Share News

హోదాపై నోరు మూతబడిందేం?

ABN , Publish Date - Mar 14 , 2024 | 04:34 AM

‘‘25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్‌.. కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు. హోదాపై ఎందుకు మౌనంగా ఉన్నారు?’’ అని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల నిలదీశారు. ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ సమాధానం చెపాల్సిందేనన్నారు. గతంలో ప్రత్యేక హోదా మీద

హోదాపై నోరు మూతబడిందేం?

కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు

జగన్‌ సమాధానం చెప్పాల్సిందే : షర్మిల

ఢిల్లీలో కాంగ్రెస్‌ స్ర్కీనింగ్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ‘‘25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్‌.. కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు. హోదాపై ఎందుకు మౌనంగా ఉన్నారు?’’ అని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల నిలదీశారు. ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ సమాధానం చెపాల్సిందేనన్నారు. గతంలో ప్రత్యేక హోదా మీద మాట్లాడిన సీఎం జగన్‌ ఇప్పుడు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ బలంగా నిలబడుతుందని షర్మిల తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఏపీలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ 1500 మంది నుంచి దరఖాస్తులు రావడం రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలంగా ఉందనడానికి నిదర్శనమని తెలిపారు. ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయాల్సిందేనని చెప్పారు. పార్టీ గెలుపు కోసం నేతలు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం, సీపీఐతో చర్చలు జరుపుతున్నామని, అందరినీ కలుపుకొని పోతామన్నారు.

సుదీర్ఘ చర్చలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులపై కాంగ్రెస్‌ పార్టీ ఏపీ స్ర్కీనింగ్‌ కమిటీ చర్చించింది. కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకునే అంశాలపైనా దృష్టి సారించింది. గత ఎన్నికల్లో సాధించిన ఓటు బ్యాంకును ఈసారి డబుల్‌ డిజిట్‌ దాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల బరిలో బలమైన అభ్యర్థులను నిలిపి సాధ్యమైనన్ని సీట్లలో గెలిచే దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది. స్ర్కీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో వైస్‌ చైర్మన్‌ సూరజ్‌ హెగ్డే, ఏపీ వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌, ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 04:34 AM