Share News

కుప్పం నీటిపై జగన్‌ వంచన!

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:03 AM

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తిచేయకుండానే ఆ నియోజకవర్గ ప్రజలకు నీరిస్తున్నట్లు సీఎం జగన్మోహన్‌రెడ్డి వంచనకు పాల్పడుతున్నారని సాగుునీటి రంగ నిపుణుడు టి.లక్ష్మీనారాయణ విమర్శించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా

కుప్పం నీటిపై జగన్‌ వంచన!

బ్రాంచ్‌ కాలువ పూర్తికానే లేదు

350 ఎకరాల ఆయకట్టు ఉన్న 4 చెరువులకు కొద్దిపాటి నీటిని లాంఛనంగా ఇచ్చారు

సాగునీటి నిపుణుడు లక్ష్మీనారాయణ ధ్వజం

ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ

అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తిచేయకుండానే ఆ నియోజకవర్గ ప్రజలకు నీరిస్తున్నట్లు సీఎం జగన్మోహన్‌రెడ్డి వంచనకు పాల్పడుతున్నారని సాగుునీటి రంగ నిపుణుడు టి.లక్ష్మీనారాయణ విమర్శించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కుప్పానికి సాగు, తాగునీటిని తరలించే ఏర్పాట్లు చేశారా అని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు బహిరంగ లేఖ రాశారు. కరవుపీడిత రాయలసీమలో మెట్టప్రాంతాలకు కృష్ణా నది వరద జలాలను శ్రీశైలం జలాశయం నుంచి తరలించడానికి.. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల గ్రామ సమీపంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా 40 టీఎంస్చీను 120 రోజుల్లో తరలించి 6,02,500 ఎకరాలకు సాగునీరందించేలా హంద్రీ-నీవా సుజల స్రవంతి చేపట్టారని గుర్తుచేశారు.కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ఈ ప్రాజెక్టు వ్యవస్థ చివరి భాగంలో ఉందన్నారు. హంద్రీ-నీవా ప్రధాన కాలువ 400.50 కిలోమీటర్ల వద్ద నుంచి పుంగనూరు ఉపకాలువను నిర్మించాల్సి ఉందని.. ఆ పుంగనూరు ఉపకాలువ 207.8 కిలోమీటర్ల వద్ద నుంచి కుప్పం కెనాల్‌ నిర్మించాల్సి ఉందన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా వరద జలాలు మొత్తం 732 కిలోమీటర్లు ప్రయాణించాలని.. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచకుండా ఎలా చేరతాయని నిలదీశారు. కుప్పం కెనాల్‌ ప్రవాహ సామర్థ్యం 216 క్యూసెక్కులేనని గుర్తుచేశారు. దీనిపై మూడు ఎత్తిపోతల పథకాలు నిర్మించి, వాటి ద్వారా 110 చెరువుల కింద ఉన్న 6300 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని, ప్రజలకు తాగునీటిని అందించాల్సి ఉందన్నారు. ఈ లక్ష్యం త్వరితగతిన సాకారం కావాలని ప్రజలు ఏళ్లతరబడి కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నారని తెలిపారు. కుప్పం కెనాల్‌ అంచనా వ్యయం రూ.2015-16 ధరల ప్రకారం రూ.293.11 కోట్లు కాగా.. రూ.560.29 కోట్లకు ఎగబాకిందని, 2019 ఏప్రిల్‌ నాటికి ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.460.88 కోట్లని , వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి రూ.99.41 కోట్లు వ్యయం చేస్తే చాలని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని తెలిపారు. సోమవారం కుప్పం కెనాల్‌ 70వ కిలోమీటరు నుంచి కేవలం 350 ఎకరాల ఆయకట్టు ఉన్న నాలుగు చెరువులకు కొద్దిపాటి నీటిని లాంఛనంగా విడుదల చేశారని.. దీనినిబట్టి కెనాల్‌ నిర్మాణ పనులు పూర్తికాలేదని ఎవరికైనా బోధపడుతుందని అన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 03:03 AM