పేర్ని గోడౌన్‌లో బియ్యం మాయం కేసులో దర్యాప్తు వేగవంతం
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:25 AM
మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌ల నుంచి 387 టన్నుల పీడీఎస్ బియ్యం మాయం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. గోడౌన్ రికార్డులను పౌరసరఫరాలశాఖ అధికారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ రికార్డుల ఆధారంగా పేర్ని నాని లారీలు ఎక్కడకు తరలిపోయాయి అనే అంశాలపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు. ఎస్పీ ఆర్.గంగాధరరావు నేతృత్వంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది వంద మందికిపైగా ప్రత్యేక బృందాలు ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు.
- పోలీసుల అదుపులో పేర్ని నాని గోడౌన్‌ల మేనేజర్ మానస్ తేజ!
- 100 మందికి పైగా పోలీస్ అధికారులు, సిబ్బందితో విచారణ
- జిల్లాలోని అన్ని టోల్‌గేట్‌ల వద్ద పీడీఎస్ బియ్యం లారీల రవాణాపై రికార్డుల పరిశీలన
- గతంలో పనిచేసిన పౌరసరఫరాలశాఖ అధికారుల నుంచి వివరాలు సేకరణ
- నేడు పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటీషన్‌పై తుది నిర్ణయం
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌ల నుంచి 387 టన్నుల పీడీఎస్ బియ్యం మాయం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. గోడౌన్ రికార్డులను పౌరసరఫరాలశాఖ అధికారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ రికార్డుల ఆధారంగా పేర్ని నాని లారీలు ఎక్కడకు తరలిపోయాయి అనే అంశాలపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు. ఎస్పీ ఆర్.గంగాధరరావు నేతృత్వంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది వంద మందికిపైగా ప్రత్యేక బృందాలు ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలోని టోల్‌గేట్‌ల వద్ద పేర్ని నాని గోడౌన్ నుంచి, మచిలీపట్నం తదితర ప్రాంతాల నుంచి పేర్ని నాని గోడౌన్‌లకు బియ్యం లోడుతో వెళ్లిన లారీల నంబర్ల ఆధారంగా అవి ఎటు నుంచి ఎక్కడికి ప్రయాణించాయి అనే అంశంపై పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివరాలు సేకరిస్తున్నారు. జాతీయ రహదారి 216-ఏ బంటుమిల్లి టోల్‌గేట్ వద్ద పేర్ని నాని గోడౌన్‌ల నుంచి ఆరు లారీల పీడీఎస్ బియ్యం కాకినాడ తదితర ప్రాంతాల వైపు తరలిపోయినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం.
హైదరాబాద్‌లో అదుపులోకి..
మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌ల మేనేజర్, పీడీఎస్ బియ్యం మాయం కేసులో ఏ-2 నిందితుడిగా ఉన్న మానస్ తేజను పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. గత 20 రోజులుగా మానస్ తేజ అజ్ఞాతంలోనే ఉన్నాడు. అతని బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మూడు పోలీస్ బృందాలు అతని ఆచూకీ కోసం తెలుగు రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. మానస్ తేజ బంధువులు ఎక్కడ నివాసం ఉంటున్నారు, వారి ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు హైదరాబాద్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతన్ని మచిలీపట్నం తరలించిన పోలీసులు రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ చేస్తున్నారు. ఈ మేనేజర్ బ్యాంకు ఖాతా లావాదేవీలకు సంబంధించిన వివరాలను రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. అతని బ్యాంకు ఖాతాలో ఎవరెవరి నుంచి ఎప్పుడు నగదు జమ అయ్యిందనే అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. లక్షలాది రూపాయలు గోడౌన్ మేనేజర్ బ్యాంకు ఖాతాలో జమ అయినట్లుగా పోలీసులు విచారణలో తేలినట్లు సమాచారం. అయితే మానస్‌తేజను అదుపులోకి ఇంకా తీసుకోలేదని, పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని పోలీస్ అఽధికారులు చెబుతున్నారు. మానస్‌తేజతో పాటు గోడౌన్‌లో పనిచేసే హమాలీలలో కీలకవ్యక్తులు, లారీడ్రైవర్‌లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని బియ్యం తరలింపుపై విచార ణ చేస్తున్నట్లు సమాచారం.
పౌరసరఫరాలశాఖ అధికారులకు నోటీసులు
పేర్ని నానికి సంబంధించిన గోడౌన్‌ను ప్రభుత్వం అద్దెకు తీసుకున్న నాటి నుంచి పౌరసరఫరాలశాఖలో పనిచేసిన అధికారులకు పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌లుగా, ఇన్‌చార్జి మేనేజర్‌లుగా పనిచేసి శ్రీధర్, రాజు, సతీష్, సృజనలకు ఆర్‌పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరి నుంచి పోలీసులు వివరాలు సేకరించి రికార్డు చేస్తున్నారు. పేర్ని నాని గోడౌన్‌లలో ఎన్ని నెలలకు ఒకసారి తనిఖీలు నిర్వహించారు? ఆ సమయంలో గోడౌన్‌లలో ఉన్న స్టాక్ వివరాలు నమోదు, తనిఖీలు సకాలంలో చేయకపోవడానికి గల కారణాలు, వార్షిక తనిఖీల్లో విజిలెన్స్, ఇతరత్రాశాఖలు ఇచ్చిన ఆడిట్ రిపోర్టులు తదితర అంశాలపై పౌరసరఫరాలశాఖ అధికారుల నుంచి పోలీసులు వివరాలు రాబడుతున్నారు. ఇప్పటికే కొంతమంది అధికారులు విచారణ నిమిత్తం రాగా, మిగిలిన వారిని ఒకటీ రెండురోజుల్లో రావాలని నోటీసులు అందజేశామని ఆర్‌పేట సీఐ ఏసుబాబు తెలిపారు. గోడౌన్‌లను తనిఖీ చేసే సాంకేతిక సిబ్బంది నుంచి సైతం పోలీసులు వివరాలు రికార్డు చేస్తున్నారు. గోడౌన్‌లను అద్దెకు తీసుకున్న నాటి నుంచి ఏయే నెలల్లో అధికారులు పరిశీలన చేశారనే వివరాలు రాబట్టి, పోలీసులు తమ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా ఏయే నెలల్లో బియ్యం లెక్కల్లో తరుగు అధికంగా ఉందనే అంశంపై వివరాలు నమోదు చేసుకుంటున్నారు. అధిక మొత్తంలో బియ్యం లెక్కల్లో తేడాలు ఉన్నట్లు పోలీసులు విచారణలో వెల్లడవుతున్నట్ల్లు సమాచారం.
అగ్రిమెంట్ దస్తావేజులు కానుమోలు తెచ్చారా!
పేర్ని నానికి సంబంధించిన గోడౌన్ అగ్రిమెంట్ ఈ ఏడాది జనవరి నెలలో రెన్యువల్ చేశారు. ఈ అగ్రిమెంట్ పత్రాలను హనుమాన్‌జంక్షన్ సమీపంలోని కానుమోలు నుంచి తీసుకువచ్చి వాటిపై సంతకాలు చేయించడం గమనార్హం. ఈ ఒప్పంద పత్రాలపై అధికారులు ఎప్పుడు సంతకాలు చేశారనే అంశంపై ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి నిజాలు నిగ్గుతేల్చాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేయడంతోపాటు మచిలీపట్నం తాలూకా పోలీసులకు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశారు.
ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు
పీడీఎస్ బియ్యం మాయం కేసులో ఈ నెల 10వ తేదీన గోడౌన్ యజమానిగా ఉన్న పేర్ని జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆమె జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్ పలుమార్లు వాయుదా పడింది. సోమవారం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఒకవైపు బియ్యం మాయం కేసులో పోలీసులు విచారణ చేస్తున్నారు. పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది.