటే ఆ కేసుల్లో నుంచి జగన్‌ బయటపడరని వైఎస్‌ పేరును స్వయంగా సుధాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేసి చేర్పించారు. అందుకు ప్రతిఫలంగా వైసీపీ అధికారంలోకి రాగానే అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పదవి ఇచ్చారు. ఇది వాస్తవం కాదా? మమ్మల్ని తిట్టిపోయడం కాదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

Updated Date - Apr 26 , 2024 | 05:47 AM