Share News

ఆధిపత్య పోరే ముంచిందా?

ABN , Publish Date - Aug 24 , 2024 | 05:23 AM

అచ్యుతాపురం సెజ్‌లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరగడానికి సంస్థ భాగస్వాముల మధ్య విభేదాలే కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది.

ఆధిపత్య పోరే ముంచిందా?

ఎసెన్షియా భాగస్వాముల మధ్య విభేదాలు

74% వాటా కొన్న డెక్కన్‌ కెమికల్స్‌కు నో ఎంట్రీ

ట్రైబ్యునల్‌ తీర్పునూ ఖాతరు చేయని నిర్వాహకులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అచ్యుతాపురం సెజ్‌లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరగడానికి సంస్థ భాగస్వాముల మధ్య విభేదాలే కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. అమెరికాలో స్థిరపడిన ఆంధ్రుడే ఈ కంపెనీ వ్యవస్థాపకుడు. ఆయన పేరు పెండ్రి యాదగిరిరెడ్డి. తానే సీఈఓగా వ్యవహరిస్తున్నారు. కోరాడ శ్రీనివాసరావు సీఎ్‌ఫఓగా ఉన్నారు. పెండ్రి కిరణ్‌రెడ్డి, దండు చక్రధర్‌, అజిత్‌ అలెగ్జాండర్‌, వివేక్‌ వసంత్‌ డైరెక్టర్లు. ఈ కంపెనీలో 74 శాతం వాటాను డెక్కన్‌ కెమికల్స్‌ సంస్థ ఇటీవల కొనుగోలు చేసింది. అయితే వారిని సంస్థ ఆవరణలోకి కూడా రానీయడం లేదు. దీనిపై డెక్కన్‌ ప్రతినిధులు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ ఆదేశాలను కూడా ఎసెన్షియా యాజమాన్యం పక్కన పెట్టేసింది. తమకు కంపెనీలో ఉన్న వాటా ప్రకారం చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ)ను నియమించుకునే హక్కుందని, కానీ అసలు పరిశ్రమ ఆవరణలోకే రానీయడం లేదని పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డెక్కన్‌ కెమికల్స్‌ ప్రతినిధులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కంపెనీలో ఏమి జరుగుతున్నదో తమకు తెలియదని, నిర్వహణలో భాగస్వామ్యం కల్పించడం లేదని వారు ఆరోపించారు. అంటే తాజాగా జరిగిన ప్రమాదానికి, తమకు ఎటువంటి సంబంధం లేదని వారు పరోక్షంగా తెలియజేశారు. మరోవైపు ఎసెన్షియాకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న యాదగిరి రెడ్డి ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తరువాత కూడా సంస్థ తరఫున ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. ప్రభుత్వ అధికారులకు కూడా అందుబాటులోకి రాలేదు. ఆయన విశాఖపట్నంలోనే ఉన్నారని ప్రభుత్వ అధికారులకు సమాచారం అందింది. సంస్థ నిర్వహణ కోసం జరుగుతున్న ఆధిపత్య పోరులో పడి అసలు అక్కడ వ్యవహారాలు సరిగ్గా జరుగుతున్నాయా? లేదా? అనే విషయాలను పట్టించుకోలేదని, థర్డ్‌ పార్టీ ఇన్‌స్పెక్షన్‌లో లోపాలు వెల్లడించినా వాటి గురించి పట్టించుకోలేదనే వాదన వినిపిస్తోంది. ఈ ఘటనపై రాంబిల్లి పోలీస్‌స్టేషన్‌లో తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు 106(1), 125(ఏ), 125(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

బాధిత కుటుంబానికి రూ.కోటి

పొందూరు, ఆగస్టు 23: ఎసెన్షియా ఫార్మా కంపెనీ బాధిత కుటుంబాలను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మృతుల కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తోంది. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన హంస ప్రశాంత్‌ కుటుంబానికి తహసీల్దార్‌ రమేశ్‌ రూ.కోటి చెక్కును అందజేశారు. ప్రశాంత్‌ భార్య జ్యోతికి చెక్‌ అందజేశామని ఆయన తెలిపారు.

Updated Date - Aug 24 , 2024 | 05:59 AM